అధికారికంగా, ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉండే మనుషుల మాటలు ఎంత ప్రభావితం చేస్తాయి.. ఒకవేళ వాటిని అమలు చేసినట్టైతే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో చెప్పే ఓ కథ మనమిప్పుడు చెప్పుకుందాం.
ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాల్సిందేనంటాడు. ఆ తర్వాత ఆ వివాదం పెరిగి పెద్దదయ్యేసరికి.. అది ఉన్నతంగా ఎదగాలనుకునేవారి ఓ ఛాయిస్ మాత్రమేనంటూ సవరించుకుంటాడు. ఇక ఎల్ అండ్ టీ సుబ్రహ్మణ్యం ఆ వారం పనివేళల్ని ఆదివారంతో కలుపుకుని 90 గంటలకు పెంచుతాడు. ఇక ఇప్పుడు బాంబే షేవింగ్ కంపెనీ సీఈవో శాంతాను దేశ్ పాండే రోజుకు 18 గంటలు పనిచేయాల్సిందేనంటూ లింక్డిన్ లో ఫ్రెషర్స్ కి సలహా ఇస్తాడు. వావ్ వీరంతా అంత పనిచేసి ఈ స్థాయికి రావడం గొప్ప విషయం. ఉన్నతస్థానాల్లో కూర్చోవడం ఇంకింత గొప్ప విషయం. వాళ్ల కంపెనీలను అద్భుతమైన ఆర్థిక ప్రగతి వైపు పరుగు పెట్టించడం మరింత గొప్ప విషయం. వారి కంపెనీల్లో పనేచేసే ఉద్యోగులకు వారనుకునే నిబంధనలను అమలు చేయడం వారిష్టానికి సంబంధించిన విషయం. కానీ, సమాజం మొత్తానికి మేమే స్టార్స్ అన్నట్టుగా వీరు చెప్పే సుద్దులపై మాత్రం భిన్నాభిప్రాయాలున్నాయి. ఎంతసేపు ఎదుగుదలే తప్ప.. ఆనందమయ జీవితాలనెలా సాకారం చేసుకోవచ్చో మచ్చుకైనా ఒక్క సీఈవో చెప్పడు. దాని పర్యవసానమేమైందో… ఆదివారాలు వస్తే భార్యల ముఖాలు చూసుకుంటూ ఏం కూర్చుంటారనే సీఈవోలు ఈ కేస్ స్టడీ విషయంలో ఏం చెబుతారో ఓసారి చూద్దాం.

ఓ ఉద్యోగి శాంతాను దేశ్ పాండే చెప్పినట్టుగా ఇంకా 18 గంటల పని చేసే స్థాయి ఒత్తిడిని ఎదుర్కోలేకపోయుండొచ్చుగానీ.. ఆల్మోస్ట్ 14 గంటలు పనిచేసి ఏడాదికి 7 కోట్ల 80 లక్షల జీతానికి ఓ మంచి ప్యాకేజీని, సీనియర్ మేనేజర్ ప్రమోషతో పాటే అందుకున్నాడు. కానీ ఏమైంది..? ఇంటికి దూరమైన ఆ ఉద్యోగికి తన పెళ్లాం విడాకులిచ్చేందుకు సిద్ధమైంది.
మనిషి ఉద్యోగం చేసేదే ఆనందంగా బతికేందుకు. ఆ ఆనందాన్నే చిదిమివేసే ఉద్యోగాలు.. అంతటి ఒత్తిడి.. కార్పోరేట్ పోటీ ప్రపంచంలో పైనున్నవారి లక్ష్యాలకు తగినట్టుగా నిత్యపరుగులు.. ఇదిగో వీటితో ఆ చిన్ని చిన్ని ఆనందాల్నే హరీ అనాల్సి వస్తోంది.
ఇప్పుడో ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ పోస్ట్ దుమ్మురేపుతోంది. అదే సమయంలో రోజుకు 18, 20 గంటలు పనిచేయాలనేవారికి.. వారానికి 70, 90 గంటల చొప్పున నోటికెంతొస్తే అంత చెప్పేవారి ముందు.. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల భవిష్యత్తుపై పలు ప్రశ్నలను సంధిస్తోంది ఆ పోస్ట్.
సదరు వ్యక్తి ఏమని పోస్ట్ చేశాడంటే.. మూడేళ్ల నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నేను కష్టపడి పనిచేశాను. రోజు 14 గంటలపాటు పనిచేసి ఎట్టకేలకు నేను నా పనిలో ఎదిగాను. పదోన్నతి సాధించాను. యురోపియన్, ఆసియా బృందాలను సమన్వయం చేసుకునే కోఆర్డినేటర్ స్థాయికి చేరాను. కానీ, ఓరోజు నా కుమార్తె పుట్టినరోజుకు కూడా హాజరుకాలేకపోయాను. ప్రసవం తర్వాత నా భార్యతో కనీసం బాగోగులు కూడా మాట్లాడలేకపోయాను. దాంతో నా భార్య నాకిప్పుడు విడాకుల నోటీసులు పంపించింది. తిరిగి చూసుకుంటే ఏం మిగిలిందన్నదే ఇప్పుడా ఉద్యోగి ప్రశ్న..? కానీ, ఆ పరిష్కారం చూపని ఆ ఉద్యోగి పశ్చాత్తాపానికి ఎవరు సమాధానం చెప్పగలరు…? ఎవరు బాధ్యత తీసుకోగలరు..?
ఈ ప్రశ్నకు నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యం, శాంతాను దేశ్ పాండే ఏం సమాధానాలు చెబుతారో తెలీదుగానీ.. బాధ్యత వహించగలరా..? ఇలాంటి, విరిగిపోయిన బతుకులను తిరిగి కలపగలరా..?
ప్రపంచంలోనే ఓ ప్రముఖ కంపెనీలో ఏడాదికి 7 కోట్ల 80 లక్షల రూపాయల ప్యాకేజీతో డబ్బు సంపాదించవచ్చు. కానీ, తానిప్పుడు ఆనందంగా లేనంటున్నాడు సదరు ఉద్యోగి. అసలు తానేం చేస్తున్నాడో ఇప్పుడు తనను తాను ప్రశ్నించే స్థితికి తన ఎదుగుదల అనే పరుగుపందెం తీసుకొచ్చిందంటాడు. భార్య విడాకుల వంటి తుఫాన్ హెచ్చరికతో ఇంకా ఆనందమెక్కడినుంచి వస్తుందన్న ఆ సమాధానం లేని ప్రశ్నపైనా.. నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూనే ఉన్నారు.
పైగా సదరు ఉద్యోగంటే 14 గంటలు కష్టపడగలడేమో.. అలాగే శాంతాను దేశ్ పాండే వంటివారు కూడా 18 గంటలు కాకపోతే 24 గంటలూ తిండీ, నిద్రాహారాలు మాని కష్టపడగలరేమోగానీ.. ప్రతి మనిషి శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలు ఒకేలా ఉండవన్న కనీసం అవగాహన కూడా ఇలాంటి ప్రకటనలు చేసేవారోసారి ఆలోచించాలి.
చాలామంది చెప్పిన విషయమేంటంటే.. మనం పెరుగుతున్న కొద్దీ మనం జీవితంలో గుర్తు చేసుకునేందుకు కొన్ని ఆనందమయ క్షణాలుండాలి. అలాంటి అనుభూతులే వృద్దాప్యంలోనూ.. ఎదుగుతున్నప్పుడు మనల్ని మరింత శక్తివంతంగా మార్చే సాధనాలవుతాయి.. మనం ముఖంపై నవ్వులు పూయిస్తాయంటారు.
ఇప్పటికే భారతీయ జీవనవిధానంపై ప్రాశ్చాత్య జీవన పద్ధతులు. పనిభారం వంటివి పడుతూ ఉమ్మడి కుటుంబాలన్నీ చెట్టుకొకరు, పుట్టకొకరుగా మారుతున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాస్తా ఆదర్శ కుటుంబాలుగా ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలన్నట్టుగా మారిపోయి.. ఆనందాల్ని ఏ థియేటర్స్ లోనో, పర్యాటక ప్రాంతాల్లోనో కొనుక్కుని జీవించాల్సిన పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఒత్తిడి పోటీకి అంతెక్కడ అన్నదీ ఓ ప్రశ్నే..?
అయితే, ఉద్యోగి కోణంలో సానుభూతి ఎంత వ్యక్తమైందో… ఒక నారాయణమూర్తి, మరో సుబ్రహ్మణ్యం, ఇంకో శాంతాను దేశ్ పాండే కోణాల్లో కూడా కొందరు మాట్లాడటం విశేషం. కుటుంబ సంబంధాలన్నింటినీ వదిలి అంకితభావంతో ఉద్యోగం చేసినప్పుడే… సదరు వ్యక్తిలాగా ఉన్నతస్థాయికి చేరుకోగలరనీ కొందరు చెప్పడం కొసమెరుపు.
సో ఇప్పుడు నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యం, శాంతాను దేశ్ పాండేలలా ఆలోచించి కష్టపడాలా.. ఆనందమయ జీవితాన్ననుభవించే బతుకు బతకాలా అనేది వ్యక్తిగత నిర్ణయాలకు సంబంధించిన అంశం.



