బాటిల్ వాటర్.. ఓ పెద్ద స్కామ్! డాటా విశ్లేషణ సంస్థలేం చెబుతున్నాయి..?

నరేష్కుమార్ సూఫీ…✍️

మీరు మనిచినీళ్లు తాగకుండా ఎంతసేపు ఉండగలరు? మామూలుగా అయితే ప్రతీరోజుకీ ఒక మనిషి కనీసం 3-4 లీటర్ల మంచినీళ్లు తాగాల్సిందే. అయితే మనం తాగే నీళ్లన్నీ మంచినీళ్లేనా? అసలు మంచినీళ్లు అంటే ఏమిటి? టాప్‌లో వచ్చే నీళ్లా లేకపోతే మినరల్ వాటర్ పేరుతో మనం మార్కెట్లో కొనే ప్యాకేజ్డ్ వాటరా? దీనికంటే ముందు మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. మంచినీళ్ల పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోంది. అదీ చిన్నా చితకా స్కామ్‌ కాదు.. దీనివలవ లక్షల కోట్లు. మీరు వింటున్నది నిజమే మనం తాగే నీళ్లమీద రకరకాల కాన్స్పైరసీ థియరీలతో వాటర్ కంపెనీలు దోచుకుంటున్న డబ్బు ఒక సంవత్సరానికి 20లక్షల కోట్లకంటే ఎక్కువే.

గడిచిన పదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వాడకం ఏకంగా 70 శాతానికి పైగా పెరిగింది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్లలో ఇది కూడా ఒకటి. అందుకు నిదర్శనం కొన్నేళ్ల క్రితం వరకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీళ్లు కొనుక్కొని తాగడం కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేసింది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ప్యాకేజ్డ్ వాటర్ ప్లాంట్లు కనిపిస్తున్నాయి. జర్మనీకి చెందిన ప్రముఖ డేటా విశ్లేషణ సంస్థ స్టాటిస్టా అందించిన వివరాల ప్రకారం 2023లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 28 లక్షల కోట్ల రూపాయల ప్లాస్టిక్ బాటిళ్ల నీటి వ్యాపారం జరిగింది. వచ్చే ఆరేళ్లలో అంటే 2030 నాటికి ఇది ఏకంగా 40 లక్షల కోట్ల నుంచి 42 నుంచి 43 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా, చైనా, మెక్సికో ఇండోనేషియా తదితర దేశాల్లో అధిక వినియోగం కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే బాటలో మనదేశం కూడా చేరబోతోంది.

2022లో మన దేశంలో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ మార్కెట్ వ్యాపారం విలువ సుమారు లక్ష 80 వేల కోట్లు , మరో ఆరేళ్లలో ఈ మార్కెట్ విలువ సుమారు 3లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా.
ఇంట్లో ఉంటే మినరల్ 20 లీటర్ల వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నాం. బయటికి వెళ్తే ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ కొంటున్నాం. ప్రయాణాలలో అంటే తప్పదు కాబట్టి కొంటున్నాం కానీ రెస్టారెంట్స్‌లో, సినిమా హాల్స్‌లో ఆఖరికి ఫక్షన్లలో కూడా వాటర్ బాటిల్స్ ఎందుకు కొంటున్నాం? అక్కడ మనం మామూలు మంచినీళ్ళు తాగే అవకాశం ఉన్నా ట్యాప్స్ పెట్టకుండా, మనతో వాటర్ బాటిల్ కొనిపించటానికి చేసే వ్యాపార ఎత్తుగడే ఇది. కావాలనే మనకి ఈ ప్యాకేజ్డ్ వాటర్ అలవాటు చేస్తున్నారు.

