గ్రౌండ్ లో ధోనీ ఉంటే.. వీక్షకుల గ్యాలరీలో అతనుండాల్సిందే: ఓ 104 ఏళ్ల వీరాభిమాని కథ ఇది!

మనదేశంలో సినీతారలు, క్రికెటర్లకు ఫ్యాన్స్ ఎక్కువ. ఎక్కువమ్ముడుపోయే సబ్జెక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే కూడా అవే. ఈ రెండు రంగాలపై ఎంతో కొంత అభిమానం కల్గి ఉండేవారితో పాటు.. వీరాభిమానులు.. సోషల్ మీడియాలో ఒకరిపై ఇంకొకరు దుమ్మెత్తిపోసుకునేవారు తెల్లార్లేస్తే కనిపిస్తుంటారు. ఆటనో, నటననో, ఏదైనా ప్రొఫెషన్ లో ప్రతిభావంతులనో వారి ప్రతిభాధారంగా ఇష్టపడేవారు కొందరైతే.. ఇక అభిమానం వెర్రితలలు వేసి పీక్ కు వెళ్లినవారు మరికొందరు. ఈ రెండు రకాలనూ కాస్సేపు పక్కనబెడితే… అభిమానానికి పర్యాయపదంలా కనిపించే మరో వీరాభిమానిని మనం ఓసారి పరిచయం చేసుకుందాం. ఐపీఎల్ సీజన్ మళ్లీ ప్రారంభమైన సందర్భంగా ఈ స్టోరీపై ఓ లుక్కేయొచ్చు.

ఔనూ.. ఎంతసేపూ క్రికెటర్స్, సెలక్టర్స్, అంపైర్స్, బీసీసీఐ చైర్మన్స్, ఐపీఎల్ జట్ల బ్రాండ్ అంబాసిడర్స్ గురించేనా మాట్లాడుకోవడం..? అందుకే.. ఇప్పుడో సగటు అభిమాని గురించి చెప్పుకుందాం. ఆయనే ఎస్. రాందాస్.

ఎస్. రాందాస్ చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ఫ్యాన్. ఎంత అంటే.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో ఆట మొదలెట్టిన్నాట్నుంచి.. ఇప్పటివరకూ ఆ జట్టు ఎక్కడ ఏ జట్టుతో.. ఏ స్టేడియంలో మ్యాచ్ ఆడినా.. అక్కడ రాందాస్ వాలిపోవాల్సిందే.

మరి రాందాస్ వయస్సెంతనుకుంటున్నారు…? ఎక్కడ మ్యాచ్ జరిగినా అక్కడ రాందాస్ ఉంటున్నాడంటే.. బహుశ కుర్రాడై ఉంటాడు.. పిచ్చి పీక్ కు ఎక్కి వాలిపోతున్నాడేమో అనిపిస్తుందా..? కానీ, రాందాస్ వయస్సే ఇక్కడ ఆశ్చర్యపర్చే అంశం. సీఎస్కే స్పెషల్ అయిన ధోనీ ఐపీఎల్ లో సెంచరీ కొట్టలేదుగానీ… రాందాస్ వయస్సులో మాత్రం సెంచరీ కొట్టేశాడు. రాందాస్ వయస్సు అక్షరాలా ఇప్పుడు 104 ఏళ్లు మరి.

103 ఏళ్ల వయస్సులోనూ రాందాస్ సీఎస్కే మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో అప్పట్లో వైరల్ గా మారడంతో.. ఈ ఫ్యాన్ కథ వెలుగులోకొచ్చింది.

ఐపీఎల్ ప్రారంభమైన్నాట్నుంచి ఐదుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్ గా నిల్చిన చెన్నై సూపర్ కింగ్స్ ను.. ప్రతీ మ్యాచులోనూ రాందాస్ అనుసరిస్తూనే ఉన్నాడు. రాందాస్ షుగర్ పేషంట్ అయినప్పటికీ.. సీఎస్కే మ్యాచ్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందే టిక్కెట్స్ బుక్ చేయించుకుని స్టేడియంలో వాలిపోతాడు. అలా ఒక్క ఐపీఎల్ గేమ్ ను కూడా మిస్ కాకుండా.. క్రికెట్ స్టార్లను మించిన ఆసక్తిని కనబర్చేలా 103 ఏళ్ల వయస్సులో ఓ కొత్త రికార్డును సృష్టించాడు ఈ వృద్ధ అభిమాని.

1920లో కోయంబత్తూర్‌లోని ఉడుమలైపేట్టైలో జన్మించిన రాందాస్.. పీయూసీ పూర్తి చేసి.. ఎయర్ రైట్ ప్రికాషన్ అనే బ్రిటీష్ మిలటరీ ఆర్మీలోని ఓ యూనిట్ లో పనిచేశాడు. తిరుచ్చిరాపల్లిలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన రాందాస్.. నాటి నుంచీ తానూ చురుకుగా క్రికెట్ ఆడేవాడు. అలా ఆటపై మక్కువేర్పడి.. అది కాస్తా ధోనీపైకి.. అలా అలా చెన్నై సూపర్ కింగ్స్ పై మక్కువను పెంచి.. 103 ఏళ్లైనా.. ఏజ్ అంటే జస్ట్ నంబర్ మాత్రమేనన్నంత అభిమానాన్ని చాటిచెబుతూ.. క్రికెటర్లు, సెలబ్రిటీల వలే.. ఓ అభిమాని కూడా వార్తల్లో పతాకశీర్షికలకెక్కగలడని నిరూపించాడు.

తాను 103 ఏళ్ల వయస్సున్న యువకుణ్నేనంటారు రాందాస్. పైగా సీఎస్కే జర్సీ ధరించి మరీ స్టేడియంలో.. ఓవైపు క్రికెట్ చూడాలా.. లేక వచ్చిన వీక్షకులు రాందాస్ ను చూడాలా అన్నట్టుగా అలరిస్తుంటాడు. ఈమధ్య జరిగిన సీఎస్కే మ్యాచులో రాందాస్ కుమారుడు పక్కనే కూర్చుని.. తన తండ్రి ఇంకా ఎలాంటి మెమరీ కల్గి ఉన్నాడు.. ఆటగాళ్లనెలా గుర్తుపడతాడో పక్కనున్నవాళ్లకు చూపించే క్రమంలో.. ధోనీ, రవీంద్ర జడేజా, సురేష్ రైనా ఉన్న ఫోటోను చూపించి.. ఎవరెవరో గుర్తు పట్టమంటే.. ఠకీమని చెప్పేశాడంటే.. ఆయన మైండ్ క్రికెట్ పై ఎంత ధ్యాసగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తన తండ్రి వల్ల తమకూ క్రికెట్ పై ఆసక్తి పెరిగిందంటాడు రాందాస్ కొడుకు. తనతో పాటు.. తన ఫ్రెండ్ సర్కిల్ కూ క్రికెట్ పై అమితాసక్తి నెలకొనడానికి తన తండ్రే కారణమంటాడు. ఐపీఎల్ ప్రారంభమైన్నాట్నుంచీ సీఎస్కే ప్రతీ మ్యాచ్ చూస్తున్న తన తండ్రి.. మొత్తం మ్యాచ్ చూడగలడా ఈ వయస్సులో అని అనుకుంటామని.. కానీ, మనకు కాస్త బోర్ కొట్టినా.. తన తండ్రి రాందాస్ మాత్రం మొదటి బాల్ ప్రారంభమైనప్పటి నుంచీ… మ్యాచ్ ముగిసే చివరి బాల్ వరకూ చూస్తాడంటాడతను. ఢిల్లీలో సీఎస్కే మ్యాచ్ జరిగినప్పుడు.. అంత దూరం ఈ వయస్సులో వెళ్లగలరా.. ఆ మ్యాచ్ ఇప్పుడవసరమా అంటే తగ్గేదేలే అంటాడని.. అవసరమైతే తాను నడుచుకుంటు వెళ్లైనా ఆ మ్యాచ్ చూసొస్తానంటాడని ఆయన కుమారుడు చెప్పే మాట.

అంతేకాదు.. ధోనీ మనల్నేమైనా పిల్చాడా.. ఇప్పుడెళ్లి ఆయన్ని చూడాలా.. మ్యాచ్ అవసరమా అన్నట్టుగా మాట్లాడితే..? ఏస్, కచ్చితంగా వెళ్లాల్సిందే.. వెళ్లి చూడాల్సిందే.. ధోనీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాలిపోవాల్సిందే.. ఆయన గ్రౌండ్ లో అడుగుపెట్టడమే పిలవడంలాంటిదేనంటూ ధోనీపై తన అభిమానాన్ని చాటుతుంటాడు ఈ డైహార్డ్ ఫ్యాన్. తన కొడుకు మ్యాచుకు తీసుకెళ్లక తప్పని పరిస్థితుల్లో రాందాస్ అభిమానం 104 ఏళ్ల వయస్సులోనూ ఇంకా కొనసాగుతూనే ఉండటం కొసమెరుపు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles