వెంకన్న సేవేమోగానీ.. ఓ ప్రొఫెసర్ కే పంగనామం! సైబర్ కేటుగాళ్లకు చిక్కి.. గోవిందా గోవిందా!!

గోవిందా గోవిందా!

వెంకన్న కిరీటమే కొట్టేసే స్టోరీతో నాడు రాంగోపాల్ వర్మ గోవిందా గోవిందాతో హిట్ కొట్టాడు! ఆ గోవిందుడిపై ఉండే భక్తిని ఆసరా చేసుకున్న ఓ మోసగాడు.. బాగా చదువుకున్న ఓ భక్తుణ్నే బురిడీ కొట్టించి గోవిందా గోవిందా అనిపించాడు. వర్మ గోవిందా గోవిందా తెరరూపం.. సదరు మనం చెప్పుకుంటున్న భక్తుడెదుర్కొన్న గోవిందా గోవిందా జీవితానుభవం!

మోసానికి ముక్తి, భక్తి, రక్తి, అవసరం ఇలా కాదేదీ అనర్హమని నిరూపిస్తూనే ఉన్నారు సైబర్ నేరగాళ్లు. అలాంటి ఘటనే తిరుపతి వెంకన్నపైనున్న భక్తితో పుణ్యమేమోగానీ, శాపంగా మారింది ఓ వ్యక్తికి. పైగా సదరు వ్యక్తి మామూలు మనిషేం కాదు. ఏకంగా ప్రొఫెసర్. కానీ, బలహీనతలే సైబర్ కేటుగాళ్ల బలం.

ఇంతకీ ఏం జరిగింది?

సైబర్ నేరగాళ్ల ఉచ్ఛుకు చిక్కి బెంగళూరుకు చెందిన ఓ ప్రొఫెసర్ 5 లక్షల 20 వేల రూపాయలు మోసపోయాడు. వెంకన్న సేవల్లో భక్తులు కోరుకునే రకరకాల సేవల్లో వస్త్రాలంకరణ సేవొకటి. అలాంటి సేవ చేసుకోవాలనుకున్న సదరు ప్రొఫెసర్ భక్తుడు సైబర్ హ్యాకర్స్ చేతికి చిక్కి… ఐదు లక్షల 20 వేలకు తిలోదకాలు వదలాల్సి వచ్చింది.

వస్త్రాలంకరణ సేవకు తిరుపతిలో భక్తుల నుంచి ఆదరణ ఎక్కువగా ఉండగా.. ఈ సేవ చేసుకున్నవారికి రెండు పెద్ద లడ్డూలు, ఒక జాకెట్ పీస్, ఒక పంచ, రెండు చందనం ప్యాకెట్స్ వంటివి దర్శనమనంతరం భక్తులకిస్తారు. అభిషేకం, వస్త్రాలంకరణ అనంతరం మాత్రమే భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతించే ఈ దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం చేసే ఛార్జ్ కేవలం 12 వేల 500 రూపాయలు మాత్రమే. అలా ఇద్దరు భార్యా, భర్తలు పోతే 25 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

కానీ, సదరు బెంగళూర్ కు చెందిన బాగా చదువుకున్న ప్రొఫెసర్ సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు విసిరిన వలకు చిక్కి… 9063516199 అనే నంబర్ కు ఫోన్ చేశాడు. అటువైపు రిసీవర్ తనను తాను తిరుమల తిరుపతి ప్రధాన అర్చకులలో ఒకడిగా పరిచయం చేసుకున్నాడు. పైగా తెలుగులోనూ మాట్లాడటంతో కన్నడ ప్రొఫెసర్ పడిపోయాడు. వస్త్రాలంకరణ సేవ గురించి స్లాట్ బుక్ చేయడంలో తాను సాయం చేస్తానని ప్రొఫెసర్ తో నమ్మబలికాడు. వస్త్రాలంకరణ సేవకు డిమాండ్ ఉన్న మాట వాస్తవమేగానీ… అసలు దాని డిమాండ్ ను ఆకాశమంత ఎత్తులో చెప్పి క్యాష్ చేసుకునే ప్రయత్నం ప్రారంభించాడు.