అయితే ఆరోగ్యం కోసం తప్పదు కదా అంటారా? నిజమే కానీ, ఆరోగ్యానికీ, ఈ మినరల్ వాటర్ బాటిల్‌కీ ఏమిటి సంబంధం? బాటిల్డ్ వాటర్ అంత ప్యూర్‌గా ఉంటుందా? నిజంగా ప్రకటనల్లో మనం చూసేవన్నీ నిజాలేనా? ఒకప్పుడు బావుల్లో నీటిని బొక్కెనతో చేదుకొని తాగిన మనం ఇప్పుడు మాత్రం ట్యాప్ వాటర్ని కూడా తాగటం లేదు అయినా ఒకప్పటికంటే ఇప్పుడే ఆరోగ్య సమస్యలు పెరిగాయే తప్ప తగ్గటం లేదు కదా అని ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగ బాటిల్డ్ వాటర్ అంత మంచిదైతే భారత ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్లాస్టిక్‌ క్యాన్స్‌, బాటిల్స్‌లో అమ్మే ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌, మినరల్‌ వాటర్‌ను ‘హై-రిస్క్‌ ఫుడ్‌’ క్యాటగిరీలో ఎందుకు చేర్చింది?


నిజానికి మనం తగే ట్యాప్ వాటర్ మరీ అంత దారుణమైనదేమీ కాదు మామూలు ఫిల్టర్ తో ఒకసారి ఫిల్టర్ చేసి తాగితే సరిపోతుంది. కానీ వాటర్ బాటిల్ కంపెనీలకు మాత్రం అది నచ్చదు. ఎందుకంటే మనమంతా ఈ నీళ్ళని తాగితే మరి వాళ్ల బాటిల్ ఎవరు కొంటారు? అందుకే ఒక ప్రచారం మొదలైంది “మా నీళ్లలో మినరల్స్ ఉన్నాయి, మా బాటిల్‌లో ఆక్సీజన్ ఉంది అంటూ వింత వింత ప్రకటనలతో మనల్ని బుట్టలో వేసుకోవటానికి చూస్తుంటారు. అందుకే బాటిల్ వాటర్ శతాబ్దపు అతిపెద్ద స్కామ్‌ల్లో ఒకటిగా తయారైంది. ఒక సంవత్సరానికి ఈ మర్కెట్ విలువ 25లక్షల కోట్లు దాటిందంటేనే అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా అదే విషయాన్ని తన వెబ్ సైట్లో పేర్కొంది.

ముఖ్యంగా హెచ్ఐవీ, డయాబెటిస్, అవయవమార్పిడి చేసుకున్న రోగులు, కిమోథెరపీ చేయించుకుంటున్నవారు ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం అత్యంత ప్రమాదకరం అని హెచ్చరిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగాల్సి వస్తే కచ్చితంగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. నిజానికి ఈ నీళ్లతో పోల్చితే శుభ్రపరిచిన కుళాయి నీళ్లు చాలా మంచివని అనేక పరిశోధనల్లో తేలింది. కానీ గడిచిన పదేళ్ల కాలంలో మంచి నీళ్లు అంటే ప్యాకేడ్జ్ వాటర్ అనే నమ్మకం బలంగా జనంలో పెరిగిపోయింది. కానీ తాజా పరిశోధనలు చెబుతున్న వాస్తవాలు మత్రం వేరుగా ఉన్నాయి.

