ఆటోగ్రాఫ్… ఓ మంచి అలవాటు!
దీనిని ఈకాలం యువతరం మరచిపోయింది. ముఖ్యంగా కళాప్రియులకు ఆటోగ్రాఫ్ ఒకప్పుడు హస్తభూషణం. నేను కాలేజ్ లో చదువుతున్న రోజుల్లో.. హాజరైన ప్రతి కచేరీ.. లేదా, కార్యక్రమం చివరి దాకా ఉండి.. ఆ కచేరీలో పాల్గొన్న కళాకారులను అభినందించి.. వారి ఆటోగ్రాఫ్ తీసుకోవటం అలవాటుగా మార్చకున్నాను. కర్నాటక, హిందుస్థానీ విద్వాంసుల ఆటోగ్రాఫ్సే కాక.. పలువురు కవులు, సినీప్రముఖులు.. ఒకరేమిటి…? అందరి సంతకాలూ సేకరించి.. అవి చూసుకుంటూ… మిత్రులకు చూపుతూ.. ఆనందించేవాణ్ణి.
శమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గారితో ప్రారంభమైన ఆటోగ్రాఫ్ సంస్కృతి.. మాండోలిన్ యు. శ్రీనివాస్ వరకూ.. శ్రీశ్రీ మొదలు, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి వరకూ.. గులాంఆలీ గారినుండి యేసుదాస్ గారి వరకూ.. పండిట్ రవిశంకర్ నుండి వీణ గాయత్రి గారి వరకూ.. అందరి సంతకాలతో పాటు.. వారి శుభాశీస్సులు కూడా పొందటం ఓ మధురానుభూతి!
సంగీత విద్యార్థిని కావటం చేత.. ఈ మంచి అలవాటు నాకబ్బింది.
అదేవిటో! ఈనాడు ఏవిద్వాంసులూ కచేరీలకు రారు… కచేరీ చేసిన తోటి కళాకారుణ్ణి అభినందించరు.. తమ శిష్యులనైనా కనీసం కచేరీలు వినమని పంపరు… ఇక ఆటోగ్రాఫ్స్ సంగతి సరేసరి!
ఆటోగ్రాఫ్ అంటే ఒక సంఘటన గుర్తుకు వస్తోంది…
అది 1980వ సంవత్సరం. బెజవాడ జ్యోతి కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న రోజులు. డిసెంబర్ నెలలో కాలేజీవాళ్లు విద్యార్థులకు విహారయాత్ర వేశారు. బెజవాడలో బయలుదేరితే.. ముందు మద్రాస్, తరువాత కంచి, మహాబలిపురం, బెంగుళూరు, శ్రీరంగపట్టణం, మైసూర్.. చివరికు తిరుపతి… తిరిగి బెజవాడకు బస్సులో ప్రయాణం.
అంతవరకూ ఊరువదిలి పెద్దగా ఎక్కడికీ వెళ్లని నేను.. గొడవచేసి ఇంట్లోవాళ్లని ఎలాగోలా ఒప్పించి.. ప్రయాణానికి సిద్ధమయ్యాను. సాయంత్రం బయలుదేరిన బస్సు… తెల్లవారక మునుపే మద్రాస్ చేరుకుంది. అక్కడ చూడవలసిన ప్రదేశాల్లో మొదటిది సినీప్రముఖులు ఎక్కువ మంది నివసించే టీనగర్.

అక్కడ ఏ నటుణ్ణి చూద్దామని అడిగారు మమ్మల్ని తీసుకెళ్లిన లెక్చరర్లు!
విద్యార్థులందరూ ఏకగ్రీవంగా ఎన్టీఆర్ ఇంటికి వెడదామన్నారు. వేటగాడు సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నడుస్తోంది. నేను కూడా ఎన్టీఆర్ అభిమానినే! అయితే.. అందరూ మెచ్చినట్లు ఆయన అందం, నటన కన్నా… ఎక్కువగా నాకు నచ్చేది ఆయన స్వరం! అదీ పాత సినిమాలలో!! చారిత్రాత్మకమైనా, జానపదమైనా, పౌరాణికమైనా, సాంఘికమైనా… ముఖ్యంగా, రొమాంటిక్ సన్నివేశాల్లో ఎన్టీఆర్.. తన మంద్ర, మధుర గాత్రంతో సంభాషించటం నాకెంతో నచ్చేది.
గంభీరమైన ఘంటసాల గానాన్ని కళ్లు మూసుకొని వింటే.. నాకు మాత్రం ఎన్టీఆరే మదిలో స్ఫురణకు వస్తారు. ఎన్టీఆర్ ఇంటిముందు మా బస్సు ఆగింది. అందరమూ బిలబిలమంటూ దిగి.. ముందు పోర్టికోలో తారకరామ దర్శనార్థం గుమిగూడి నుంచున్నాము. కొంత సేపటికి ఉదయపు వ్యాయామం ముగించుకుని.. క్యాజువల్ డ్రెస్సులో లోపలినుంచి నడచివచ్చారు ఎన్టీఆర్! అందరికీ చేతులు ఊపి.. శుభోదయం పలికారు. మా అందరి ఆనందానికి హద్దులు లేవు. వెండితెర వేలుపును వెయ్యి కళ్లతో వీక్షించాం.
మా కళాశాల వివరాలడిగి తెలుసుకున్నారాయన. ఇంతలో మాలో కొందరు అత్యుత్సాహవంతులు కరచాలనం కోసం తమ చేతులను చాపారు. చిరునవ్వుతో అందుకు నిరాకరించారాయన. ఇంతలో.. ఆటోగ్రాఫ్ కోసం నోటు పుస్తకాలను కొందరు, కొత్త కరెన్సీ నోట్లను కొందరు పట్టుకుని ముందుకు తోసుకురావటం ప్రారంభించారు.
అప్పుడు నాకు నా ఆటోగ్రాఫ్ గుర్తు వచ్చింది! అది ఎప్పుడూ నా చొక్కా పై జేబులో ఉంటుంది కనుక.. దాన్ని తీసుకొని చేయి ముందుకు చాచాను. సుమారు అరవై మంది విద్యార్థుల్లో ఆటోగ్రాఫ్ పుస్తకం ఉంది నా ఒక్కడి దగ్గరే! ఎన్టీఆర్ గారి దృష్టి నా ఆటోగ్రాఫ్ బుక్ మీద పడింది. అందరినీ కాదని.. నన్ను ముందుకు పిలిచి నా ఆటోగ్రాఫ్ పై సంతకం చేస్తూ..నన్ను నా వివరాలడిగి తెలుసుకున్నారు ఎన్టీఆర్. నా జన్మ ధన్యమైందనుకున్నాను. నేను మెచ్చిన స్వరాన్ని అతి దగ్గరగా వింటుంటే కలిగిన ఆనందం.. మాటలకందనిది!
మా కామర్స్ లెక్చరర్ మూర్తిగారు వెంటనే.. సుధాకర్ సంగీతం నేర్చుకుంటున్నాడు.. బాగా పాడతాడు అంటూ పరిచయం కూడా చేశారు. నన్ను అవునా అంటూ ఎన్టీఆర్ అందుకు నన్ను అభినందించారు!
నాతోటి విద్యార్థులు కొందరు నన్నుచూసి అసూయపడ్డారు. అయితే.. నా మిత్రుల్లో గణేష్ అని ఎన్టీఆర్ కు అత్యంత వీరాభిమాని ఒకతనుండేవాడు. అతని ప్రగాఢ కోరికను మన్నించి.. ఎన్టీఆర్ సంతకం చేసిన ఆ పేజీని జాగ్రత్తగా చించి.. తిరుగు ప్రయాణంలో అతనికి బహూకరించాననుకోండి!
ఇంతకూ నేను చెప్పొచ్చేదేమిటంటే… సంగీత విద్యార్థిని కాకపోతే.. నాకు ఆటోగ్రాఫ్ అలవాటయ్యేది కాదు. ఆనాడు ఆ అరుదైన అవకాశం నాకు దొరికేదీ కాదు. అసలు ఆమాటకొస్తే.. సం…గీ…తం అనే మూడు అక్షరాలు లేకుంటే..నేనే లేననిపిస్తుంది నాకెప్పుడూ!
MODUMUDI SUDHAKAR.. ✍️



