కనిపించి, మురిపిస్తుంది.. అంతలోనే మాయమైపోతుంది: ఓ రహస్యదీవి కథ ఇది!

బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బావుంది అంటాడు చంద్రబోస్ అనే సినీరచయిత ఓ సినిమా పాటలో. అదో ఊహజనితమైన ఆలోచనకు ఓ అక్షరకల్పన. కానీ, అలాంటిదే ఓ రహస్య దీవి నిజంగానే ఉంటే… రోజులో కేవలం కొద్ది సమయం మాత్రమే ఆ దీవి దర్శనమిచ్చి వెళ్లిపోతే…? ఇదేం ఊహ కాదు… కానీ, ఇప్పటికీ మిస్టీరియస్ గానే మిగిలిన ఓ దీవికి సంబంధించిన నిజం. ఒక్కసారి ఆ ఇంట్రెస్టింగ్ దీవికెళ్లొద్దాం పదండి.

రహస్యదీవి.. వినడానికి ఓ చందమామ కథలానో… బాల్యంలో చదివిన బాలమిత్ర పుస్తకంలోని పుటలోనో అనిపించే ఈ దీవి… అతి సుందరమైన కొంకణ్ తీరప్రాంతంలో దాగి ఉంది. దీన్నే సీగల్ ద్వీపమంటారు. అరేబియా సముద్రం కింద దాగి ఉండే ఈ ప్రత్యేకమైన ద్వీపం.. ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ ను ఇష్టపడే సాహసీకులను, సైబీరియా వంటి ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులను ఆకర్షించే ఓ అందమైన భూతల స్వర్గం. సముద్రంలో ఏర్పడే ఆటుపోట్లతో ఈ ద్వీపం కేవలం 30 నిమిషాలు మాత్రమే కనిపిస్తూ ఆ తర్వాత మళ్లీ మాయమైపోతుంది. సంద్రగర్భంలోకి వెళ్లిపోతుంది.

ఈ దీవికి చేరుకోవాలంటే మహారాష్ట్రలోని సింధూదుర్గ్ జిల్లా దేవబాగ్ బీచ్ కు చేరుకోవాల్సి ఉంటుంది. దీన్ని మినీ థాయ్ లాండ్ అని కూడా పిల్చుకుంటారు.

సీగల్ ద్వీపం.. అరేబియాలో ఓ అరుదైన దృగ్విషయం!

కేవలం అర్ధగంట సమయం మాత్రమే కనిపించే సీగల్ ద్వీపపు మార్మికత… అంతుచిక్కని పర్యాటక ప్రాంతంగానే పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆటుపోట్లు తగ్గినప్పుడు ఓ చిన్న ఇసుకతో కూడిన ద్వీపం ప్రత్యక్షమవుతుంది. చిన్న ఇసుక తిన్నెలాగా కనిపించినా.. మంత్రముగ్ధుల్ని చేసే పర్యాటకం ఆ ప్రాంతపు ప్రత్యేకత. ముఖ్యంగా సీగల్స్ ఎక్కువ కనిపించడంతోనే ఈ దీవికి సీగల్ ఐల్యాండ్ అనే పేరు స్థిరపడింది. ముఖ్యంగా ఇక్కడి పక్షులను చూడ్డానికే రెండు కళ్లూ చాలవు. సీగల్స్ తో పాటు, సంద్రతీరాల్లో మాత్రమే కనిపించే టెర్న్ పక్షిజాతి, కింగ్ ఫిషర్స్ వంటివి ఇక్కడ పెద్దసంఖ్యలో ఆకట్టుకుంటాయి.

కేవలం అరగంట సమయం మాత్రమే కనిపించి మళ్లీ మాయమయ్యే ఈ దీవి పరిశుభ్రతకు కేరాఫ్ లా కనిపిస్తుంది. పెద్దగా చెత్తా, చెదారం కనిపించని స్వచ్ఛమైన దీవి సీగల్ ద్వీపం. ఇక్కడి సూర్యరశ్మి, చుట్టూ విశాలమైన సంద్రం.. ఆ బయటకొచ్చిన అరగంటలోనే చేపలు పట్టే మత్స్యకారులతో ఓ చూడముచ్చటైన రహస్యదీవి సీగల్ ఐల్యాండ్.

సినీ కవి రాసిన పగడపు దీవిలానే మురిపించి మరిపించే సీగల్ ఐల్యాండ్ కు వెళ్లాలంటే రైలుమార్గంలో మాల్వన్ కు చేరుకోవాల్సి ఉంటుంది. రైలు మార్గంలో అయితే కుడన్ సమీప స్టేషన్. మాల్వన్ నుంచి పర్యాటకులు దేవ్ బాగ్ బీచుకు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడి స్థానిక మత్స్యకారులు 500 నుంచి 800 రూపాయల మధ్య రుసుం తీసుకుని ఆ అరగంట కనిపించే ద్వీపానికి బోట్స్ ని నడిపిస్తుంటారు. ఇక ముంబై వైపు నుంచి వెళ్లేవారికి కేవలం 42 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ సీగల్ ఐల్యాండ్. న్వావా షెవా అనే ఓడరేవు నుంచి ఈ ఐల్యాండ్ కు చేరుకోవచ్చు.

ఆటుపోట్ల సమయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాబట్టి వాటి సమయాన్ని బట్టే ఈ సీగల్ ఐల్యాండ్ అనే మిస్టీరియస్ దీవి కనిపించే అవకాశముంటుంది. ప్రతీరోజూ ఒకే సమయానికి కనిపించని ఈ దీవికి చేరుకోవాలంటే ఆటుపోట్ల వచ్చే సమయం వరకూ ఓపికతో వేచి చూడటం తప్పదు. అయితే, ఈ ద్వీపానికి చేరుకుని బాహ్యప్రపంచానికి దూరంగా కనిపించే ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించడం ఎంత అనుభూతో.. ఆటుపోట్ల సమయంలో ఆ ద్వీపం పైకి తేలుతున్నప్పుడు చూసే అనుభూతి జీవితంలో ఓ మరుపురాని అద్భుతమైన దృశ్యానుభవం.

అందుకే ప్రకృతి పర్యాటకులు అసలు తమ జీవితంలో మిస్ కాకుండా చూడాల్సిన ఒక అందమైన, ఒక రహస్యమైన, పక్షుల కిలకిలారావాల, సహజ సౌందర్య ద్వీపం సీగల్ ఐల్యాండ్. థాయ్ ల్యాండ్ కు వెళ్లకుండానే.. అంతకుమించిన అనుభూతిని పొందే కేరాఫ్ ఈ సీగల్ దీవి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles