చీకట్లను తరిమి.. పవర్ కట్ కు చెక్ పెట్టాడు: ఎడారి పల్లెల్లో ఇప్పుడతనో విద్యుత్ వెలుగు!

గ్రామీణ భారతానికి మరో థామస్ అల్వా ఎడిసన్ దంగర్ సింగ్ సోదా!

ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థల దయాదాక్షిణ్యాలతో కరెంట్ వచ్చుడేంది… రాకపోతే ఆ పవర్ కోసం ఎదురుచూడటమేంటనుకున్నాడు రాజస్థాన్ కు చెందిన ఓ యంగ్ ఎంటర్ ప్రెన్యూర్. ఇప్పుడతను సృష్టించిన పోర్టబుల్ విండ్ పవర్ సిస్టమ్ కు 50 దేశాల నుంచి డిమాండ్ సంపాదించుకున్నాడు. ప్రత్యామ్నాయాల కోసం వెతికినప్పుడు సృజన కూడా మనకు తెలీకుండానే సహకరిస్తుంది. అందుకు ప్రకృతీ సహకరిస్తుంది. అలాంటి స్టోరీనే దంగర్ సింగ్ సోదాది.

సామాన్యులు, రైతుల గోస నుంచి పుట్టిన ఆలోచన!

రాజస్థాన్ బార్మార్ జిల్లా పూర్తిగా ఎడారి ప్రాంతం. ఇక్కడి నుంచి ఎదిగిన యువ పారిశ్రామికవేత్త దంగర్ సింగ్ సోదాకు మారుమూల పల్లెలలు, తమ ఎడారి ప్రాంతాల్లో నిత్యం విద్యుత్ కోతలు ఇబ్బంది పెట్టాయి. అందుకు పరిష్కారం ఏమీ కనుక్కోలేమా అని ఆలోచించాడు. ఆ దీర్ఘ ఆలోచనల నుంచే విండ్ టర్బైన్ ను అభివృద్ధి చేశాడు. తన ఆవిష్కరణ భారతదేశంలోనే కాదు.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ డిమాండ్ అయి నిల్చింది. ఇప్పటికే 50 దేశాలు దంగర్ సింగ్ సోదా ఆవిష్కరణను మెచ్చి ఆర్డర్స్ ఇచ్చాయి.

కదిలించిన 2006 వరదలు!

బార్మార్ జిల్లా సంఖలి గ్రామానికి చెందిన దంగర్ సింగ్ సోదాను 2006లో రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతంలో వచ్చిన విధ్వంసకర వరదలు తీవ్రంగా కలిచివేశాయి. దీర్ఘకాలికంగా విద్యుత్ కోతల వల్ల, కరెంట్ ను పునరుద్ధరించలేకపోవడం వల్ల స్థానిక ప్రజానీకం నానా ఇబ్బందులకు గురవ్వడం కళ్లారా చూశాడు. ఆ అవస్థలే దంగర్ సింగ్ సోదాలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాయి. దాని పర్యవసానమే పోర్టబుల్ విండ్ టర్బన్ ఎలక్ట్రిసిటీ కాంపోనెంట్స్ తయారీకి కారణమైంది.

చిన్ననాట్నుంచీ ఎడారి ప్రాంతంలో, సరిహద్దు గ్రామాల్లో పెరిగిన తనకు విద్యుత్ అంతరాయం తీవ్రత ఎంతో తెలుసు. అందుకే తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే స్థిరమైన విద్యుత్ పరిష్కారం రూపొందించాలని నిర్ణయించుకున్నాడు దంగర్ సింగ్ సోదా.

పోర్టబుల్ విండ్ టర్బైన్ ఆలోచన వెనుక!

పెద్ద పెద్ద విండ్ టర్బైన్స్ ఏర్పాటు చేసుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దాంతో అదే విండ్ టర్బైన్స్ ని చిన్న పరిమాణంలోకి తీసుకొస్తే ఎలాగుంటుందానని యోచించాడు. తక్కువ ఖర్చుతో టర్బైన్స్ సృష్టి చేశాడు. వాస్తవానికి దంగర్ సింగ్ సోదా పెద్దగా చదువుకున్నవాడూ ఏం కాదు. యూట్యూబ్ వీడియోలు చూశాడు. అకడమిక్ పేపర్లు చదివాడు. ఇతర వనరుల ద్వారా గట్టి పట్టుదలతో విస్తృతంగా పరిశోధన చేసి తన ప్రోటోటైపును అభివృద్ధి చేసి ప్రపంచం ముందు తన ఆవిష్కరణతో ఓ వెలుగు వెలుగుతున్నాడు.

పాత సామాన్లే కొత్త ఆవిష్కరణకు వస్తువులు!

అల్యూమినియం షీట్స్, పాతబడ్డ ఫ్యాన్ బ్లేడ్స్ వంటి సర్వసాధారణ వస్తువులే దంగర్ సింగ్ సోదా పోర్టబుల్ విండ్ టర్బైన్ విద్యుత్ ఆవిష్కరణలో కీలకమైన వస్తువులు. అలా ఆరంభంలో కొన్ని మాడల్స్ ఫెయిల్ అయినప్పటికీ పట్టు వదలకుండా ప్రయత్నించి.. తన డిజైన్ ను మెరుగుపర్చి, ఒక నమూనాగా మార్చాడు. ప్రస్తుతం దంగర్ సింగ్ సోదా సన్ విండ్ ఇన్నోవేటివ్ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ పోర్టబుల్ విండ్ టర్బైన్స్ ఒక కిలోవాట్ సామర్థ్యం కల్గి ఉన్నాయి. ఇళ్ల పైకప్పులపై, బాల్కనీల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లోనూ సులభంగా అమర్చేలా రూపొందించాడు. ముఖ్యంగా రాజస్థాన్ వంటి గాలి తక్కువగా ఉండే ప్రాంతాలకూ అనకూలంగా ఈ విండ్ టర్బైన్స్ ను తయారుచేశాడు.

20 ఏళ్ల వరకు విద్యుత్ బిల్లులను సున్నాకు తగ్గించుకునే అవకాశం!

అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఈ టర్బైన్ నుంచి రోజుకు 10 నుంచి 20 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. రోజుకు సుమారు పది గంటలు పనిచేస్తే నెలకు 300 యూనిట్ల వరకూ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. దీన్ని నేరుగా ఇన్వర్టర్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో 20 ఏళ్ల వరకు విద్యుత్ బిల్లులను దాదాపు సున్నాకి తగ్గించే అవకాశముంది. దీని ప్రారంభ ధర కేవలం 50 వేలు మాత్రమే కావడంతో సామాన్య కుటుంబాలు, ముఖ్యంగా రైతులు ఈ విండ్ టర్బైన్స్ కోసం క్యూ కడుతున్నారిప్పుడు.

దంగర్ సింగ్ సోదా ఆవిష్కరణకు ముచ్చటపడ్డ ప్రభుత్వం కావల్సిన అనుమతులు, లైసెన్సులు మంజూరు చేసింది. తన ఆవిష్కరణకు పేటెంట్ హక్కులు కూడా పొందాడు. భారత్ లో పోర్టబుల్ విండ్ టర్బైన్స్ ను తయారుచేయగల్గే మొట్టమొదటి సంస్థగా కూడా దంగర్ సింగ్ సోదా రికార్డులకెక్కాడు. ఇప్పటికే సింగ్ టర్బైన్స్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఆర్మీ క్యాంపులు, స్కూల్స్, ఇళ్లల్లో దర్శనమిస్తున్నాయి.

వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ లో 50 కోట్ల ఎంవోయూ!

2024లో జరిగిన వైబ్రెెంట్ గుజరాత్ సమ్మిట్ లో గుజరాత్ ప్రభుత్వంతో 50 కోట్ల రూపాయల విలువైన ఎంఓయూ కుదుర్చుకున్నాడు ఈ యువ పారిశ్రామికవేత్త. ఇప్పుడు దంగర్ సింగ్ కంపెనీ హైవే ఆధారిత టర్బైన్స్, గుడ్డలతో తయారుచేసే టర్బైన్స్. ఇతర కొత్త వేరియంట్స్ పైనా దృష్టిసారించి మరిన్ని ఆవిష్కరణల వైపు అడుగులేస్తోంది.

దంగర్ సింగ్ ఈ టర్బైన్స్ తయారీ ఆలోచన వచ్చిందే తడవుగా మొట్టమొదట పెట్టిన పెట్టుబడి కేవలం 50 వేల రూపాయలు మాత్రమే. అదీ ఓ స్నేహితుడి కార్యాలయాన్ని తన ఆవిష్కరణల ప్రయాణానికి వేదిక చేసుకున్న దంగర్ సింగ్.. ఇప్పుడు కంపెనీలు అడ్వాన్సులు చెల్లించి ఉత్పత్తులు ఆ తర్వాత తీసుకునే స్థాయికెదిగాడు. గ్రీస్ వంటి దేశాల్లో కూడా ఇప్పుడు సింగ్ టర్బైన్స్ దర్శనమిస్తున్నాయి. త్వరలోనే రాజస్థాన్ లో తన కంపెనీని మరింత విస్తరించి విస్తృతస్థాయి కార్యకలాపాలు ఆరంభించాలన్నది దంగర్ సింగ్ సోదా యోచన.

దంగర్ సింగ్ సోదా ఆవిష్కరణ గ్రామీణ భారతానికి ఓ వెలుగు కిరణమై నిలుస్తోంది. దాంతోపాటే పట్టుదల, ప్రత్యామ్నాయాలు కనుగొనాలన్న తపన, అందుకు తగ్గ సృజనాత్మకత, కష్టించి పనిచేసే తత్వముంటే ఎంతటి కఠినమైన సవాళ్లనైనా.. తమకు అవకాశంగా మల్చుకోవచ్చని దంగర్ సింగ్ నిరూపించాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles