176 మంది ప్రయాణీకులతో కూడిన IC 814 విమానం హైజాక్ వ్యవహారం 1999లో ఎంత పెద్ద సంచలనమో తెలిసిందే! ఎందుకంటే ఇండియన్ ఎయిర్ లైన్స్ IC 814 ఎయిర్ క్రాఫ్ట్ హైజాక్.. ప్రపంచ విమానయాన చరిత్రలోనే అతి పెద్ద హైజాక్. ప్రయాణీకులంతా వారం రోజుల పాటు హైజాకర్స్ చెరలో ఉన్న ఘటన అది.
పాకిస్థాన్ హస్తముందని… పూర్తిగా ఆ దేశ ఐఎస్ఐ నిఘా వర్గాలే ఆ హైజాక్ లో కీలకపాత్ర పోషించాయన్నది మాజీ దౌత్యవేత్త, పాక్ లో హై కమిషనర్ గా పనిచేసిన గోపాలస్వామి పార్థసారధి కుండబద్ధలు కొట్టారు.
అయితే ఈ ఎపిసోడ్ లో అసలేం జరిగింది.. నాటి ప్రధాని వాజ్ పాయ్ ఎలా స్పందించారు, ఆయన ఆలోచనలెలా సాగాయి.. గోపాలస్వామి పార్థసారధి ఏం చేశారు.. ఇలా అనేక అంశాలను నాటి ప్రధాని వాజ్ పాయ్ ప్రైవేట్ సెక్రటరీ అజయ్ బిసారియా.. యాంగర్ మేనేజ్‌మెంట్.. ది ట్రబుల్డ్ డిప్లమాటిక్ రిలేషన్ షిప్ బిట్ ఇండియా అండ్ పాకిస్థాన్ అనే తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఆ సమయంలో తాను ప్రధాని వాజ్ పాయ్ తో ఉన్నప్పుడు ఏం జరిగిందో అజయ్ బిసారియా మాటల్లోనే విందాం.

IC 814 హైజాక్ సంక్షోభ సమయమది… ఒక్కసారిగా ఆకాశం ఉరుమురిమి పిడుగు మీదపడ్డంత ఆందోళన.. అప్పుడు అమృత్ సర్ లో టేకాఫ్ అయిన ఫ్లైట్ ను కెప్టెన్ అక్కడే ఎందుకు ఆపలేకపోయారన్న సందేహాన్ని మా ముందుంచారు అప్పటి ప్రధాని వాజ్ పాయ్. ఆ తర్వాత అదే హెడ్ లైన్స్ గా పతాకశీర్షికలకెక్కడం.. పైలెట్ పై విచారణకు ఆదేశించాలన్న డిమాండ్స్ రావడమూ తెలిసినవే!
సరిగ్గా 1999, డిసెంబర్ 24న వాజ్ పాయ్ పాలం ఎయిర్ పోర్ట్ లో ల్యాండయ్యారు. నేనూ ఆయన కారులో ఎక్కాను. తెల్లారితే వాజ్ పాయ్ 75 సంవత్సరాల వయస్సులోకి అడుగుపెట్టే వేడుకను ఘనంగా నిర్వహించాలనుకుంటున్న తరుణమది. కానీ, ఆనాడు జరిగిన ఘటన కార్గిల్ ను మించిన తలబొప్పి తనకు తేబోతోందని అప్పటికింకా వాజ్ పాయ్ ఊహలో లేదు. నేను అంతకు కొద్ది రోజుల ముందే ప్రధాని ప్రైవేట్ సెక్రటరీగా జాయినయ్యాను.
1999, ఏప్రిల్ 1వ తేదీన తాను ప్రధాని ప్రైవేట్ సెక్రటరీగా నియామకం కాబోతున్నానన్న వార్త వినగానే… నన్ను ఏప్రిల్ ఫూల్ చేసే ఓ ప్రాంక్ వార్త అని భావించా. అప్పుడు నేను బెర్లిన్ లో భారత రాయబార కార్యాలయంలో ఓ కీలక ప్రాజెక్ట్ పై పనిచేస్తున్న సమయం. నాకింకొంచెం సమయం కావాలని బాన్ లో ఉన్న రాయబారి రోనెన్ సేన్ కు సమాచారమందించాను. కానీ, ఆయన ఆశ్చర్యపోయారు. పీఎంవోలో పని చేసే అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోరని.. వెంటనే వెళ్లి విధుల్లో జాయిన్ కావాలని ఒకింత సున్నితంగా మందలించారు. కానీ, అదే సమయంలో ఏప్రిల్ 17, 1999న జయలలిత నేతృత్వంలోని ఏఐడీఎంకే మద్దతు ఉపసంహరణతో.. వాజ్ పాయ్ ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్ష వీగిపోయింది. ప్రతిపక్షం కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంతో మళ్లీ లోక్ సభ రద్దైపోయింది. కానీ, నేను ఢిల్లీకి బయల్దేరడం మాత్రం తప్పలేదు. ఆ తర్వాత మళ్లీ 1999లో వాజ్ పాయ్ నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి గద్దెనెక్కిన సంగతి తెలిసిందే. అలా జూలై ప్రారంభంలో కార్గిల్ సంక్షోభం ముగుస్తున్న తరుణంలో నేను ఢిల్లీలో డిప్యూటీ సెక్రటరీ హోదాలో జాయినయ్యాను
అందరికీ హ్యాపీ క్రిస్మస్.. నాకు మాత్రం సంక్షోభ నివారణపై క్లాస్!
ప్రధానమంత్రి ప్రత్యేక రక్షణ దళం నెట్ వర్క్ నుంచి తనకు అత్యవసరంగా కాల్ చేయమనే సందేశం నా కొలీగ్ ఆనందరాజన్ నుంచి అందింది. ఆనందరాజన్ ప్రధానికి మరో ప్రైవేట్ సెక్రటరీ. నేను వెంటనే ఆనంద్ రాజన్ తో మాట్లాడి.. దమ్ము తీసుకుంటూనే ప్రధానితో ఆ విషయాన్ని షేర్ చేశాను. నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చే ఇండియన్ ఎయిర్ లైన్స్ IC 814 హైజాకై.. అమృత్ సర్ లో ల్యాండైందని చెప్పాను. మరోవైపు రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధాని ఇంటివద్ద క్రైసిస్ మేనేజ్ మెంట్ గ్రూప్ మెంబర్స్ తో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రజేష్ మిశ్రా.. వాజ్ పాయ్ తో IC 814 సంక్షోభంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాతో ఇంకేమైనా చెప్పేదుందా అంటూ వైట్ అంబాసిడర్ కారులో ముందు సీటులో కూర్చున్న ప్రధాని.. కాస్త తల బయటకు పెడుతూ విచారవదనంలోకి వెళ్లిపోయారు. అప్పటికే రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నాం. కొద్ది నిమిషాల్లోనే ప్రధాని వద్దకు చేరుకున్న మిశ్రా చేసిన బ్రీఫింగ్ ఓ పెద్ద సంక్షోభాన్ని కళ్లముందుంచింది.
కచ్చితంగా ఇది పాకిస్థాన్ పనే అనే విషయం భద్రతా నిపుణులకు స్పష్టమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ హైడ్రామా బట్టబయలైంది కూడా. హైజాకర్స్ విమానాన్ని లాహోర్ లో ల్యాండ్ చేయాలని ఎప్పుడైతే డిమాండ్ చేశారో.. అప్పుడు అనుమానాలు బలపడ్డాయి. వాజ్ పాయ్ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన నేపథ్యాన్ని పురస్కరించుకుని.. ఆయన డెబ్బై ఐదో పుట్టినరోజు వేడుకలకు ఘనంగా సిద్ధమవుతున్న వేళ.. IC 814 హైజాక్ సంక్షోభంతో వాటన్నింటినీ రద్దు చేసేశారు.
ఖాట్మండు నుంచి ఢిల్లీకి రావల్సిన ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ IC 814 ఖాట్మండులో హైజాక్ కు గురై..అమృత్ సర్ లో ల్యాండై… లాహోర్, యూఏఈల మీదుగా… తాలిబాన్ల నియంత్రిత కాందహార్ లో చివరగా ల్యాండింగ్ కావడంపై పీఎంవో వార్ రూం చర్చోపచర్చలతో మునిగిపోయింది. హనీమూన్ కోసం వెళ్లిన రూపిన్ కత్యాల్ అనే వ్యక్తిని దారుణంగా చంపిన హైజాకర్స్.. మరొకరిపై కూడా కత్తితో దాడికి తెగబడ్డారు. ఆ రక్తంతో తడిసిన కత్తిని పైలట్ కెప్టెన్ దేవీశరణ్ ముందు పెట్టి బెదిరించారు. తాము చెప్పినట్టు ఫ్లైట్ వెళ్లకపోతే.. సేమ్ సినీ ఫక్కీలో రూపిన్ కత్యాల్ లాగే.. ఐదు నిమిషాలకో శవం లేస్తుందని హెచ్చరించారు. దాంతో అమృత్ సర్ నుంచి టేకాఫ్ కాక తప్పని పరిస్థితి.
అప్పటి ముషారఫ్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. అయినా, పాకిస్థాన్ తప్పు లేదని బుకాయించింది. భారత్ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించిందంటూ కొత్త ప్రచారాన్ని లేవనెత్తింది. 1999, అక్టోబర్ 12 నుంచే పాకిస్థాన్ పై ఇండియా బురద జల్లే ప్రయత్నాలు మొదలెట్టిందని.. కామన్వెల్త్ లో పాక్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే భారత్ టార్గెట్ గా నాటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి అబ్దుల్ మీడియాకు వెల్లడించారు. అంతేకాదు తూర్పు, పశ్చిమ పాకిస్థాన్ ల మధ్య రాత్రి వేళ విమానాలను నిరోధించే కుట్ర కూడా భారత్ చేస్తోందని.. కావల్సినన్ని ఆరోపణలు గుప్పించాడు పాక్ విదేశాంగ మంత్రి అబ్దుల్.
పాకిస్థాన్ ఎంత ఎదురుదాడికి దిగుదామనుకున్నా.. హైజాక్ వెనుక పాక్ ఐఎస్ఐ హస్తమున్నదన్నది స్పష్టంగా అప్పటికే రూఢీ అయింది. మరోవైపు ఆ ఘటనపై ప్రపంచ మీడియా ఫోకస్ చేసింది. అప్పటికే భారత్ లో ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు పెద్దగా వెల్లువెత్తుతున్నాయి. గతంలో అలాంటి హైజాక్స్ జరిగినప్పటికీ.. IC 814 స్థాయిలో అవి సున్నితమైనవీ కావు.. అంతకుమించి చర్చనీయాంశమూ కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వరల్డ్ ఏవియేషన్ చరిత్రలోనే వారం రోజుల పాటు అమాయకులైన 170 మందికిపైగా ప్రాణాలు ముష్కరుల చేతుల్లో ఉన్న ఘటన. ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా, యుక్తిగా వ్యవహరించాల్సిన సందర్భమది. దాంతో సరైన పరిష్కారం కోసం క్రైసిస్ మేనేజ్ మెంట్ టీమ్ భిన్నరకాల సుదీర్ఘమైన చర్చలు చేస్తూనే ఉంది.
అప్పటికే ఈ విషయంపై ఆపరేషన్ ప్రారంభించిన పాక్ లో భారత హైకమిషనర్ పార్థసారధి ఇస్లామాబాద్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంతకుముందు 1984లో కరాచీలో పనిచేస్తున్న సమయంలో రెండు హైజాక్ కేసులను డీల్ చేసిన అనుభవముంది సారధికి. దుబాయ్ లో జరిగిన హైజాక్ వ్యవహారంలో అప్పుడు ఐఎస్ఐ లాహోర్ లో హైజాకర్స్ కు ఓ పిస్టల్ ను అందించిన విషయం తన స్ఫురణలో ఉంది. దాన్ని చాకచక్యంగా అధిగమించిన అనుభవముంది. పాక్ కుట్రపూరిత బుద్ధి తెలిసిన అధికారిగా.. ఏం జరుగబోతోందో పార్థసారధి అంచనా వేయగల్గడం మొదలెట్టారు. అయితే IC 814 కూడా లాహోర్ లో దిగడంపై మాత్రం.. ఎక్కడో ఓ మూలన పార్థసారధిలో సందేహం నెలకొంది. దుబాయ్ లో టేకాఫ్ అయ్యే అవకాశాలుంటాయనే అనుమానంలో పడ్డారాయన. పాక్ లో భారత హై కమిషనర్ హోదాలో చర్చలు జరిపేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పాక్ విదేశాంగశాఖను పార్థసారధి చర్చిద్దామంటూ కోరారు. అప్పుడు రావల్పిండిలో ఉన్న పార్థసారధిని లాహోర్ కు రమ్మని సందేశం అందింది. అలా తాను బయల్దేరే సమయానికే హైజాక్ కు గురైన IC 814 లాహోర్ నుంచి బయల్దేరిందన్న విషయం పార్థసారధికి తెలియడంతో ఆయన తన రూట్ మార్చుకున్నారు.
అదే సమయంలో హైకమిషన్ ను తాలిబాన్ ప్రతినిధులు సంప్రదించారు. ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ లో ఫ్లైట్ ల్యాండ్ అయిందని.. తాము చెప్పినవారిని వదిలేయాలంటూ కరడుగట్టిన ఉగ్రవాదుల విడుదలను వారు కోరారు. కానీ, గోపాలస్వామి పార్థసారధి అందుకు ససేమిరా అన్నారు. ఆ సమయంలో ఢిల్లీ బృందం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది.. కాబట్టి, మీరు దిగిరాకపోతే మీకే నష్టం.. తమ చెరలో ఉన్నవారి ప్రాణాలకే ప్రమాదమని తాలిబాన్ ఉగ్రమూకలు హెచ్చరించాయి. అప్పటికే ఐఎస్ఐ, తాలిబాన్ సంబంధాలు బలంగా స్థిరపడ్డట్టు.. హైజాకర్స్ వెనుకున్నది వారేననీ భారత విదేశాంగ శాఖ అధికారుల బృందం గ్రహించింది. అదే సమయంలో ఇక ఆలస్యం చేయకుండా హైజాకర్స్ నుంచి మిగిలినవారిని రక్షించే క్రమంలో చర్చలు జరిపే బృందం కాందహార్ లోని టార్మాక్ కు చేరుకుంది. ఏ.ఆర్. ఘన్ శ్యామ్ కాందహార్ బృందంలో కౌన్సెలర్. వారు ఉర్దూ మాట్లాడుతున్న తీరు.. పాకిస్థానీలు తాలిబాన్లను హ్యాండ్లింగ్ చేస్తూ, నిర్దేశిస్తున్న తీరు అన్నీ గమనించారాయన. అక్కడ మరో ఆప్షనే లేదు. దాంతో హైజాకర్స్ చెర నుంచి IC 814లో ఉన్న వారిని విడిపించేందుకు.. ముగ్గురు టెర్రరిస్టులను విడుదల చేయడానికి భారత ప్రభుత్వం తరపున ఒప్పుకోక గత్యంతరం లేని అనివార్య పరిస్థితది.
తెల్లారితే కొత్త సహస్రాబ్ది… 2000వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అప్పుడు విదేశాంగ మంత్రిగా జస్వంత్ సింగ్ తీవ్రమైన ఒత్తిడినెదుర్కొంటున్నారు. దాంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి కాందహార్ కు వెళ్తానని.. తనకు భద్రత కోరుతూ క్యాబినెట్ కమిటీకి విషయాన్ని తెలియపర్చారు. ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను తన వెంట తీసుకెళ్లి.. మళ్లీ అదే విమానంలో హైజాకర్స్ చెర నుంచి విడిపించిన ప్రయాణీకులను తీసుకురావాలనేది యోచన. దానిపై జస్వంత్ సింగ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాందహార్ విమానాశ్రయంలో ఒక్క విమానం మాత్రమే ల్యాండింగ్ కు అవకాశముంది కనుకే ఆ నిర్ణయం తీసుకున్నట్టు తన చర్యను సమర్థించుకున్నారు జస్వంత్. అలా డిసెంబర్ 31, 1999న కాందహార్ లో ముగ్గురు ఉగ్రవాదులను అప్పగించి.. హైజాకర్స్ నుంచి ప్రయాణీకులను సురక్షితంగా కాపాడి తీసుకొచ్చారు.
ప్రయాణీకుల ప్రాణాలతో ముడిపెడితే.. ఆ సెంటిమెంట్ భారత్ పై పనిచేస్తుందని ముష్కరులకు తెలుసు. బ్లాక్ మెయిలింగ్ కు లొంగుతుందనే విషయం పాక్ కూ తెలుసుననే విషయం పార్థసారధికి క్లారిటీ ఉంది. ఎందుకంటే 1990లో రుబయ్యా సయీద్ కిడ్నాప్ కేసులో భారత్ వైఖరిని తమకు అనుకూలంగా పాక్ ఎలా మార్చుకుందో పార్థసారధికి స్ఫురణకొచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అనేక మంది హత్యల వెనుకా ఐఎస్ఐ హస్తముందనేదీ ఆయనకు స్పష్టత ఉంది. కానీ, ఆ రోజున ప్రయాణీకుల ప్రాణాలు కాపాడే క్రమంలో విడుదల చేసిన ఉగ్రవాదులే.. భారత్ పై మళ్లీ కక్ష కట్టారు.
అసలెవరీ మౌలానా మసూద్ అజార్..?
2000ళసంవత్సరంలో జేష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు. పంజాబ్ ప్రావిన్స్ లో ఉండేవాడు. పాకిస్థాన్ ఐఎస్ఐ కోరిక మేరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో విడిపోయి కొట్టుకుంటున్న వారిని ఏకతాటిపైకి తెచ్చిన మౌలానా. అక్రమ పాస్ పోర్ట్ పై కాశ్మీర్ లోకి చొరబడి.. ఆ తర్వాత ఇండియాకు చిక్కిన ఉగ్రవాది. భావహల్పూర్ కేంద్రంగా ఉగ్రవాద క్యాంపులు నడిపి శిక్షణ ఇస్తూ అంతర్జాతీయ సమాజానికి, ముఖ్యంగా భారత్ కు కొరకరాని కొయ్యగా తయారైనవాడు. ఐసీ 814 ఘటనతో విడుదలయ్యాక తనకు పునర్జన్మ లభించిందని.. మిగిలిన తన జన్మంతా భారత్ ప్రతీకారం తీర్చుకోవడమే కర్తవ్యం, లక్ష్యమని చెప్పినవాడు. ముఖ్యంగా సూసైడ్ బాంబర్స్ తో విధ్వంసం సృష్టించే కిరాతకుడు. మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఎన్నోసార్లు ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదన పెట్టినా.. చైనా వీటోతో అడ్డుకుంది. చివరకు ఆ చైనా కూడా ఉగ్రవాదంతో బాధపడే పరిస్థితులెదుర్కోవడం మొదలయ్యాక.. 2021లో చైనా కూడా ఆ ప్రతిపాదనకు అంగీకారం తెలపడంతో మసూద్ అజార్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డాడు. 2019లో పుల్వామా దాడి ఘటనతో పాటు.. పార్లమెంట్ పై దాడిలోనూ ప్రధాన బాధ్యుడు. ఇక బేషరతుగా విడుదలైన ఖైదీల్లో మరొకరైన ముస్తాక్ అహ్మద్ జర్గర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో టెర్రరిస్టులకు శిక్షణనివ్వడం ప్రారంభించాడు. మరో ఉగ్రవాది ఒమర్ షేక్ 2001, 9/11న న్యూయార్క్ లో ట్విన్ టవర్స్ పై దాడి కుట్రలో కీలక పాత్రధారుడు. 2002లో యూఎస్ కు చెందిన రిపోర్టర్ డేనియల్ పెర్ల్ ను హత్య చేసిన ఘటనలో అరెస్టైన ఒమర్ షేక్ కు మరణశిక్ష పడ్డా లాభం లేకపోయింది. కేవలం 7 ఏళ్లల్లోనే ఒమర్ మరణశిక్ష రద్దై బయటకు రావడం మరో కొసమెరుపు.
నూతనంగా మూడోసారి ఏర్పడ్డ వాజ్ పాయ్ ప్రభుత్వానికి.. 1999లో జరిగిన కాందహార్ హైజాక్ ఘటన చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. 1970, 80ల్లో హైజాకింగ్స్ జరిగినా.. వాటితో పోల్చినప్పుడు 1999 హైజాక్ కేసు అప్పటి వాజ్ పాయ్ సారథ్యంలోని భారత ప్రభుత్వానికి పలు సవాళ్లను ముందుంచింది. భిన్నరకాల ప్రపంచ కోణాల్లో చూడాల్సిన సున్నితమైన ఘటనగా మారింది. మరోవైపు మానవీయ కోణం చూపించాల్సిన పరిస్థితి. ఇంకోవైపు సంచలనాల కోసం మీడియా చేసే హడావిడి. అలాంటి సమయంలో ఒక పాలసీ మ్యాటర్ ను ఎంత సున్నితంగా డీల్ చేయాలి.. ఓ సంక్షోభానికి ఎలా తెర దించాలన్నది ఓ ఛాలెంజింగ్ టాస్క్ అంటారు అజయ్ బిసారియా. ఆ సమయంలో వాజ్ పాయ్ కి హైజాక్ ఇష్యూను డీల్ చేస్తున్న తీరుపై పూర్తి సంతృప్తి లేకుండెనని.. భిన్నాభిప్రాయాలుండేవంటారాయన. ఆపరేషన్ విజయవంతమై కాందహార్ నుంచి హైజాకర్స్ చెర నుంచి ప్రయాణీకులను విడిపించిన ఆ విజయాన్ని పురస్కరించుకుని కెప్టెన్ దేవీశరణ్ కుటుంబాన్ని సన్మానిస్తూ ఓ వేడుక ఏర్పాటు చేయాలనుకున్నారు. నేను ఆ విషయాన్ని తీసుకుని వాజ్ పాయ్ దగ్గరికి వెళ్లితే.. మళ్లీ వాజ్ పాయ్ నుంచి.. అమృత్ సర్ లో ల్యాండింగ్ అయిన ఫ్లైట్ ను శరణ్ మరి కాస్సేపు ఎందుకు ఆపలేకపోయారన్న ప్రశ్నే ఎదురైంది.
వాజ్ పాయ్ 13 నెలల పదవీకాలం.. పోఖ్రాన్ న్యూక్లియర్ ప్రయోగం.. లాహోర్ సందర్శన.. కార్గిల్ యుద్ధం.. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి మొత్తంగా సవాళ్లతో ప్రయాణం చేయాల్సిన పరిస్థితులను కళ్ల ముందుంచింది. లాహోర్ కు వాజ్ పాయ్ బస్సు యాత్రతో.. అప్పటివరకూ న్యూక్లియర్ అణ్వాయుధాల వల్ల చెదిరిపోయిన భారత్ పాక్ మైత్రి మళ్లీ కలుస్తుందనుకున్న కాలంలో.. కార్గిల్ యుద్ధంతో పాక్ మళ్లీ తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఏదేమైనా 90వ దశాబ్దంలో.. కాందహార్ హైజాక్ తో మొత్తంగా ఆ శతాబ్ది ముగింపు ఎంత బాధాకరంగా సాగిందో అజయ్ బిసారియా తన పుస్తకంలో రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఇండో పాక్ యుద్ధం, ఉద్రిక్తతలు.. ఉగ్రవాద శిబిరాలపై దాడిలో భావహల్పూర్ లో మసూద్ అజార్ సోదరుడు, బంధువులు మరణించడం.. వారి అంత్యక్రియలకు కూడా మసూద్ వచ్చి వెళ్లాడన్న వార్తల నేపథ్యంలో తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన కథనమిది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వెబ్ సీరిస్ గా కూడా తెరకెక్కింది IC 814. కొంత ఆన్ స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం మార్పులు చేర్పులకు గురైనా.. ఆనాటి విశేషాలను ఓ దృశ్యరూపకంగా కళ్ల ముందుంచే సీరిస్ ఇది.



