మసాలా వ్యాపారంలో ఘనాపాఠీ గులాటీ!

గసగసాలు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు, చాట్ మసాలా, సాంబార్ మసాలా ఇలాంటి మసాలా దినుసులేవీ లేకున్నా బిర్యానైనా, ఆకుకూరలైనా, నాన్ వెజ్ అయినా.. ఏ వంటకాలైనా రాణించవు. అంతెందుకు, అసలు తినేకంటే ముందే ఆ వాసనలే తిండిపై మమకారం పెంచాలి. అదిగో అలాంటి సుగంధ ద్రవ్యాల్లో ఓ బ్రాండ్ క్రియేట్ చేశాడు మనం చెప్పుకోబోతున్న ధరంపాల్ గులాటీ. మహిషియాన్ ది హట్టీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన ఎండీహెచ్.. మసాలా దినుసుల్లో రారాజు. అందుకే ఓసారి ఆ విజయగాధ చెప్పుకుందాం.

పొరుగుదేశమైన పాకిస్థాన్ వాసి భారతదేశంలో మన ముక్కుపుటాలదిరేలా మసాలాల ఉత్పత్తి ప్రారంభించాడు. అస్లీ మసాలే సచ్ సచ్.. ఎండీహెచ్ ఎండీహెచ్ అనే జింగిల్.. అందులో పెద్ద పెద్ద గుబురు గుబురు తెల్లటి మీసాలతో తలపాగా చుట్టుకున్న ఓ పెద్దమనిషి గురించి తెలియని గత తరం వారు ఉండరేమో బహుశా! ఆయనే మహాశయ్ ధరంపాల్ గులాటీ.

భారతదేశంలో మసాలా ఉత్పత్తుల్లో అగ్రస్థానం ఆక్రమించిన ఎండీహెచ్ ఆవిర్భావం వెనుక… దార్శనికుడు మహాశయ్ ధరంపాల్ గులాటీ. కానీ, ఆయన ఆ వ్యాపారంలోకి దిగేముందు అనుభవించిన పెయిన్ నుంచే ఎండీహెచ్ కు బీజం పడింది.

సియాల్ కోట్ లో అల్లర్లతో ఇండియా బాట!

ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న సియాల్ కోట్ లో 1923, మార్చ్ 27వ తేదీన జన్మించిన గులాటీ కుటుంబమంతా కూడా మిర్చి వ్యాపారం చేసుకునేది. మహాశియాన్ ది హట్టీ పేరుతోనూ.. అలాగే, డెగ్గీ మిర్చీ వాలే అంటూ అందరూ పిల్చుకునే వ్యాపార కుటుంబంలో పుట్టిన గులాటీ… పదేళ్ల వయస్సులోనే పాఠశాల మానేసిన ఓ స్కూల్ డ్రాపవుట్. వడ్రంగి పని చేశాడు. హార్డ్ వేర్ వ్యాపారం చేశాడు. బియ్యం వ్యాపారంలోనూ అనుభవముంది. కానీ, అవేవీ కలిసిరాకపోవడంతో.. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని మిర్చి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.

1947 సంవత్సరంలో చెలరేగిన అల్లర్లు, సంక్షోభంతో చాలా కుటుంబాలు సియాల్ కోట్ నుంచి ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టాయి. అలాంటి క్రమంలో తమ వ్యాపారాలు, ఆస్తులు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో శరణార్థుల్లా ఢిల్లీకి చేరింది గులాటీ కుటుంబం. భవిష్యత్తంతా అంధకారం. అయినా, బతికుంటే బలిసాకు తినొచ్చన్న చందంగా వలస వచ్చిన వారికి.. తమపై తమకున్న అచంచల విశ్వాసమే వారిని నిలబెట్టింది. అలా గులాటీ కుటుంబీకులు కొత్త జీవితాల్ని పునర్నిర్మించుకున్నారు.

ఎండీహెచ్ ఆవిర్భావానికి ముందు!

సియాల్ కోట్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాక గులాటీ వద్ద కేవలం 15 వందల రూపాయలు మాత్రమే జేబులో ఉన్నాయి. అందులో 650 రూపాయలు పెట్టి ఓ గుర్రపు బండి కొన్నాడు. ఆ టాంగాలో ఢిల్లీ నగరానికి వచ్చే పర్యాటకులను తిప్పేవాడు. అలా మెల్లిగా కొద్దికొద్దిగా డబ్బు పోగు చేసుకుని.. కరోల్ బాగ్ లో ఓ చిన్న దుకాణాన్ని అద్దెకు తీసుకున్నాడు. అక్కడ మళ్లీ మహాషియాన్ ది హట్టి పేరుతో తన మిర్చి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాడు.

గులాటీ కుటుంబం ఢిల్లీలో ఓ శిథిలమైన ఇంట్లో అద్దెకుండేది. కానీ, ఆత్మవిశ్వాసాన్నిగానీ, ధైర్యాన్నిగానీ కోల్పోలేదు. మెల్లిగా మిర్చి వ్యాపారాన్ని ఎలా వృద్ధిలోకి తీసుకురావచ్చో ఫోకస్ చేశాడు.

గులాటీ దార్శనికత.. సుగంధ ద్రవ్యాల సామ్రాజ్య నిర్మాణం!

