విశ్వాస తీర్మాన వేదిక.. రాజ్ భవనా, అసెంబ్లీనా..?

Vamsy Krishna…✍🏻

—————————————————–

“సభ విశ్వాసమా”? “మెజారిటీ సంఖ్యాబలమా?” ఏది ముఖ్యం ?

తమిళనాడు లో రెండవసారి కూడా గౌరవనీయ గవర్నర్ గారు పాత పాటే పాడటం వలన విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవడమో, అసలు ఏర్పడకపోవడమో జరిగే అవకాశాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఒక ప్రభుత్వం ఏర్పడాలి అంటే మెజారిటీ సంఖ్యాబలం ఉండాలా? సభ విశ్వాసం ఉండాలా ?అనేది అసలు సిసలు ప్రశ్న.

ప్రభుత్వం ఏర్పాటుకు సంఖ్యాబలం అనేది ఒక కొలమానం మాత్రమే. అసలు పరీక్ష “విశ్వాస తీర్మానం” (Confidence Motion) లో గెలవడం. ఆ విశ్వాస పరీక్ష శాసనసభ వేదికగా జరగాలి కానీ రాజ్ భవన్ వేదికగా కాదు . నిజానికి తగినంత మెజారిటీ సంఖ్యాబలం లేకుండా ప్రభుత్వాలు నిలబడిన సందర్భాలు భారత రాజకీయ చరిత్రలో ప్రముఖం గానే వున్నాయి.

ఉమ్మడి మద్రాస్ (అప్పటికి ఆంధ్రా,మద్రాస్ కలిసే వున్నాయి ) రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. అప్పుడు కమ్యూనిస్టులు మరికొన్ని ఇతర పార్టీలు కలిసి ‘యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్’ (UDF) గా ఏర్పడ్డాయి. కానీ, అప్పటి గవర్నర్ శ్రీ ప్రకాశ అతిపెద్ద పార్టీ నాయకుడిగా ఉన్న సి. రాజగోపాలాచారి (రాజాజీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. రాజాజీ అప్పుడు శాసనసభ సభ్యుడు కూడా కాదు (ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు). చివరికి ఆయన సభలో తన విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక వివాదాస్పద కీలకమైన మలుపు.

1991లో పి.వి. నరసింహారావు ప్రభుత్వం ప్రారంభంలో మైనారిటీ ప్రభుత్వమే. బయటి నుంచి ఇతర పార్టీల మద్దతుతో ఆయన ఐదేళ్ల కాలం పూర్తి చేశారు.చరణ్ సింగ్, చంద్రశేఖర్, ఐ.కె. గుజ్రాల్: వీరంతా కూడా పూర్తి మెజారిటీ లేకపోయినా, ఇతర పెద్ద పార్టీల మద్దతుతో ప్రధానులుగా కొనసాగారు.అయితే రాజాజీ, పి.వి ,చరణ్ సింగ్,చంద్రశేఖర్ వీళ్లంతా కాకలు తీరిన రాజకీయ యోధులు. ఇవాళ విజయ్ రాజకీయాలలోకి కొత్త కాబట్టి మిగతా ద్రావిడ పార్టీలు ఆట ఆడుకుంటున్నాయి. అవే 108 సీట్లు DMK కో ADMK కో వస్తే ఇంత గుంజాటన,అనిశ్చితి కచ్చితంగా ఉండేది కాదు

విశ్వాసం పొందటం అంటే నా ప్రభుత్వం మీద విశ్వాసం వున్నది అని నిరూపించుకోవడానికి విశ్వాస తీర్మానం పెట్టడమా? లేక ఈ సభ మీద విశ్వాసం లేదని అవిశ్వాస తీర్మానం పెట్టడమా? రెండింటికీ తేడా వున్నది కదా. నిజానికి భారత రాజ్యాంగంలో “విశ్వాస తీర్మానం” (Motion of Confidence) అనే పదం ప్రత్యక్షంగా ఎక్కడా లేదు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 (కేంద్రం కోసం) ఆర్టికల్ 164 (రాష్ట్రాల కోసం) :”మంత్రిమండలి సమిష్టిగా లోక్‌సభకు (లేదా విధానసభకు) బాధ్యత వహిస్తుంది.” (Collective Responsibility) అంటుంది. అంటే, సభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత కాలమే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ “మద్దతు” ఉందో లేదో తెలుసుకోవడానికి రాజ్యాంగం ఒక పద్ధతిని సూచించలేదు, కానీ పార్లమెంటరీ నిబంధనల ద్వారా ఇది అమలులోకి వచ్చింది.

అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion) గురించి లోక్‌సభ నియమావళిలోని రూల్ 198లో స్పష్టంగా ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దించడానికి దీన్ని వాడుతాయి.విశ్వాస తీర్మానం (Confidence Motion)గురించి రాజ్యాంగంలో కానీ, సభ నియమావళిలో కానీ మొదట్లో లేదు. ఇది ఒక రాజకీయ సంప్రదాయం (Convention) గా పుట్టుకొచ్చింది

1979 వరకు భారతదేశంలో ఎప్పుడూ హంగ్ ఏర్పడలేదు. ఎప్పుడైతే ఏ పార్టీకి మెజారిటీ రాని (Hung Parliament) పరిస్థితులు ఏర్పడ్డాయో, అప్పుడు రాష్ట్రపతి/గవర్నర్లు ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు.ప్రభుత్వం ఏర్పాటు చేసే వ్యక్తికి మెజారిటీ ఉందో లేదో ముందే తెలుసుకోవడానికి, “మీరు సభలో విశ్వాసాన్ని నిరూపించుకోండి” అని ఆదేశించడం మొదలుపెట్టారు.అలా మొట్టమొదటిసారిగా 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు ఈ విధంగానే విశ్వాసం నిరూపించుకోమని కోరారు.

విశ్వాస తీర్మానం ప్రాముఖ్యతను సుప్రీం కోర్టు ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నొక్కి చెప్పింది.ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో గవర్నర్ తన బంగళాలో కూర్చుని నిర్ణయించకూడదని, అది కేవలం సభలో (Floor of the House) జరిగే ఓటింగ్ ద్వారానే తేలాలని కోర్టు స్పష్టం చేసింది.దీనినే “ఫ్లోర్ టెస్ట్” (Floor Test) అని కూడా అంటారు. ఇది కూడా ఒక రకమైన విశ్వాస తీర్మానమే.

విశ్వాస తీర్మానం అనేది రాజ్యాంగంలోని అక్షరాల్లో (Text) లేదు, కానీ రాజ్యాంగం ఆశించిన ఆశయాల్లో (Spirit) ఉంది. “సభకు బాధ్యత వహించాలి” అనే రాజ్యాంగ నిబంధనను అమలు చేయడానికి మనం సృష్టించుకున్న ఒక పద్ధతే ఈ విశ్వాస తీర్మానం.

కాబట్టి, విజయ్ “నిలబడగలను” అని చెప్పినప్పుడు, రాజ్యాంగంలోని ఈ “సమిష్టి బాధ్యత” అనే సూత్రం ప్రకారమే సభలో తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.అందుకు గవర్నర్ అవకాశం ఇవ్వాలి. చాలామంది భవిష్యత్ లో అనిశ్చితి నివారించడానికి గవర్నర్ గారు పట్టుబడుతున్నారు అని అంటున్నారు కానీ ఆ పట్టుదల 108 సీట్లలో టీ వి కే ను ఎన్నుకున్న ప్రజల తీర్పును అపహాస్యం చేయకూడదు కదా

సభ ఏర్పడిన వెంటనే సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక జరుగుతాయి. స్పీకర్ ఎన్నిక కూడా ఒక రకంగా ప్రభుత్వ బలానికి పరీక్షే. స్పీకర్ ఎన్నికలో ప్రభుత్వం ఓడిపోతే, అది విశ్వాసం కోల్పోయినట్లే లెక్క.కొత్త సభలో మొదట గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం (Motion of Thanks) మీద ఓటింగ్ జరుగుతుంది. ఇందులో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే రాజీనామా చేయాలి.ఈ రెండు సందర్భాలలో విజయ్ ఓడిపోయినా తనంత తానుగా తప్పుకుంటాడు. ఆ మాత్రం వెసులుబాటు ఇవ్వడం అంటే భారత రాజ్యాంగాన్ని, విజయ్ కి 108 సీట్లు ఇచ్చిన ప్రజలను గౌరవించినట్టు. ఆ మాత్రం గౌరవాన్ని తమిళనాడు గవర్నర్ తమిళ ప్రజలకు ఇవ్వలేరా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles