టీచర్ గా ప్రారంభించి.. విద్యారంగ సంస్కరణల వరకు: ప్రముఖులంతా ఓడినా అతీషి విజయం!

మద్యం కుంభకోణంలో ఆరోపణలెదుర్కొని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలు జీవితాన్ననుభవిస్తున్న క్రమంలో.. ముఖ్యమంత్రిగా తెరపైకొచ్చి ఢిల్లీనేలిన మహిళ అతీషి మార్లేనా. అయితే, ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 సీట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ ను దాటి.. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీని కేవలం 22 సీట్లకే పరిమితం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ అడ్రస్సే గల్లంతైపోయిన పరిస్థితి. ఈ క్రమంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్, దుర్గేష్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్, సోమనాథ్ భారతి వంటి హేమాహేమీలంతా ఓటమిపాలైనా.. స్వల్పమెజార్టీతో ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి అతీషి మాత్రం గెలుపొందారు. అసలెవరు ఈ అతీషి అనే చర్చకు మరోసారి తెరలేపారు.

అతీషి మంచి విద్యావేత్త, విజనరీ!

విద్యతో పాటు, నాయకత్వ లక్షణాలుంటే సమాజాన్ని ఎలా మార్చవచ్చో చూపించిన వ్యక్తుల్లో అతీషి పేరు కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. బలమైన విద్యా పునాదులతో సంస్కరణల బాట పట్టించగల నేర్పరి అతీశి. ఢిల్లీలో ఒక అత్యున్నత విద్యావిధానాన్ని రూపొందించడంలో అతీషీది కీలకపాత్ర. విద్యార్థీ రాజకీయాల నుంచి ఎదిగిన అతీషి రాజకీయ ప్రయాణం చాలామంది మహిళా నేతలతో పోలిస్తే భిన్నమైనది.

అతీషి తల్లిదండ్రులిద్దరూ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్. విజయ్ సింగ్, త్రిప్తా వాహి ఇద్దరూ ఉన్నత విద్యావంతులే కావడంతో… ఆ ప్రభావం కచ్చితంగా అతీషీపై ఉంది. నేర్చుకోవాలనే జిజ్ఞాస ఆమెలోనూ చిన్ననాటి నుంచే ఉండేది. న్యూఢిల్లీలోని స్ప్రింగ్ డేల్స్ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన అతీషి.. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అఫిలియేటెడ్ గా ఉన్న సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదివింది. ఆమె చదువుల తల్లిగా రాణించడంతో సమిటోమో సెయింట్ స్టీఫెన్స్ స్కాలర్ షిప్ తో పాటు.. రాజ్ పాల్ మెమోరియల్ అవార్డును కూడా దక్కించుకుంది. సెయింట్ స్టీఫెన్స్ లో ఆమె విద్యాప్రయాణం ఓ మైలురాయి.

ఆక్స్‌ఫర్డ్ అనుభవం!

తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినతర్వాత అతీషి ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివింది. 2003లో, ఆమె షెవెనింగ్ స్కాలర్‌షిప్‌తో తన మొదటి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. కానీ అక్కడితో ఆగలేదు. రెండు సంవత్సరాల తిరిగి మళ్లీ ఆక్స్ ఫర్డ్ కు చేరుకుంది. అక్కడ రోడ్స్ స్కాలర్‌షిప్ ద్వారా వచ్చిన నిధులతో మరో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఈ అర్హతలు ఆమె రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే సమయంలో.. ముఖ్యంగా ఆప్ అధికారంలోకొచ్చాక.. ఆమె ఏకంగా ముఖ్యమంత్రయ్యాక విద్యా సంస్కరణల్లో ఆమెకు మరింత సంస్కరణలకు ఉపయోగపడ్డాయి.

అతీషి జర్నీలో ఆంధ్రప్రదేశ్!

అతీషి రాజకీయాల్లోకి రాకముందు ఓ సాధారణ ఉద్యోగి. ఆంధ్రప్రదేశ్ రిషీవ్యాలీ స్కూల్ లో చరిత్ర, ఇంగ్లీష్ బోధించింది.

రాజకీయ నాయకత్వంతో విద్యా సంస్కరణలు!

విద్యపై అతీషికి ఉన్న లోతైన జ్ఞానంతో పాటు.. ఆమెలో ఉన్న నాయకత్వం లక్షణాలు వెరసి.. మరోవైపు కేజ్రీవాల్ భావాలకు ఆకర్షితురాలై ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది. ఆప్ పాలనాకాలంలో ఢిల్లీ విద్యావ్యవస్థను సంస్కరించడంలో అతీషిది కీలక పాత్ర. ఢిల్లీ విద్యామంత్రిగా నాణ్యమైన విద్య కోసం అవిశ్రాంతంగా కృషి చేసింది. ఆమె తీసుకొచ్చిన సంస్కరణలతో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు దేశానికే రోల్ మాడల్ గా నిల్చాయి. విద్యపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ఎలా ఉంటుందో చేసి చూపించిన నాయకురాలు అతీషి.

ఆమె సమర్థ నాయకత్వం ఆమెను గత ఆప్ ప్రభుత్వంలో కీలకపాత్రలకు సారథిని చేసింది. అలా ఆమె ఏకంగా ఆర్థిక, ప్రణాళిక, ప్రజాపనులు వంటి పదకొండు పోర్ట్ ఫోలియోస్ నిర్వహించింది. అనేక బాధ్యతలు నిర్వహించిన ఏకైక మహిళా మంత్రిగా కూడా అతీషిది రికార్డ్. తన బహుముఖ ప్రజ్ఞ, ప్రతిభతో ఢిల్లీలో ఆప్ పాలనను విద్యావంతులంతా మెచ్చుకునేలా చేసింది.

అతీషి మార్లెనా ప్రయాణం ఓ విద్యావేత్త నుంచి… విద్యా సంస్కరణలో కీలక నాయకురాలి వరకు కచ్చితంగా ఓ ప్రేరణే. భవిష్యత్ తరాలకు మంచి విద్యనందించాలనే ఆమె అంకితభావం.. విద్య అంటే కేవలం డిగ్రీలు సంపాదించడమే కాదు.. అంతకుమించి అని చెప్పాలనుకున్న ఆమె విధానాలు కచ్చితంగా ఢిల్లీ సమాజంపై ప్రభావాన్ని చూపాయి. కాబట్టే, ఆప్ వ్యవస్థాపకులనే బీజేపీ హవాతో ఊడ్చేసినా… ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి అతీషి మాత్రం బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరీపై 3 వేల 521 ఓట్ల మెజార్టీతో గెలుపొంది మళ్లీ వార్తల్లో నాయకురాలైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles