బాస్ ఎక్కువా కాదు.. డ్రైవర్ తక్కువా కాదు: ఆసక్తి రేపుతున్న ఓ డాక్టర్ షేరింగ్ స్టోరీ!

బాస్ ఎక్కువ… సబార్డినేట్ తక్కువ అని బలంగా ముద్రపడిపోయిన సమాజంలో.. ఒక స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాను ఆలోచింపజేస్తోంది. అందుకు భిన్నమైన ఓ ఉదాహరణను ఓ హార్ట్ సర్జన్ షేర్ చేసుకున్నారు.

ఓ ఉద్యోగి శస్త్ర చికిత్సకు ఓ యజమాని ఆర్థిక సాయమందించిన కథే కాదు… తన తోటి ఉద్యోగి పట్ల ఆ యజమానికున్న కృతజ్ఞతకు ప్రతీక ఈ కథ.

ఈ ఘటనను డాక్టర్ ప్రశాంత్ మిశ్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ డ్రైవర్ కు బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రైవేట్ హాస్పిటల్ లో అయితే 4 లక్షల 25 వేల రూపాయల ఖర్చవుతుందని.. ప్రభుత్వాసుపత్రిలో అయితే ఖర్చు తగ్గుతుందని మిశ్రా వారికి సూచించారు.

విషయం తెలిసిన యజమాని.. డ్రైవర్ బైపాస్ సర్జరీకి కావల్సిన 4 లక్షల 25 వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. తెల్లవారే డ్రైవర్ కుమారుడు వచ్చి నాన్నకు ఇక్కడే ఆపరేషన్ కు సిద్ధం చేయండని డాక్టర్ ప్రశాంత్ మిశ్రాతో చెప్పాడు. ఆపరేషన్ అయిపోయిన వెంటనే మిశ్రాకు ఆర్టీజీఎస్ ద్వారా ఆపరేషన్ కు ముందు తీసుకున్న అడ్వాన్స్ కాకుండా.. మిగిలిన మొత్తం కూడా బదిలీ అయింది.

ఆపరేషన్ కూడా విజయవంతమైంది. ఆర్టీజీఎస్ ద్వారా డబ్బు అందుకున్న వైద్యుడు ప్రశాంత్ మిశ్రా సదరు యజమానికి ఫోన్ చేసి ఆపరేషన్ సక్సెస్ అయింది.. మీ డ్రైవర్ శుక్లా పట్ల మీ కృతజ్ఞత ముచ్చటేసింది. ధన్యవాదాలని చెప్పారు.

డాక్టర్ ను ఆశ్చర్యపర్చిన యజమాని మాటలు!

దానికి ప్రతిగా నా సహోద్యోగిని శ్రద్ధగా చూసుకుని ఆపరేషన్ విజయవంతం చేసినందుకు నేనే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన మీ డ్రైవర్ కదా.. సహోద్యోగి అంటున్నారనే డౌట్ ను డాక్టర్ వ్యక్తపర్చారు. పదిహేనేళ్లుగా శుక్లా నాతోనే పని చేస్తున్నారు. నేనూ పని చేస్తున్నాను. ఆయనా తన పని చేస్తున్నారు. మా ఇద్దరి బాధ్యతలు వేర్వేరు కావచ్చునేమోగానీ.. మేమిద్దరం కలిసే పదిహేనేళ్ల నుంచి పని చేస్తున్నాం. కాబట్టి మేమిద్దరమూ సహోద్యోగులమే అన్న జవాబు ఆ యజమాని నుంచి ఎదురైంది. దాంతో డాక్టర్ ప్రశాంత్ మిశ్రాకు నోట మాట కూడా రాలేదట. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇళ్లల్లో పనిచేసేవాళ్లు, సహోద్యోగులు, సబార్డినేట్స్ ను, సహాయక సిబ్బందిని ఎప్పుడూ తక్కువ చేసి చూడకూడదనే విషయం ఆయన మాటలతో మరోసారి బోధపడిందన్నారు డాక్టర్ ప్రశాంత్ మిశ్రా.

మన జీవితాలు సజావుగా సాగడంలో మనతో పనిచేస్తున్నవారందరి పాత్రా ఎంతో కీలకం. అందుకే వారికీ సమానమైన ఆత్మగౌరవం, మర్యాద దక్కాలనే మోటో ఆ యజమాని మాటల్లో కనిపించిందంటూ ఆయన షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది.

ఆర్థిక సాయం అందించడమే కాదు.. ఉద్యోగిని తన కింద పనిచేస్తున్నాడనకుండా.. తనతో కలిసి పనిచేస్తున్నాడని ఒక సహోద్యోగిగా గుర్తించిన యజమానిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు.

ఈ స్టోరీకి లింక్డ్ గా చాలా కొత్త కథలు కూడా మిశ్రా పోస్ట్ కింద కామెంట్స్ రూపంలో వెల్లువెత్తాయి.

ఓ వ్యక్తి చేసిన పోస్టులో తన ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి కోసం సిప్ ప్రారంభించినట్టు.. సరిగ్గా 10 నుంచి 12 ఏళ్ల తర్వాత ఆమె పని నుంచి విరమించుకునే సమయానికి ఒక పెద్ద మొత్తం ఆమె పేరిట ఉండేలా చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు లభించే భవిష్యనిధి తరహాలోనే మా ఇంట్లో పనిచేసే వ్యక్తికీ అలాంటి భద్రత ఉండాలన్న సంకల్పంతో ఆ సిప్ ఆమె పేరిట తీసినట్టు ఆ నెటిజన్ తెలిపాడు.

చాలా కొద్దిమందికే ఈ విషయం అర్థమవుతుంది. మన సమాజంలో శ్రమకు తగ్గ గౌరవం అనే భావన చాలాకాలంగా బలహీనంగానే కనిపిస్తోంది. ఇప్పటికీ ఇంకా అవే పరిస్థితులు చూస్తున్నామని ఒకరంటే.. కొద్దిపాటి గౌరవం, దయ, కృతజ్ఞత ఉంటే ఈ సమాజం మరింత బాగుంటుందని మరొకరు పోస్ట్ చేశారు.

మొత్తంగా ఓ యజమానికి, ఆయనతో కలిసి పనిచేసే ఓ సహోద్యోగికి మధ్య కృతజ్ఞతా బంధాన్ని చాటిన ఈ కథ ఎందరినో ఆకట్టుకుంటోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles