పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలతో కొన్ని ప్రాంతాలు ప్రాచుర్యంలోకి వస్తాయి. కానీ, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆకలి కేకలు వేస్తున్న సమాజానికి… అన్నం పెట్టిన ఊరు గురించి మనం తెలుసుకోవాలి. సముద్ర మట్టానికి దిగువన వ్యవసాయాన్ని సుసాధ్యం చేసి.. ఓ పల్లెను విప్లవాత్మక వ్యవసాయానికి కేరాఫ్ గా మార్చిన ఓ వ్యక్తి గురించీ మనం తెలుసుకోవాలి. అందుకు మనం ఓసారి కేరళకు వెళ్లాలి.
కుట్టనాడ్ లోని చితిరపల్లి.. ఆకలిని దూరం చేసిన వ్యవసాయ స్మారక చిహ్నం.

రెండో ప్రపంచ యుద్ధానంతరం తీవ్రమైన కరువు ఏర్పడింది. ఆ కరువు రక్కసిని ఎదుర్కొని పేదలకు పట్టెడన్నం పెట్టిన మానవ సంకల్పశక్తికి నిలువెత్తు నిదర్శనమే చితిరపల్లి. కేరళలోని గొప్ప పర్యావరణ, వ్యవసాయ విజయాల్లో ఒకటిగా సముద్ర మట్టానికి దిగువనున్న చితిరపల్లి నిల్చింది.
ఆ చారిత్రక నేపథ్యం వెనుక దూరదృష్టి కల్గిన ఓ వ్యక్తి ఉన్నాడు. ఆయనే జోసెఫ్ మురిక్కన్. కుట్టనాడ్ ప్రజలు ఆయన్ను కాయల్ కింగ్ అని పిల్చుకుండేవారు. స్థానిక రైతాంగంతో కలిసి పనిచేస్తూ సంప్రదాయ విజ్ఞానం, స్థానిక ఇంజనీరింగ్ పద్ధతులను వినియోగిస్తూ.. సముద్రమట్టానికి దిగువన ఉన్న విశాలమైన మర్షి భూముల్లో సాగును సుసాధ్యం చేసిన నాయకుడు జోసెఫ్ మురిక్కన్.
అందుకోసం చుట్టుపక్కల సరస్సుల వద్దనున్న ఎర్ర, బంకమట్టిని తెచ్చి.. కొబ్బరి, పోకవక్క చెట్ల కట్టెలతో బలమైన బండ్స్ నిర్మించి.. నీట మునిగిన మర్షి భూములను సారవంతమైన పొలాలుగా మల్చింది జోసెఫ్ మురిక్కన్ బృందం. అందుకోసం జోసెఫ్ బృందం నెలల తరబడి శ్రమించింది. దూరదృష్టితో పాటు, పక్కా ప్రణాళికలతో మొదట 2 వేల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చారు. ఆనాటి కరువు కాలంలో సముద్రానికి దిగువ భాగంలో వ్యవసాయంలో అదో అద్భుతం.

ఒకే ఒక్కడి సంకల్ప బలం వల్ల ఊరంతా కదిలించి. కుట్టనాడ్ ఆకలికేకలకు స్వస్తి పలికాడు జోసెఫ్. వేలాది ఎకరాల భూములను సాగు భూములుగా మార్చాడు. దైవమంటే భక్తి ఉన్న మురిక్కన్.. అదే ప్రాంతంలో ఒక వైపున చర్చ్ నిర్మించాడు. జోసెఫ్ చేపట్టిన ఆ మహత్తర కార్యానికి కూడా ఓ ప్రేరణ ఉంది. 1940ల ప్రాంతంలో వచ్చిన కరువు.. ట్రావెన్ కోర్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పటి ట్రావెన్ కోర్ పాలకుడైన చితిర తిరునాళ్ మహారాజ్ ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని యోచించి… అందుకు పూర్తి స్థాయి వ్యవసాయ క్షేత్రంగా మార్చేందుకు కుట్టనాడ్ ను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు.
ఆ ప్రాంతంలో ప్రముఖ భూస్వామిగా ఉన్న మురిక్కన్… సరస్సు ప్రాంతాలను సాగుకు అనుకూలంగా మార్చొచ్చని భరోసానిచ్చాడు. పంపా, అచంకోవిల్, మణిమల వంటి నదుల నుంచి వచ్చే సారవంతమైన మట్టి మర్షి ప్రాంతాల్లో మేట మేస్తోందని… ప్రకృతి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగల్గితే తక్కువ పెట్టుబడిలో ఎక్కువ సాగు సాధ్యమని ట్రావెన్ కోర్ పాలకుడైన చితిర తిరునాళ్ మహారాజ్ కు సూచించారు మురిక్కన్. ఆయన ప్రతిపాదనపై నమ్మకముంచిన ట్రావెన్ కోర్ పాలకులు.. అందుకు ఒప్పుకోవడంతో చితిరపల్లి వ్యవసాయంలో ఒక విప్లవాత్మకమైన అడుగు వేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. చుట్టుపక్కల సమాజంలో ఆకలికేకలకు చెక్ పెట్టింది.
మురిక్కన్, ఆయన బృందం కలిసి మూడు ప్రధాన విభాగాలుగా 2 వేల 150 ఎకరాల భూమిని విడగొట్టడంతో పాటు, పునరుద్ధరించారు. ఆ మూడు విభాగాలకు ఒకదానికి చితిర, రెండోదానికి రాణి, మూడోదానికి మార్తాండం అనే పేర్లు పెట్టారు. 1940ల కాలంలో మొట్టమొదటి పంటను విజయవంతంగా కోశాక ఆ ప్రాంతమిక వ్యవసాయంలో ఒక గుణాత్మకమైన మార్పును చూసింది.

మురిక్కన్ బృందం సాధించిన విజయంతో కుట్టనాడ్ లో వరిసాగు విస్తృతమైంది. ప్రస్తుతం కుట్టనాడు ప్రాంతంలో 30 వేల హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమి ఉంది. స్వాతంత్ర్యం అనంతరం వ్యవసాయంలో సాధించిన ప్రగతికి.. కుట్టనాడును కేరళ అన్నపూర్ణగా పిల్చారు. ప్రభుత్వం రైస్ బౌల్ ఆఫ్ కేరళగా బిరుదిచ్చి సత్కరించింది.
వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాకుండా.. ఆ పనుల్లో నిమగ్నమైన రైతు కూలీలు, కార్మికుల సంక్షేమానికీ మురిక్కన్ ప్రాధాన్యతనిచ్చాడు. వారి తాగునీటి అవసరాల కోసం చితిరపల్లిలో 10 ఎకరాల్లో అక్కడో మంచి నీటి చెరువునే నిర్మించాడు. ఎలాంటి ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని కాలంలో మురిక్కన్ బృందం నాడు వ్యవసాయంలో చేసిన ప్రయోగాలు, సాధించిన విజయాలతో ఇప్పటికీ చితిరపల్లి, కుట్టనాడు ప్రాంతం సాగుకు పెట్టింది పేరుగా వార్తల్లో నిలుస్తున్నాయి. అంతేకాదు.. ఒక ఉప్పు నీటి చెరువు మధ్యలో ఏర్పాటు చేసిన బావి నీరు తీపిగా ఉండటం కూడా ఆ చితిరపల్లిలో మరో విశేషం. అందుకే, ఇప్పుడు చితిరపల్లి, కుట్టనాడ్ ప్రాంతమంతా అగ్రి టూరిజానికి కేరాఫ్ గా ఘనతకెక్కాయి.