గత కొంతకాలంగా చాలా మంది 20 లీటర్ల బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ ఈ బాటిళ్లలో చాలా వరకు బ్రాండ్ లేనివి అంటే అవి ఏ కంపెనీకి చెందినవి, నీటిని ఎక్కడి నుంచి ప్రాసెస్ చేస్తారు వంటి వివరాలు లేవు. మినరల్ వాటర్ పేరుతో విక్రయించే ఈ నీరు కిడ్నీలకు ప్రమాదకరం. కొంత కాలంగా పేరు లేని బాటిళ్లలో నీటి విక్రయాలు ఎక్కువయ్యాయి.ఏదైనా సందర్భం వచ్చినప్పుడు లేదా ఇంట్లో తాగునీరు లేనప్పుడు ఈ రకమైన అన్‌బ్రాండెడ్ వాటర్ క్యాన్లు తీసుకొచ్చుకుంటుంటాం.భారత ఆహార భద్రత, ప్రమాణాల మార్గదర్శకాల ప్రకారం ఈ విధంగా విక్రయించే నీటిని సీలు చేయాలి. ఉత్పత్తి పేరు, ప్రాసెసర్ చిరునామా, బ్యాచ్ నంబర్, శుద్ధి చేసే విధానం, నీరు ఎంతకాలం ఉంటుంది వంటి వివరాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. కానీ ఇవేవీ మన ఇళ్ళకు వచ్చే 20 లీటర్ల క్యాన్ మీద ఉండవు. ప్రతీ కాలనీలోనూ ఇష్టానుసారం బాటిళ్లను తయారు చేసి నీళ్లు నింపి అమ్ముతున్నారు. చాలా సార్లు ఈ 20 లీటర్ వాటర్ బాటిళ్లను సరైన క్లీనింగ్ లేకుండానే నీటితో నింపి సప్లై చేస్తారు. వీటిమీద ఏ నియంత్రణా లేకపోవటం కూడా ఒక కారణం. బ్రాండ్ లేకుండా విక్రయించే కార్బా నీటిలో మినరల్ బ్యాలెన్స్ చాలా తక్కువ. ఈ నీళ్లని తాగడం వల్ల మన శరీరంలోని ఖనిజ సమతుల్యత దెబ్బతింటుంటుంది. మనం తాగే నీటిలో ఉప్పు, కాల్షియం, సోడియం, బోరాన్ వంటి మూలకాలు ఉండాలి. అయితే ఈ అన్‌బ్రాండెడ్ కార్బా నీటిలో అలాంటివి ఉండవు. ఈ నీళ్లని తాగడం వల్ల నీటి ద్వారా బి12 లోపం, కిడ్నీ ఎఫెక్ట్, లివర్ సైడ్ ఎఫెక్ట్, క్యాన్సర్ తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నరు డాక్తర్లు.

అయితే ఇక్కడ విషాదం ఏమిటంటే ఈ సలహాలు ఇచ్చే డాక్టర్ల హస్పిటల్స్‌లో కూడా ఇవే వాటర్ బాటిళ్లు వాడుతుండటం. కార్పొరేట్ హాస్పిటల్ క్యాంటీన్లలో, డాక్టర్ల చేతుల్లోనూ ఈ ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్సే కనిపించటం. అంతగా మనల్ని ముంచెత్తింది వాటర్ బాటిల్ మార్కెట్.

పంపు నీటి కంటే బాటిల్ వాటర్ ఖరీదు దాదాపు 2,000 రెట్లు ఎక్కువ అంటే మనం దాదాపుగా ఒక నెలరోజుల మంచినీళ్ల ఖర్చుని ప్యూరిఫైడ్ లేదా మినరల్ వాటర్ పేరుతో ఒక్కరోజులోనే ఖర్చుపెడుతున్నాం. ఒక్క మనదేశంలోనే కొన్ని వేల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కంపెనీస్ ఉన్నాయి. పెద్ద బ్రండ్ల పేర్లకు పేరడీగా తయారు చేసిన సీసాలు మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి. నిజానికి బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్‌లో మనం కొంటున్న బాటిల్ మీద ప్రేర్లనీ, ఐఎసై మార్కునీ గమనించకుండా అలా కొనేస్తుంతాం కానీ ఒక్కసారి కాస్త టైం తీసుకొని పరిశీలిస్తే బుర్ర తిరిగిపోతుంది. మీ కిన్లే అనుకున్న బాటిల్ కిన్-లై అయుండొచ్చు, దానిమీద ఐఎస్సై మార్క్, ఎక్స్పైరీ డేట్, మానుఫాక్చర్ కంపెనీ అడ్రెస్ కూడా ఉందవు. అంటే మన కంగారుని కూడా వీళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఏ ఆరోగ్య ప్రమానాలూ పాటించకుండా సీసాల్లో నీళ్లని నింపి లీటర్‌కి 15 నుంచీ 20 రూపయలు వసూలు చేస్తూ మనల్ని దోచుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం కొలంబియా యూనివర్శిటీ, రట్‌గర్స్ యూనివర్శిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో నివ్వెర పోయే వాస్తవాలు బయటపడ్డాయి. ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లలో నీళ్లు తాగడం అంటే డబ్బిచ్చి రోగాలు కొని తెచ్చుకోవడమేనని తేల్చారు. ప్రతి లీటర్ నీటిలో సుమారు 2 లక్షల 40 వేల నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయని తేల్చారు. నిజానికి ఇవి గతంలో ఊహించిన వాటికన్నా సుమారు 10 నుంచి 100 రెట్లు ఎక్కువ. వీరి పరిశోధన అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురితమైంది. సాధారణంగా ఓ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తయారీనికి 1.5 నుంచి 3 లీటర్ల నీటిని అలాగే సుమారు పావు లీటర్ క్రూడాయిల్‌ను వినియోగిస్తారు. వాటితో పాటు మైక్రో ప్లాస్టిక్ పొడి కూడా కలుపుతారు. ఈ సూక్ష్మమైన పొడి రేణువులతో కూడిన బాటిల్లో నీటిని నిల్వ చేస్తే చాలా సులభంగా ఆ పొడిలోని నానో ప్లాస్టిక్ రేణువులు నీటిలో కలిసిపోతాయి. ముఖ్యంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న చోట ఈ ప్రక్రియ మరింత సులభంగా జరిగిపోతుంది. తాజాగా జరిగిన పరిశోధనల ప్రకారం ఓ ప్లాస్టిక్ నీళ్ల సీసాలో పాలి అమైడ్, పాలీ ఇథలీన్ టెరఫ్తలేట్, పాలీ వినైల్ క్లోరైడ్, పాలీ మిథైల్ మెథాక్రిలేట్లతో పాటు చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువులు గుర్తించి, వాటిపై పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల్లో ఈ ప్లాస్టిక్ సూక్ష్మరేణువులు మనిషి శరీరంపై చూపే ప్రభావం గురించి తెలుసుకొని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఇలాంటి నీటిని తాగితే క్యాన్సర్లు, కిడ్నీ, కాలేయ వ్యాధులు, మధుమేహంల ప్రమాదంతో పాటు బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందని తేలింది. ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలు ఈ నీళ్లను ఎక్కువగా తాగితే ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై కూడా ఉంటుందన్నది వారి రీసెర్చ్‌లో వెల్లడయ్యింది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న వయసులోనే రజస్వల కావడానికి ఈ బాటిళ్లలో నీటి వినియోగం కూడా ఒక కారణమట.

నీటిని కొనుక్కోవడమంటే ఓ 20 ఏళ్ల క్రితం వరకు దేశంలో చాలా విచిత్రంగా చూసేవారు. కానీ గడిచిన దశాబ్ద కాలంలో అది చాలా మాములు విషయంగా మారిపోయింది.

ఓ రకంగా చెప్పాలంటే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ యుగం మొదలైన తర్వాత మొదట్లో దాన్ని తమ డాబు, దర్పానికి ప్రతీకగా చూపించేవారు. కానీ రాను రాను… మంచినీళ్లకు పర్యాయపదం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్‌గా మారిపోయింది. కానీ తాజా పరిశోధనలు మాత్రం.. మళ్లీ బ్యాక్ టు బేసిక్స్ అని చెబుతున్నాయి. ఇప్పటికైనా మేలుకుందాం. ఇంట్లో ఫిల్టర్ చేసిన నీళ్లని, లేదంటే గవర్నమెంట్ సప్లై చేస్తున్న నీళ్లని తాగటం అలవాటు చేసుకుందాం. మన ఓన్ వాటర్ బాటిల్ వాడటం, వీలైనంత వరకూ ఈ మార్కెట్ మంచినీళ్లని అవాయిడ్ చేద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles