థాకరే.. మరాఠా రాజకీయాల్లో ఓ శకం!

వ్యంగ్యమైన కార్టూన్లతో వెటకారాన్ని దట్టించే ఓ కార్టూనిస్టు.. రాజకీయాల్లో ఓ పులిలా ఎదగగల్గడం ఊహించగలమా..? కానీ, అదే జరిగింది… బాలాసాహెబ్ థాకరే రూపంలో.

తన ఆహార్యం, బాడీ లాంగ్వేజ్, చేతిలో సిగార్, ఐకానిక్ గ్లాసెస్, మెడలో రుద్రాక్షమాలతో… హైందవ మతానికి ఐకాన్ లా మహారాష్ట్ర రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన కింగ్ మేకర్ బాలాసాహెబ్. చాలామందికి నచ్చడు. కానీ, అంతే మందికి ఇష్టుడు, ఇంకెంతోమందికి ఆరాధ్యుడుు. సింహాసనంపై తాను కూర్చుంటే ఓ పులినే చూస్తున్నట్టుటుందనేవాళ్లు కొల్లలు. అలా మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన బాలాసాహెబ్ మొట్టమొదట ఓ కార్టూనిస్ట్. నిజాల్ని నిర్భయంగా చెబుతూనే… తన క్యారికేచర్స్ లో వ్యంగ్యాన్ని రంగరించిన ఆర్టిస్ట్.

1940ల్లో ఫ్రీ ప్రెస్ జర్నల్ లో కార్టూనిస్టుగా బాల్ థాకరే తన జీవితాన్ని ప్రారంభించాడు. కలాన్నే కత్తిగా మార్చి షార్పుగా ఆయన సంధించే కార్టూన్స్ ఎందరికో నేరుగా గుచ్చుకునేవి. అలాంటి ఈటల వంటి కార్టూన్స్ తో కెరీర్ ను ప్రారంభించిన బాలాసాహెబే.. ఆ తర్వాత మహారాష్ట్రను శాసించిన నాయకుడయ్యాడు.

కార్టూనిస్టుగా బాలాసాహెబ్!

బాలాసాహెబ్ 1926, జనవరి 23న పూణేలో పుట్టాడు. కార్టూనిస్టుగా ఫ్రీ ప్రెస్ జర్నల్ లో థాకరే వేసిన కార్టూన్స్ కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆలోచనలను రేకెత్తించేవి. నాటి కాలంలోని సామాజిక, రాజకీయ వాస్తవాలను ప్రతిబింబించేలా, వాటిపై అస్త్రాలను సంధిస్తూ సాగాయి.

1960లో తానే మార్మిక్ అనే ఓ మరాఠీ వారపత్రికను ప్రారంభించాడు. మరాఠా రాష్ట్రంలో మహారాష్ట్రీయులే వివక్షకు గురవుతున్న కథనాల వేదికగా ఆ పత్రిక సాగింది. ఆ పత్రికలోనూ థాకరే కార్టూన్ వ్యంగ్యాస్త్రాలకు సామాజిక, రాజకీయ ఇతివృత్తాలే క్యాన్వాస్. ఆ పత్రికే ఆ తర్వాత శివసేన పుట్టుకకు, ఇంతింతై దాని పెరుగుదలకూ బీజం వేసింది.

శివసేన వ్యవస్థాపకుడిగా థాకరే!

1966, జూన్ 19వ తేదీన థాకరే మరాఠీ భూమిపుత్రుల హక్కులను కాపాడే లక్ష్యంతో శివసేన అనే పార్టీని స్థాపించాడు. మరాఠీ మనూస్ అనేది శివసేన నినాదం. ముందుగా మరాఠీల హక్కులకే ప్రాధాన్యతనివ్వాలన్నది ఆ నినాదం సారాంశం. ఆ నినాదాన్ని మహారాష్ట్రలోని కార్మికవర్గమూ సొంతం చేసుకుంది. దానికి తోడు, బాలాసాహెబ్ వాక్చాతుర్యం… మరాఠీల హక్కులను కాలరాసే వారిపట్ల ఆయన మాటల్లో ప్రతిధ్వనించే కాఠిన్యం.. ఆ ప్రాంతీయుల్లో ఆయనపై ఎనలేని అభిమానానికి కారణమైంది. అలా తన ఉత్తేజకరమైన ప్రసంగాలు, ర్యాలీలతో పాటు.. ఆయా ప్రసంగాల్లో ఆయన మిళితం చేసే వ్యంగ్యం, హాస్యం వంటివన్నీ మరాఠీ జనాన్ని అమితంగా ఆకట్టుకునేవి. మేము ఏ మతానికి, సమాజానికీ వ్యతిరేకం కాదు.. కానీ, మా ప్రాంతానికే వచ్చి మా మరాఠీల పొట్ట కొట్టాలని చూస్తే మాత్రం సహించమంటూ మరాఠా సామ్రాజ్యాన్ని తన ఓన్ చేసుకోవడంలో థాకరేది ఘన విజయం.