ఈ సేవలో అమ్మవారికి ఓ చీర, శ్రీవారికి ధోతీని కూడా భక్తులు సమర్పిస్తుంటారు. ఆ విషయాలన్నీ సదరు సైబర్ క్రైమ్ కేటుగాడికి పరిపూర్ణ అవగాహన ఉండటంతో పాటు.. ఇంకొంచెం మసాలా వేసి.. అమ్మవారి చీరను తమిళనాడులోని తంజావూర్ లో జరితో ప్రత్యేకంగా తయారుచేయిస్తామన్నాడు. సేవ కోసం దరఖాస్తు చేసుకుంటే అదీ లక్కీ డిప్ ద్వారానే భక్తులను ఎంపిక చేస్తామని చెప్పాడు. కానీ, ఆ లక్కీ డిప్ లో మీ పేర్లుండేలా చేసే పూచీ నాదని విశ్వాసాన్ని నింపాడు. మొత్తంగా రెండు లక్షలకు పైగా ఖర్చవుతుందని ముందే ఓ మాట చెప్పాడు. ప్రొసీజర్ ప్రకారం ముందు ఓ యాభై వేలు పంపమన్నాడు. గుడికెళ్లకుండానే తనకు శఠగోపం పెడుతున్నవాడు పూజారో, కాదో కూడా చెక్ చేసుకోకుండానే.. అప్పటికే వాడి మాయలో పడ్డ ప్రొఫెసర్ 50 వేలు చెల్లించాడు. ఓసారి ఆలయ సూపరింటెండెంట్ తో మాట్లాడని చెప్పి మరో ఇంత డబ్బు గుంజాడు. అలా రెండు మూడు వాయిదాల్లో 2 లక్షల 30 వేలు ప్రొఫెసర్ నుంచి తన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ కొట్టించుకున్న సదరు సైబర్ మోసగాడు.. డిసెంబర్ లో వస్త్రాలంకరణ సేవకు ఓ తేదీని చెప్పేసరికి ప్రొఫెసర్ లో అప్పటికే మోసపోతున్నానన్న భావన కాకుండా ఇంకా నమ్మకం బలపడింది.

ఇంకో ఫైన్ మార్నింగ్ ప్రొఫెసర్ కు సూపరింటెండెంట్ ను మాట్లాడుతున్నానని ఫోన్ వచ్చింది. డిసెంబర్ 24న స్లాట్ బుక్ చేశామని చెప్పి ఇంకో 2 లక్షల 90 వేల రూపాయలు గుంజారు. దైవభక్తిలో నిండా మునిగిన ప్రొఫెసర్.. అసలు తానో ఫ్రొఫెసర్ నని.. తిరుపతిలో అంత వ్యయమైన సేవలసలున్నాయా, లేదానని కూడా చెక్ చేసుకోకుండా సైబర్ హ్యాకర్స్ మాయలో కూడా అలాగే మునిగిపోయాడు. దాంతో ఏకంగా 5 లక్షల 20 వేల రూపాయలు తిరుమల తిరుపతి వెంకన్న వస్త్రాలంకరణ సేవ పేరిట ముక్కూ, ముఖం తెలియని సైబర్ కేటుగాళ్ల అకౌంట్స్ కు బదిలీ చేశాడు పాఠాలు చెప్పే ప్రొఫెసర్.

తాజాగా పోలీసులు బీఎన్ఎస్ 318 కింద చీటింగ్ కేసు నమోదు చేయడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. చెప్పండిప్పుడు సేమ్ టూ సేమ్ గోవిందా గోవిందాను తలపించే సినిమా కాదా ఇది..?

ఇందులో మోసగాళ్ల తెలివి కంటే కూడా… ఎందరికో ఎన్నో పాఠాలు బోధించే వ్యక్తి అయ్యుండి.. ముక్కూమొఖం తెలియనివాళ్లు ఏవేవో చెబుతుంటే క్రాస్ చెక్ కూడా చేసుకోకుండా లక్షలకు లక్షలు బదిలీ చేసిన ప్రొఫెసర్ తెలివితక్కువతనమే స్పష్టంగా కనిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles