మన ఆర్థిక సార్వభౌమత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఎంత కీలకమో మనకు తెలిసిందే. అయితే, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్టుక వెనుక… నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓ ఆలోచన కనిపిస్తుంది తెలుసా..? ముందు బ్యాంక్ ఆఫ్ ఆజాద్ హింద్ పేరుతో ప్రారంభమైన ఆ బ్యాంకే… ఆ తర్వాత ఇండియాకు ఒక రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు కారణమైందనేది చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే ఈ కథనం.

1944, ఏప్రిల్ మాసం.. ప్రస్తుతం యాంగాన్ గా పిల్చే మయన్మార్ రంగూన్ సిటీలో జమాల్ అవెన్యూ అది. ఆ ఖాళీ బంగ్లాలో వడ్రంగులు ఓ ఖాళీ స్పేస్ ను బ్యాంకుగా మారుస్తున్నారు. అంతకుముందు వారం అదో ఖాళీ స్థలం. వారం తర్వాత ఓ బ్యాంక్ ప్రధాన కార్యాలయంగా మారింది. ఆ తర్వాత ఆ బ్యాంకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్టుకకో బీజం వేసింది.
1949లో ఆర్బీఐ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి సంపాదించడానికి ఐదేళ్ల ముందు… బోస్ బ్రిటీషర్స్ నుంచి ఇండియా విముక్తి కోసం చేసే ప్రచారానికి నిధులు సమకూర్చుకునేందుకు… ఇంకా భారత్ స్వాతంత్ర్యం సాధించకముందే ఓ ఆర్థిక సంస్థను నెలకొల్పాడు. అదే బ్యాంక్ ఆఫ్ ఆజాద్ హింద్.
సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ పేరిట… బ్రిటీష్ ప్రభుత్వానికి సమాంతరంగా నడిపిన ఓ సర్కార్ లాంటి వ్యవస్థలో సుబ్బియర్ అప్పాదురై అయర్ ప్రచార మంత్రిగా పనిచేశారు. ఎస్. ఏ. అయ్యర్ గా పిల్చుకునే ఆయన రాసిన అన్ టూ హిమ్ ఏ విట్నెస్ బుక్ లో బ్యాంక్ ఆఫ్ ఆజాద్ హింద్ గురించి పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటం ఉదృతంగా జరుగుతున్న నాటి కాలంలో విముక్తి యుద్ధానికి ఆర్థిక సాయమందించేందుకు రంగూన్ లో ఈ బ్యాంకును ప్రారంభించాడు సుభాష్ చంద్రబోస్.
బ్యాంక్ ఏర్పాటుకు పలు అవాంతరాలు!

బోస్ అప్పుడు ఇంఫాల్- కొహిమాలో ఫ్రంట్ లైన్ వారియర్ గా ప్రచారంలో పాల్గొనేందుకు బయల్దేరుతున్న సమయం. కానీ, రంగూన్ లో బోస్ స్థాపించే బ్యాంక్ వల్ల ఎలాంటి సమస్యలుత్పన్నమవుతాయోనని జపనీస్, బర్మా అధికారులు ఒకింత ఆందోళ చెందారు. ఎందుకంటే, తీవ్ర ఉద్రిక్తతలతో కూడిన యుద్ధకాలమది. ఆ ఆర్థికసంస్థ ఏర్పాటుకు కావల్సిన మూలధన ఏర్పాటు, దాని స్థిరత్వం, ఆ సమయం ఇవన్నీ బోస్ కొలీగ్స్ లో కూడా ఆందోళన రేకెత్తించాయి. కానీ, బోస్ మాత్రం వెరవలేదు. తాను ప్రచారంకు వెళ్లేలోపు బ్యాంక్ ప్రారంభం కావల్సిందే… ఆ తర్వాతే తాను ప్రచారంకు వెళ్లాలని తీర్మానించుకున్నట్టు అయ్యర్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఆగ్నేయాసియాలో ఉన్న భారతీయ ప్రవాసులు పెద్ద ఎత్తున డబ్బులు పంపారు. బ్యాంక్ ఏర్పాటుకు కావల్సిన మూలధనం తయారైంది. ముఖ్యంగా బర్మా, మలాయాలోని భారతీయ సమాజం పెద్దఎత్తున స్పందించింది. బోస్ ఏర్పాటు చేసిన బ్యాంక్ నిల్వలు ఏకంగా 215 మిలియన్ డాలర్లు కాగా.. అందులో బర్మాలోని ప్రవాస భారతీయ సమాజం నుంచే 150 మిలియన్ డాలర్స్ అందాయి. ముఖ్యంగా స్వేచ్ఛా భారతం కోసం ఒక నల్గురు ఇండియన్స్ పెద్ద మొత్తాన్నిచ్చారు. వారు అసరమైతే పెట్టిన ఆ పెట్టుబడి కోల్పోయేందుకూ సిద్ధపడే వచ్చారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి మద్దతు తెలిపారట ఆ నల్గురు.
వారిచ్చిన మద్దతుతో అక్కడ బ్యాంక్ ఏర్పాటుపై జపనీస్ ప్రతిఘటనకు ఫుల్ స్టాప్ పండింది. వాళ్లిక అప్పటికే పూర్తి నిశ్శబ్దమైపోయారని పేర్కొన్నారు అయ్యర్.
ఎల్లప్ప అనే ఒకే ఒక వడ్రంగి, మరో నల్గురితో కలిసి వారం రోజులపాటు కష్టపడి.. రంగూన్ లోని భవనాన్ని ఎంత బాగా బ్యాంక్ రూపాన్నిచ్చారనేది అయ్యర్ బుక్ చెబుతుంది. నూతనంగా ఒక బ్యాంక్ ఏర్పాటు.. స్వాతంత్ర్యానికి పూర్వమే ఏర్పాటైన కథను ఆయన పూసగుచ్చారు. రంగూన్ లోని గుజరాతీ వ్యాపారవేత్త అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మార్ఫానీ తన మొత్తం సంపద సుమారు కోటి రూపాయలకు తాకట్టు పెట్టి మరీ ఆజాద్ హింద్ కు సపోర్ట్ చేశారు. బెతాయ్ కుటుంబం, హీరాబెన్, హేమరాజ్ వంటివారు మనిషికి 50 లక్షల రూపాయలందించారు. ఇక ఇక్బాల్ సింగ్ నరులానైతే ఏకంగా నేతాజీ బరువుకు సరితూగే వెండినందించారట.
ఆజాద్ హింద్ బ్యాంక్… ఆ తర్వాత సుభాష్ నేతృత్వం వహిస్తున్న ఆజాద్ హింద్ ఉద్యమానికి ఓ ఖజానాగా మారింది. వ్యాపారులు, దుకాణదారులు, తోటలను పెంచే ఆసాములు.. ఎవరికి తోచినంత వారు వస్తువులు, డబ్బుల రూపంలో ఆ బ్యాంక్ కు విరాళాలందించేవారు. ఆ డబ్బు, ఆ వనరులే ఆజాద్ హింద్ ఫౌజ్ లో పనిచేసిన సైనికుల జీవితాలు గడవడానికి, ప్రచారానికీ, అవసరమైన సహాయ చర్యలకు ఉపయోగపడింది.
ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఆజాద్ హింద్ ఏకంగా తన కరెన్సీనే రూపాయల్లో విడుదల చేసింది. నాటి బ్రిటీష్ ఇండియాలో ఆ కరెన్సీకి విలువ లేనప్పటికీ.. ఇండియన్ నేషనల్ ఆర్మీ నియంత్రణలో నడుస్తున్న ప్రాంతాల్లో ఆ కరెన్సీ చలామణి అయి ద్రవ్య సార్వభౌమాత్వాన్ని చాటుకుంది. అయితే బ్యాంక్ ఆఫ్ ఆజాద్ హింద్ కు పుస్తర రచయిత అయిన అయ్యరే… చైర్మన్ గా వ్యవహరించారు.
సుభాష్ చంద్రబోస్ ఆశయాలతో ఏర్పాటైన బ్యాంక్ ఆఫ్ ఆజాద్ హింద్ జీవితకాలం స్వల్పమే. రెండో ప్రపంచయుద్ధం ముగిసే సమయానికి.. ఇండియన్ నేషనల్ ఆర్మీ తిరోగమనం తర్వాత.. రంగూన్ పతనంతో ఆ బ్యాంక్ కూడా మూసివేశారు.
అయితే, ఊహించని విధంగా ఆ బ్యాంకుకు సంబంధించిన ఆ గత చరిత్రంతా 2016లో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా మరోసారి తెరపైకొచ్చింది. నాటి బోస్ కు సంబంధించిన ఫైల్స్ ను బహిర్గతం చేయాలనే నిర్ణయంతో.. ఆర్థిక మంత్రిత్వశాఖకు భిన్నమైన పిటిషన్స్ వెల్లువెత్తాయి. ఆజాద్ హింద్ బ్యాంక్ కరెన్సీ నోట్లనుపయోగించి తాము తమకున్న రుణాలను పూర్తి తీర్చేందుకు సిద్ధమనేది ఆ పిటిషన్స్ సారాంశం.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు నాటి ఆజాద్ హింద్ బ్యాంక్ కరెన్సీని చట్టబద్ధంగా గుర్తించాలనే వినతులు వెల్లువెత్తాయి. కానీ, 1934, ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ అందుకు తిరస్కరించింది. అలాంటి ఓ సంస్థ గురించి తమ వద్ద ఎలాంటి రికార్డుల్లేవనీ… బ్యాంక్ నోట్లను జారీచేసే అధికారం కేవలం ఆర్బీఐకి మాత్రమే ఉందని పేర్కొంది. ఆ క్రమంలో కొందరు పిటిషనర్స్ ను ఆర్బీఐ బ్రిటీషర్స్ స్థాపించిందని.. కాబట్టి మోడీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.
అయితే, నాటి బ్యాంక్ ఆఫ్ ఆజాద్ హింద్ అది కేవలం సుభాష్ చంద్రబోస్ బృందానికి నిధులు సమకూర్చడం కోసమో.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలకం కావడం మాత్రమే కాదు… అది కచ్చితంగా సొంత కరెన్సీని ముద్రించాలనే యోచనకు.. సొంత బ్యాంక్ ఏర్పాటుకు ఓ ముందడుగైందంటారు అయ్యర్.



