ప్రెస్ నోట్స్, ప్రెస్ మీట్స్ అంతా పాత పద్ధతి… రహస్యంగా జరగాల్సిన అండర్ వరల్డ్ నేరాలను సోషల్ మీడియా ద్వారా కుండబద్ధలు కొట్టి ఆ నేరం తమదేనని క్లెయిమ్ చేసుకోవడం కొత్త పద్ధతి. ఈ పద్ధతే ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుల మెడకు చుట్టుకుంటోంది. అమెరికా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ గ్యాంగ్ స్టర్స్ అందరికీ ఉచ్చు బిగుస్తోంది. మోస్ట్ వాంటెండ్ క్రిమినల్స్ గా ప్రకటనలు విడుదల చేసి వెతుకుతోంది.
అమెరికా ఎఫ్బీఐ అభియోగపత్రాలు ఇప్పుడు పంజాబ్ గ్యాంగ్స్ అంతర్జాతీయ నేర సామ్రాజ్యాన్ని మరింత వెలుగులోకి తెస్తున్నాయి.

సాంప్రదాయ అండర్ వరల్డ్ పాటించే రహస్య విధానాలను పూర్తిగా పక్కనబెట్టి.. లారెన్స్ బిష్ణోయ్ వ్యవస్థీకృత నేర ప్రపంచంలో కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టాడు. గోప్యంగా ఉంచాల్సిన నేరాలను.. నేరం జరిగిన వెంటనే సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ వాటిని తామే చేసినట్టు క్లెయిమ్ చేసుకోవడం పరిపాటిగా మారింది. ఈ డిజిటల్ బ్రాండింగ్ వ్యూహం అమలుతో హింసాత్మక ఘటనలను ప్రచారం చేయడం… అందులో భాగంగా వీడియోలు, స్క్రీన్ షాట్స్, సందేశాల వంటివి ప్రెస్ రిలీజ్ మాదిరిగా సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ప్రపంచవ్యాప్తంగా తన గ్యాంగంటే భయాన్ని నింపేందుకు యత్నం జరుగుతోంది.
అయితే, చివరకు ఇదే సోషల్ మీడియా ప్రచారం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్స్ కొంపముంచింది. బహిరంగంగా నేరాలను ప్రచారం చేయడం.. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల దృష్టిలో పడింది. దీంతో అమెరికా అధికారులు విస్తృతస్థాయిలో దర్యాప్తు చేసి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పైన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఎఫ్బీఐ ఫోకస్ చేయడంతో మరోసారి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగులు అంతర్జాతీయ స్థాయిలో ఎలా విస్తరించాయనే విషయం వెలుగులుకొచ్చింది.
అమెరికా అభియోగపత్రాల్లో జగ్గు భగవాన్ పురియా, సుఖ్ రాజ్ కాంగ్, గోల్డీ బ్రార్, రవీందర్ సింగ్ ధండా వంటి వారందరి పేర్లూ… లారెన్స్ బిష్ణోయ్ తో కలిపి ప్రస్తావించబడ్డాయి. అక్రమ వలసల అవకాశాలను ఉపయోగించుకుని అమెరికా, కెనడాల్లో ప్రవేశించిన పంజాబ్ కు చెందిన నేరగాళ్ల నెట్వర్క్ ఎంత విస్తృతంగా ఉందో ఎఫ్బీఐ అభియోగపత్రాలు వెల్లడించాయి. అయితే ఈ మొత్తం పంజాబ్ కేంద్రిత నెట్వర్క్ లో.. ఇతర రాష్ట్రాలకు సంబంధించి.. రాజస్థాన్ కు చెందిన రోహిత్ గోదారా మాత్రమే మోస్ట్ వాంటెడ్స్ లో ఒకే ఒక్కడిగా నిల్చాడు.
ఎఫ్బీఐ ఛార్జ్ షీట్ ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ బాల్య స్నేహితుడైన సతీందర్ జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ ఉత్తర అమెరికాలోని కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండగా.. సుఖ్ రాజ్ సింగ్ కాంగ్ భారత్ వ్యవహారాలను చూస్తున్నాడు. రోహిత్ గోదారా యూరప్ నెట్వర్క్ కు నాయకత్వం వహిస్తున్నాడు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు ట్రక్కింగ్ వ్యాపారంలోకి కూడా చొరబడ్డట్టుగా ఎఫ్బీఐ ఆరోపిస్తోంది. పంజాబ్ కు చెందిన యువత అధిక సంఖ్యలో పనిచేసే ఈ రంగంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఎఫ్బీఐ పేర్కొంది.
బిష్ణోయ్, సుఖ్ రాజ్ కాంగ్, గోల్డీ బ్రార్ కలిసి అమెరికాలో కోకైన్, మెథాంఫెటమైన్ వంటి డ్రగ్స్ భారీ ట్రక్కుల ద్వారా కెనడా సరిహద్దులకు తరలించే మార్గాలను పర్యవేక్షిస్తున్నారని.. ఆ రవాణాకు రక్షణ కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారన్నది ప్రధాన అభియోగం.
భారత్ లోనూ, విదేశాలకు వలస వెళ్లిన భారతీయ ప్రముఖ సాంస్కృతిక, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నట్టుగా కూడా ఛార్డ్ షీట్ చెబుతోంది.
ఉద్ధేశపూర్వకంగానే సోషల్ మీడియాలో తమ నేరాల వీడియోలు, క్లిప్పింగ్స్, స్క్రీన్ షాట్స్, సందేశాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో.. ముఖ్యంగా తమ టార్గెట్స్ లో భయాన్ని నింపడమే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్స్ పనిగా ఎఫ్బీఐ చెబుతోంది. పైగా తమల్ని చట్టాలేం చేయలేవనే సందేశాన్ని కూడా ఇస్తూ ఇష్టారాజ్యంగా నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. ప్రముఖ పంజాబీ గాయకుడైన సిద్ధూ మూసేవాలా మర్డర్ కేసుతో పాటు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపుల వంటి ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించింది.
అమెరికా అభియోగపత్రాల ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ నెట్వర్క్ విదేశాలకు వెళ్లాలనుకునే యువతను పెడమార్గం పట్టించింది. వారి ఆకాంక్షలను బలహీనతలుగా మార్చుకుని దుర్వినియోగం చేసింది. మెరుగైన ఉపాధి, విద్యావకాశాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే పేద, అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని విద్యార్థి వీసాలు.. లేదా, ఉద్యోగ వీసాల పేరుతో ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకు తరలించడానికే ఒక వ్యవస్థనేర్పాటు చేసుకుంది.
ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగులో కీలకంగా వ్యవహరిస్తూ… ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో సుమారు 43 లక్షల ఇండియన్ కరెన్సీ బహుమతితో ప్రకటించబడ్డ గోల్డీ బ్రార్ కూడా ఈ అక్రమ వలస మార్గంలో వచ్చినవాడిగానే ఎఫ్బీఐ చెబుతోంది. విదేశాలకు చేరుకున్న తర్వాత యువకులకు సాయం చేస్తామన్నవారు.. వారిని తమ నేర ముఠాల్లో సభ్యులుగా మారుస్తున్నారన్నది మరో ప్రధాన అభియోగం.
వలస బాట పట్టిన యువతను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుకు ఫుట్ సోల్జర్స్ గా మార్చి.. కీలక బాధ్యతలు అప్పగించినట్టుగా కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. తమ టార్గెట్స్ కదలికలను గమనించడం.. అక్రమంగా వచ్చిన డబ్బు నిర్వహణ.. ఆయుధాల పంపిణీ… సరిహద్దులు దాటి వసూళ్లు చేయడం.. లక్ష్యంగా చేసుకున్నవారిపైన దాడుల వంటి నేరాల్లో ఈ యువతను వినియోగిస్తున్నట్టుగా కూడా ఎఫ్బీఐ పేర్కొనడంతో పాటే.. ఇప్పుడు ఈ గ్యాంగ్స్ పై అమెరికా సీరియస్ గా దృష్టి పెట్టింది. సాధారణంగా దొంగ చేతికి తాళాలిచ్చినట్టని ఓ సామెత. అలాగే, తమ నేరాలను బాహాటంగా ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి… బిష్ణోయ్ గ్యాంగ్, దర్యాప్తు సంస్థలకు తమ పనిని సులువు చేసిందనే అభిప్రాయాలకు తెరలేపింది.



