కేవలం ఓ బ్లాంకెట్, ఓ వల… ఆ రెండింటితో 47 మంచు చిరుతపులులను రక్షించాడు ఆ లడఖ్ జంతు ప్రేమికుడు.
అవును, ఈ అనంత విశ్వంలో.. అందులోనూ భూగోళంపై ఎన్నో వింతలు, విచిత్రాలు, జీవులు. అందులో మాటలు వచ్చి, అత్యంత తెలివైన జీవిగా మనకు మనం చాలా గొప్పగా ఫీలవుతుంటాం. కానీ, ఈ ప్రకృతి అన్ని జీవులకూ సమానమే. అదే ఆ పిల్లవాణ్ని కదిలించి ఉంటుంది. అందుకే మంచు చిరుతపులులను కాపాడే యోహోవాగా అవతరించాడతడు.

లడఖ్ లోని చిల్లింగ్ అనే ఓ కుగ్రామంలో ఖెన్రాబ్ ఫున్సోంగ్ ఓ గొర్లకాపరి. గొర్లు, మేకలు కాసుకుంటున్న సమయంలోనే ఓసారి ఓ మంచు చిరుతను చూశాడు. అలా తరచూ కొన్నిసార్లు చిరుతలు ఫున్సోంగ్ కు దూరం నుంచి కంటపడ్డాయి. ఆ చిన్న వయస్సులో అవి ఫున్సోంగ్ ను ఆకట్టుకున్నాయి. తమ గ్రామానికి సమీపంలోనే ఉన్న హెమిస్ నేషనల్ పార్క్ లోపలికి వెళ్లినా.. కొంచెం గోడపైకెక్కి చూసినా చిరుతలు కనిపిస్తాయి. అలా ఓసారి తన అమ్మమ్మ దహన సంస్కారాల సమయంలో ఒక మంచు చిరుతను సమీపం నుంచే చూడగల్గాడు. అది వేట కోసం వచ్చింది. గొర్ల మందపై వేట కోసం మంచి అదను కోసం చూస్తోంది. అలా ఒక్క ఉదటన ఆ మంచు చిరుత గొర్ల మందపై దూకిన ఆ క్షణం ఇక ఫున్సోంగ్ మైండ్ లో పడిపోయింది. ఎంతలా అంటే ఎప్పుడూ ఆ మంచు చిరుతల గురించే ఆలోచించేంతలా.
అలా మంచు చిరుతలపై మమకారం పెంచుకున్న ఫున్సోంగ్ కు ఏకంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం స్వచ్ఛందగా పనిచేసేందుకు మొదట అవకాశం వచ్చింది. ఆ తర్వాత అదే హెమిస్ నేషనల్ పార్కులో అతడికి గార్డుగా ఓ చిన్న ఉద్యగం కూడా ఇచ్చారు. అలా 2000 సంవత్సరంలో తను గార్డుగా చేరినప్పట్నుంచీ.. చిన్నప్పుడు గొర్లు, మేకలను మాత్రమే సంరక్షించిన ఫున్సోంగ్ కు.. ఇక వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతగా మారింది. అదిగో అప్పట్నుంచీ ఫున్సోంగ్ ఏకంగా 47 మంచు చిరుతలను రక్షించాడు.

హెమిస్ నేషనల్ పార్క్ లో మంచు చిరుతలతో పాటు, ఇతర వన్యప్రాణులను ట్రాక్ చేయడానికి.. వాటి సంరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 2006లో కేవలం 7 మాత్రమే ఉన్న మంచు చిరుతలు.. 2021 వరకు ఆ పార్క్ యాజమాన్యం నిర్వహించిన సర్వేలో ఏకంగా 11కు పెరిగినట్టు తేలింది. ప్రస్తుతం ఫున్సోంగ్ అంచనా ప్రకారం హెమిస్ నేషనల్ పార్కులో 60, లడాఖ్ మొత్తంలో 250 చిరుతలున్నాయి. సీసీ ఫుటేజ్ లో నిశితంగా గమనించిన పరిశీలన తర్వాత ఫున్సోంగ్ వెల్లడించిన వివరాలివి.
అంటే ఒకనాడు అంతరించే దశకు చేరుకున్న మంచు చిరుతలు పెరుగుతున్న దాఖలాలు.. వాటి సంరక్షణ పట్ల అక్కడి అటవీశాఖ, పార్క్ అధికారులతో పాటు.. ప్రత్యేకించి ఫున్సోంగ్ ఎంత శ్రద్ధ వహిస్తున్నారో చెబుతోంది.
ఖెన్రాబ్ ఫున్సోంగ్ తో పాటు, అక్కడ పనిచేసే ఇతర గార్డులు అడవి పిల్లలు, మంచు చిరుతలు, ఇతర వన్యప్రాణులు సంచరించే గట్లు, కొండలు, లోయలు, ఏటవాలు రాళ్ల వెంట కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి పగ్ మార్క్స్, గీతలు, మలం, వాసన వంటి ఆనవాళ్లతో అవి ఎక్కడ సంచరిస్తున్నాయి… ఏ సమయాల్లో ఎక్కువగా వస్తున్నాయో స్పష్టంగా ఒక అంచనాకు రాగల్గారు. అలాగే, గతంలోలా వేటగాళ్ల బారిన పడుతున్నాయా.. వాటి అవశేషాలేమైనా దొరుకుతున్నాయా అనే కోణాల్లోనూ నిత్యం గస్తీ తిరుగుతుంటారు.
ముఖ్యంగా మంచు చిరుతలను చూడాలంటే ఉదయం వేళ.. అలాగే, సాయంత్రాలు మాత్రమే అనువైన సమయాలంటాడు ఫున్సోంగ్. ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకూ వీటికి సంభోగ కాలం. అవి ఎక్కడైతే అలా సంభోగానికి ఉపక్రమిస్తాయో ఆ రాళ్లనూ జాగ్రత్తగా పరిశీలించి ప్రతీ విశేషాన్నీ నమోదు చేస్తూ మంచు చిరుతల సంరక్షణ, వాటి పెంపు కోసం ఫున్సోంగ్ నేతృత్వంలోని గార్డ్స్ బృందం ప్రయత్నం చేస్తోంది.
అంతరించిపోయే దశ నుంచి సంరక్షణ వరకు!
కొన్ని దశాబ్దాల క్రితం మంచు చిరుతల సంఖ్య లడాఖ్ ప్రాంతంలో అంతరించే దశకు చేరుకుంది. అవి గొర్లు, బర్లు, పశువులపై దాడులు చేయడంతో వాటిని స్థానికులే వేటగాళ్ల అవతారమెత్తి చంపేసేవారు. కానీ, వాటి అవసరం, పర్యావరణ సమతుల్యతకు ప్రతీ వన్యప్రాణి ఎంత ముఖ్యమన్న అవగాహన అక్కడివారికి కల్పించి వాటిని కాపాడుతున్నారు. దాంతో పాటు ఎకో టూరిజం డెవల్పెమెంట్ లో అవన్నీ ఎంత ముఖ్యమో తెలియజెప్పుతున్నారు. దాంతో ఏవైనా వన్యప్రాణులు ఒకవేళ ప్రమాదాల్లో చిక్కుకున్నా.. గతంలో వాటిని చంపిన స్థానికులే.. ఇప్పుడు రెస్క్యూ బృందాలకు తక్షణ సమాచారమిచ్చి కాపాడుతున్నారు.
ప్రమాదంతో కూడిన మంచు చిరుతల సంరక్షణ!
ఫున్సోంగ్ అండ్ టీంకు ప్రారంభంలో ఎలాంటి పరికరాలు కూడా ఉండేవి కావు. గుత్ప కట్టెలు, రోప్ తాళ్లు, అడ్డం రాకుండా విసిరేందుకు బస్తాలు వంటివి మాత్రమే అప్పట్లో వారి ఆయుధాలుగా ఉండేవి. అలాంటి క్రమంలో చిరుతల దాడులకు ఎక్కువ అవకాశాలుండేది. అయినా వెరువకుండా ఫున్సోంగ్ వాటి సంరక్షణ కోసం నడుం బిగించాడు. ఇప్పుడంటే ముసుగుల్లాంటి వలలు, ట్రాంక్విలైజర్ తుపాకుల వంటివి అందుబాటులోకొచ్చాయిగానీ.. గతకాలమంతా భయంభయమే. అయితే వలలను వేసి వెళ్లి వాటిని పట్టుకోవడానికి ఫున్సోంగ్ ఇష్టపడడు. వాటిని లైవ్లీగా పట్టుకోవడానికే ఇష్టపడతాడు. ఆ క్రమంలో ఓపిక చాలా అవసరం. అదే సమయంలో ప్లానింగ్ చాలా ముఖ్యం. లేకపోతే, ప్రాణాలకే ప్రమాదం. అలా మనిషి వల్ల సదరు మంచు చిరుతలకుగానీ, ఇతర వన్యప్రాణులకుగానీ ఎలాంటి హాని జరక్కుండా.. అదే సమయంలో వాటివల్ల తమకెలాంటి ప్రమాదం లేకుండా పక్కా స్కెచ్ తో మంచు చిరుతలను పార్కుకు తీసుకెళ్లే వ్యూహరచన చేస్తుంది ఫున్సోంగ్ బృందం.
అయితే విషాదమేంటంటే గతం కంటే ఎంతో మార్పు తీసుకురాగల్గినా.. ఇప్పటికీ ఏడాదికి ఓ నలభై ఐదు మంచు చిరుతలు మరణిస్తున్నట్టుగా కూడా అక్కడి అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి. వేటగాళ్లు అక్కడక్కకడా పట్టుబడుతూనే ఉన్నారు. అలాగే పెరుగుతున్న అర్బనైజేషన్.. జనవాసాలు పెరిగి అడవులు తగ్గిపోయి కాంక్రీట్ జంగల్ గా మారడం.. హిమానీనదాలు కరిగిపోవడం వంటివి కూడా రాబోయే రోజుల్లో వన్యప్రాణి సంరక్షణకు తీవ్ర ఆటంకాలుగా మారనున్నాయి.
ఎన్ని సవాళ్లెదురైనా తాను మాత్రం మంచు చిరుతల సంరక్షణకు కట్టుబడి ఉన్నానంటున్నాడు ఫున్సోంగ్. వాటితోనే ఎకోలాజికల్ బ్యాలెన్స్ అంటాడు. అలా ఒకనాటి గొర్లకాపరి.. ఇప్పుడు లడాఖ్ మంచు చిరుతలను కాపాడుతున్న జంతు సంరక్షకుడిగా వార్తల్లోకెక్కాడు.