శివసేన కోసం సామ్నా పత్రిక ప్రారంభం1

పార్టీ గళాన్ని వినిపించేందుకు ప్రత్యేకంగా ఓ పత్రిక ఉండాలని భావించాడు బాలాసాహెబ్. అలా, 1989లో వాయిస్ ఆఫ్ శివసేనగా సామ్నా పత్రికను ప్రారంభించాడు.

థాకరే నినాదాలు, వివాదాలు!

థాకరే ప్రాంతీయవాది. తన ప్రాంతం మీద వలసవాదుల ఆధిపత్యాన్ని అస్సలొప్పుకోని తత్వం ఆయనది. అలాంటి నైజమే ఆయన్నుతరచూ వివాదాల్లోనూ ముందుంచింది 1960ల్లో దక్షిణ భారతదేశం నుంచి మహారాష్ట్రకు వచ్చిన వలసదారులపై ఓసారి, 1990ల్లో ఉత్తర భారతానికి చెందిన వలసదారులపై మరోసారి శివసేన ప్రదర్శించిన దూకుడు వైఖరి విమర్శలకు దారితీసింది. ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొడుతున్నాడని ఆయనపై విమర్శకులు దుమ్మెత్తిపోశారు. కానీ, మరోవైపు ఆయన అభిమానులు, మద్దతుదారులు ఆయన్ను మరాఠాల రక్షకుడిగా కొనియాడారు.

బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత 1992-93 ముంబై అల్లర్ల సమయంలో శివసేన తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టిందని.. అందుకు థాకరే ప్రధాన కారకుడంటూ శ్రీకృష్ణ కమిషన్ తన నివేదికలో ఆరోపించింది. థాకరే మాత్రం దానికి కౌంటర్ అటాక్ గా.. ఒకవేళ నిజంగానే మీరు ఆరోపించినట్టే జరిగితేగనుక.. నేను నా కార్యకర్తల గురించి గర్వపడతాను. వారు తమ మతాన్ని కాపాడుకోవడానికి కదనరంగంలోకి దూకారని భావిస్తానంటూ ఆన్సర్ ఇచ్చాడు.

దేనికీ వెరవని నిర్భయత్వం థాకరే సొంతం!

ఎంత ఖర్చైనా సరే, ఎలాంటి పరిస్థితెదురైనా సరే… సిద్ధాంతమే ముఖ్యం. అవసరమైతే క్షమాపణ కూడా లేని వైఖరే బాల్ థాకరే ఇమేజ్ ను ఇతరులతో పోల్చినప్పుడు ప్రత్యేకంగా నిలబెట్టింది.

2008లో సామ్నాలో బాల్ థాకరే రాసిన ఓ వ్యాసం సంచలం రేపింది. ఏక్ బీహారీ.. సౌ భీమారీ అనే శీర్షికతో ఆ సంపాదకీయం ప్రచురితమైంది. బీహారీలు మహారాష్ట్రలో అవసరం లేని సమూహంగా ఆయన ఆ వ్యాసంలో అభివర్ణించారు.

పాక్ తో క్రికెట్ విషయంలోనూ థాకరేది వ్యతిరేకతే!

పాకిస్థాన్ తో అసలు ఇండియా క్రికెట్ మ్యాచులాడాల్సిన అవసరమే లేదన్నాడు థాకరే. పాక్- ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరిగినా అడ్డుకోమ్మని తన పార్టీ శివసేన కార్యకర్తలకు బహిరంగ పిలుపునిచ్చాడు. గతాన్ని మర్చి మళ్లీ సంబంధాలు నెలకొనేలా క్రికెట్ ఆటతో ఒక్కటవుదమంటూ నాటి హోం మినిష్టర్ సుశీల్ కుమార్ షిండే చేసిన ఓ ప్రకటనపై సామ్నా పత్రిక వేదికంగా ఏకిపారేశాడు థాకరే. మిస్టర్ షిండే పాక్ తో క్రికెట్ ఆడాలని ఎలా అంటున్నారు… గతాన్నెలా మర్చిపోతాం.. ఎందుకు మర్చిపోవాలంటూ కుశల ప్రశ్నలతో కడిగిపారేశాడు.

అంతేకాదు, క్రికెట్ గాడ్ అని చెప్పుకునే సచిన్ నూ సున్నితంగా హెచ్చరించాడు బాలాసాహెబ్. ముంబై ప్రతీ భారతీయుడదంటూ సచిన్ విశాల దృక్పథాన్ని కనబరుస్తూ చేసిన కామెంట్స్ థాకరే ఆగ్రహానికి గురయ్యాయి. మీరు ఫోరో, సిక్సో కొడితే హర్షిస్తారుగానీ.. మరాఠీల హక్కులను కొల్లగొడితే హర్షించే ప్రసక్తే లేదని… మీరు మైదానంలో సంపాదించుకున్న గౌరవాన్ని బయట అనవసర వ్యాఖ్యలతో తగ్గించుకోవద్దని సచిన్ టెండూల్కర్ కు చురకలంటించాడు.

హిట్లర్ అభిమానినంటూ ప్రశంసలు!

జర్మన్ నిరంకుశుడిగా ఖ్యాతికెక్కిన హిట్లర్ ను ప్రశంసించినందుకు థాకరే వివాదాల్లోకెక్కాడు. తాను హిట్లర్ ను గొప్పగా ఆరాధిస్తానని.. అలా చెప్పుకోవడానికి నేనేనాడూ సిగ్గుపడను.. ఆయన పాటించిన అన్ని పద్ధతులతోనూ నేను ఏకీభవిస్తాను.. ఆయనో అద్భుతమైన వక్త, నిర్వాహకుడు.. చాలా విషయాల్లో హిట్లర్ కూ, నాకూ సారూప్యతలున్నాయంటూ థాకరే చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. పైగా భారత్ వంటి దేశాన్ని పాలించాల్సినవాళ్లు దయ, సానుభూతితో ఉండకూడదని.. ఉక్కుపాదంతో అణిచివేసే నియంతలే అవసరమంటూ కూడా తీవ్ర కలకలం రేపే వ్యాఖ్యలు చేయడంలోనూ వెనుకడుగు వేయని నిర్భీతి థాకరేది. ఆయనేమనకుంటే దాన్ని రాజకీయంగా లాభమా, నష్టమా అన్నది బేరీజు కూడా వేసుకోకుండా మాట్లాడే బోల్డ్ నెస్సే థాకరేకు తన ప్రాంతంలో హ్యజ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

అయితే, 2007లో మరోసారి మీడియాతో మాట్లాడేటప్పుడు తన వ్యాఖ్యలపైన తానే నిలబడనట్టుగా హిట్లర్ ను చాలా క్రూరమైన వ్యక్తిగా కూడా పేర్కొన్నాడు బాలాసాహెబ్. యూదులను ఊచకోత కోయడాన్ని తప్పుబట్టాడు. అదే సమయంలో, ఆయన చాలా శక్తిమంతుడని, తన వెంట జనసమూహాన్ని తీసుకెళ్లే శక్తియుక్తులు కల్గినవాడంటూ ఆ సందర్భంలోనూ పొగడ్తలు గుప్పించాడు.

హైందవ హృదయ సామ్రాట్ గా థాకరే!

థాకరేను ఆయన అభిమానులు, మద్దతుదారులు హిందూ హృదయ సామ్రాట్ గా అభివర్ణించేవారు. ఆయన కూడా ఏస్, నేను హిందువును, పిచ్చి పిచ్చిగా హిందువునంటూ గట్టిగా నొక్కివక్కాణించాడు. ప్రతీ ముస్లింకు థాకరే వ్యతిరేకి కాదు.. కానీ, ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని అవమానపర్చేలా, ద్వేషించేలా, కుట్రలకు పూనుకునేలా ఎవరు వ్యవహరించినా ఊరుకునేది లేదనేవాడు. వారిని దేశద్రోహులుగానే చూస్తానన్నాడు.

ముస్లింలను క్యాన్సర్ లా అభివర్ణించాడు. వ్యాపిస్తున్న క్యాన్సర్ కు ఆపరేషన్ చేయాలన్నాడు. ముస్లింల నుంచి దేశాన్ని రక్షించాలంటే.. పంజాబ్ లో పోలీసులు ఖలీస్తానీల పట్ల సానుభుతి ప్రదర్శించినట్టు.. ఇక్కడి పోలీసులు కూడా హిందూ మహాసంఘ్ పోరాటంలో వారికి మద్దతుగా నిలవాలంటూ ఆయన చేసిన హాట్ కామెంట్స్ నాటి సోషల్ మీడియా లేని కాలంలోనూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపాయి. ఇస్లామిక్ ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. దాన్ని అడ్డుకోవాలంటే హిందూ ఉగ్రవాదమే ఏకైక మార్గం. భారత్ ను, ఇక్కడి హిందువులను రక్షించడానికి మనకూ ఆత్మాహుతి దళాల అవసరం పడిందంటూ నోటికెంతొస్తే అంత అనేసిన సంచలనాల నాయకుడు థాకరే.

కింగ్ మేకర్ గా థాకరే!

థాకరేను ఎందరో నాయకుల్లో ఒకడిగా చూడలేం. ఎందరో నాయకుల్లో ఒకే ఒక్కడిలా మాత్రమే చూడాల్సి ఉంటుంది. అందుకే కింగ్ మేకర్ అయ్యాడు. కొందరు అభినవ ఛత్రపతి శివాజీగా కొనియాడారు. ఆయనేనాడూ ఉన్నత స్థానాన్ని కోరుకోలేదు. తెరవెనుక నుంచే అంతా నడిపించాడు. ముఖ్యమంత్రిగా ఏనాడూ కుర్చీలో కూర్చోని థాకరే.. మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఓ శక్తివంతమైన ధ్యానకేంద్రమయ్యాడు.

ఎవరు అధికారంలో కూర్చోవాలో నిర్ణయించే ప్రభావిత శక్తిగా, నిర్ణయాత్మక వ్యక్తిగా మహారాష్ట్ర రాజకీయాల్లో పొత్తులపైనా తనదైన ముద్ర కనిపిస్తుంది. వ్యూహాత్మక సంకీర్ణాల సృష్టి, జాతీయపార్టీలతో పొత్తులు ఇలా పలు నిర్ణయాల వెనుక నాటి రాజకీయాల్లో థాకరే ఆలోచనలే కనిపించేవి. అందుకే థాకరే ప్రాంతీయ నాయకుడిగా మాత్రమే ఉండిపోలేదు.. సంచలనాలతో ఆయన జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత శివసేన జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా మారేలా చేయడంలో థాకరే వేసిన రాజకీయ అడుగులే అందుక్కారణం.

శివసేన విభజన!

2012, నవంబర్ 17వ తేదీన థాకరే కన్నుమూశాక ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే పార్టీ పగ్గాలు చేపట్టారు. బీజేపీ వంటి హిందుత్వ నినాదాన్ని ఎత్తుకున్న పార్టీ నుంచి వీడిపోయి, కాంగ్రెస్ పంచెన చేరడంతో శివసేన పార్టీ పోకడపై భిన్నాభిప్రాయాలకు తెరలేచింది.

2022లో సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే.. ఉద్ధవ్ నాయకత్వంపై అసంతృప్తితో 40 మంది ఎమ్మెల్యేలతో విడిపోవడంతో శివసేన రెండుగా చీలిపోయింది. ఆ తర్వాత ఉద్ధవ్ వర్సెస్ ఏక్ నాథ్ ఇద్దరూ తామే బాలాసాహెబ్ వారసులమంటూ న్యాయపోరాటలకు దిగాయి. ఈ క్రమంలో అప్పటివరకూ థాకరే జమానాతో శివసేనను ఓన్ చేసుకున్న మరాఠీల్లోనూ.. అసలు శివసేన ఎవరి పార్టీ అనే మీమాంసకు తెరలేచింది.

శివసేన విడిపోయి ఉండొచ్చు. ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమూ కావచ్చు. కానీ, బాలాసాహెబ్ పేరు మాత్రం చిరస్థాయిగా నిల్చేది. ఆ ఆకర్షణ, ఆ ఆత్మవిశ్వాసం, తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే మనస్తత్వం, తానెత్తుకున్న ప్రాంతీయవాదం, తన వ్యాఖ్యలు, వివాదాలు, తన లక్ష్యాలు వెరసి.. బాలాసాహెబ్ థాకరే భారతదేశ చరిత్రలో, మహారాష్ట్ర రాజకీయ సంస్కృతిలో ఓ ఐకాన్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles