భారతీయ పారిశ్రామిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ పేరు దొరాబ్జీ టాటా. తండ్రి జంషెడ్జీ టాటా కలల్ని నిజం చేసిన తనయుడు. టాటా స్టీల్, టాటా పవర్ కు పునాది వేసినవాడు. ఆ సంస్థలను కాపాడుకునేందుకు తన భార్య ఆభరణాలనూ తాకట్టు పెట్టినవాడు. అంతకుముందు జర్నలిస్టుగా పనిచేసినవాడు దొరాబ్జీ టాటా.
ముంబైలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. ఆ తర్వాత ముంబైలోని సెయింజ్ జేవియర్ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. బాంబే గెజిట్ అనే పత్రికలో ఓ జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంబించాడు. తండ్రి ఆదేశాల మేరకు ఒక టెక్స్టైల్ ప్రాజెక్ట్ స్థాపన కోసం పాండిచ్చేరికి పయనమయ్యాడు.

టాటా స్టీల్, టాటా పవర్ స్థాపన వెనుక ఏం జరిగింది..?
1907లోనే దొరాబ్జీ టాటా జంషెడ్ పూర్ లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఆరంభించాడు. అదే సమయంలో ముంబై సమీపంలో ఓ విద్యుత్ కేంద్రానికీ పునాది వేశాడు. బ్రిటీష్ వలస పాలకుల కాలంలోనే భారతదేశానికి పారిశ్రామిక పునాదిని వేసినవాడు దొరాబ్జీ టాటా.
సంక్షోభంలో దొరాబ్జీ పరిశ్రమలు!
ప్రథమ ప్రపంచ యుద్ధకాలంలో ఇంగ్లాండ్ నుంచి ఉక్కు సరఫరా పడిపోయింది. దాంతో భారత్ లో ఉక్కుకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అది గమనించిన దొరాబ్జీ జంషెడ్ పూర్ లోని తన టిస్కో పరిశ్రమ నుంచి ఐదు రెట్లు ఉక్కు ఉత్పత్తులను అమాంతం పెంచేలా ప్రణాళిక రూపొందించారు. కానీ, అలా ఉత్పత్తి పెరగ్గానే మళ్లీ ఉక్కు ధరలు పడిపోయాయి. దాంతో దొరాబ్జీ స్టీల్ పరిశ్రమ తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురైంది. కార్మికుల జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి. ఆ సమయంలో కంపెనీని నిలబెట్టేందుకు దొరాబ్జీ తన భార్య నగలను, ఇతర వ్యక్తిగత ఆస్తులను కూడా తాకట్టు పెట్టి.. సుమారు కోటి రూపాయల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత కష్టాలకోర్చి మళ్లీ తన టిస్కోను గట్టెక్కించి లాభాల బాట పట్టించారు.
దొరాబ్జీ వివాహం, కుటుంబ నేపథ్యం!
వ్యాపార ప్రయాణంలో భాగంగా మైసూరుకు వెళ్లిన జంషెడ్ జీ టాటా.. అక్కడ భారతీయ తొలి విద్యాశాఖ ఇన్స్పెక్టర్ జనరల్ అయిన డాక్టర్ హెర్ముస్టీ బాబాను కలిశారు. తర్వాత దొరాబ్జీ కూడా హోర్ముస్టీ కుటుంబాన్ని కలిశారు. ఆ సమయంలో హోర్ముస్టీ కుతురైన మెహర్బాయితో దొరాబ్జీకి వివాహం కుదిరి పెళ్లైంది. కానీ, ఆ దంపతులకు సంతానం మాత్రం కాలేదు.
క్రీడలంటే అమితాసక్తి.. అందుకే, ఒలింపిక్స్ కు మద్దతు!
ఇంగ్లాండ్ లో ఉండే సమయంలో దొరాబ్జీ టాటా గుర్రపు స్వారీ, క్రికెట్, టెన్నిస్ వంటి క్రీడల పట్ల అమితాసక్తి కనబర్చేవాడు. అందుకే భారతీయ క్రీడాకారులను ఆరోజుల్లో ప్రోత్సహించి ముందు వరుసలో నిల్చాడు. ఆ క్రమంలోనే 1920 ఆంట్వెర్ప్ ఒలింపిక్స్ లో భారత్ తొలిసారిగా పాల్గొనడానికి అయ్యే ఖర్చును సంపూర్ణంగా తన సొంత డబ్బులతోనే భరించాడు. అలాగే, 1924 పారిస్ ఒలింపిక్స్ లోనూ భారత జట్టుకు మద్దతిచ్చాడు. తర్వాత ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు.
దాతృత్వం.. దొరాబ్జీ చివరిరోజులు!
1931లో ఆయన భార్య మెహర్బాయి లుకేమియా వ్యాధితో మృతి చెందారు. ఆ ఘటన దొరాబ్జీని తీవ్రంగా కల్చివేసింది. దాంతో రక్త సంబంధిత వ్యాధులపై అధునాతన పరిశోధనలు జరిపేందుకు ఆయన లేడీ టాటా మెమోరియల్ ట్రస్టును స్థాపించారు. అది స్థాపించిన ఏడాది తర్వాత 1932, జూన్ 3వ తేదీన దొరాబ్జీ జర్మనీలో తన 73 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.