అప్పటివరకూ స్పైస్ పేరిట మిర్చి వ్యాపారానికే పరిమితమైన గులాటీ… ఆ తర్వాత ఇతర మసాలా దినుసుల ఉత్పత్తినీ ప్రారంభించాడు. అప్పటివరకూ ఢిల్లీకే పరిమితమైన గులాటీ వ్యాపారం మెల్లిమెల్లిగా విస్తరించి.. గల్లీగల్లీకీ చేరింది. అలా భారతదేశమంతటా మసాలాలకు ఎండీహెచ్ ఓ బ్రాండ్ అయి కూర్చుంది. దాంతో వంద దేశాలకు.. 60కి పైగా మసాలా దినుసుల ఎగుమతులు మొదలెట్టాడు. మెల్లిమెల్లిగా పుంజుకుంటూ వ్యాపారం పెరిగి పెద్దదైంది. ప్రస్తుతం భారతదేశ మసాలా దినుసుల వ్యాపారంలో ఎండీహెచ్ మార్కెట్ వాటా ఏకంగా 12 శాతాన్ని ఆక్రమించిందంటే.. గులాటీ దార్శనికతెలాంటిదో మళ్లీ ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రస్తుతం ఎండీహెచ్ ఎవరెస్ట్ స్పైసెస్ వ్యాపారం తర్వాత రెండో స్థానంలో ఉంది.

చాట్ మసాలా నుంచి చనా మసాలా వరకూ ఎండీహెచ్.. మసాలాలకు ఓ కేరాఫ్. నాణ్యత ప్రమాణాల్లోనూ రాజీలేని తత్వంతో ధరంపాల్ గులాటీ వ్యాపారం దేశంలోని ప్రతీ వంటశాలకూ చేరుకుని ట్రెండ్ సెట్టరైంది.

వ్యాపారే కాదు.. దాతృత్వంలోనూ గులాటీ ఓ హీరో!

భారత్ కు కట్టుబట్టలతో ఓ శరణార్థిగా వచ్చిన గులాటీ… ఎక్కడైతే తాను సంపాదించుకుని తిరిగి నిలబడ్డాడో ఆ ప్రాంతానికి తాను సంపాదించినదాంట్లో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనుకున్నాడు. ఆ క్రమంలో ఎండీహెచ్ ఇంటర్నేషనల్ స్కూల్, మహాశయ్ ధరంపాల్ విద్యామందిర్, 200 పడకల ఆసుపత్రి వంటివి స్థాపించి ఎందరికో విద్యా, వైద్యమందించాడు. పేదలకు పెద్ద రోగాలు వచ్చినా ఉచిత వైద్యమందించేందుకు మహాశయ్ చునీలాల్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించాడు. మురికివాడల పిల్లలకు విద్యనందించడంతో పాటు.. మోబైల్ హెల్త్ కేర్ యూనిట్స్ తో సామాజిక కార్యక్రమాలు చేపట్టి దేశ రాజధాని ఢిల్లీలో గులాటీ తనదైన గుర్తింపు పొందాడు.

అంతెందుకు కోవిడ్-19 సమయంలోనూ ఢిల్లీ ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్దఎత్తున విరాళమిచ్చిన గులాటీ.. కోవిడ్ పై పోరాటంలో ముందున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు 7 వేల 500 పీపీఈ కిట్స్ ను విరాళంగా అందించాడు. అలా సమాజం పట్ల ఒక సంఘజీవిగా తన అచంచల బాధ్యత, నిబద్ధతను నిరూపించుకున్నవాడు గులాటీ.

గులాటీ విజయాలు, గుర్తింపు!

భారతదేశ ఆహార పరిశ్రమలో ధరంపాల్ గులాటీ చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 2019లో ఆయనకు మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ ను ఇచ్చి సత్కరించింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగంలో 94 ఏళ్ల వయస్సులోనూ అత్యధిక పారితోషికం తీసుకున్న సీఈవోగా గులాటీ పేరు ఇప్పటికీ రికార్డే. 90 ఏళ్లు దాటాక కూడా యువకుడిలా పనిచేసిన గులాటీకి వయస్సొక సంఖ్య మాత్రమే. గోద్రేజ్ కన్స్యూమర్స్ సీఈవో ఆది గోద్రేజ్, హిందుస్థాన్ యూనీలీవర్ సీఈవో సంజీవ్ మెహతా వంటి పారిశ్రామిక ప్రముఖులను మించి పని చేస్తూ… పని చేయాలన్న సంకల్పానికి రిటైర్మెంట్ లేదని నిరూపించాడు గులాటీ.

కోవిడ్ సమయంలోనే 2020, డిసెంబర్ 3వ తేదీన తన 97 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు ధరంపాల్ గులాటీ. ఆయన వెళ్లిపోవచ్చుగాక.. కానీ, ఎండీహెచ్ తో తన శాశ్వత సంతకాన్ని చేసి వెళ్లిపోయాడు. ఒక శరణార్థి దృఢసంకల్పంతో అంచెలంచెలుగా ఎదిగి స్పైస్ కింగ్ గా జెండా పాతిన గులాటీ కథ ఎందరో పారిశ్రామికవేత్తలకు ఓ పాఠం.

గులాటీ కథలో వ్యాపార వ్యూహాలే కాదు… తెలియని అనిశ్చితి నుంచి నిశ్చయంగా, నిర్భయంగా పైకి రావడంలో ఆయన చూపిన పట్టుదలతో పాటు.. ప్రతికూలతలను తనకనుకూలంగా మల్చుకున్న సామర్థ్యం గమనించాల్సినవి. భారతదేశ సుగంధ ద్రవ్యాల పరిశ్రమంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఇంటింటికీ చేరిన గులాటీ.. ప్రతీ వంటింట్లో ఎండీహెచ్ ఇంగువలోనో, అల్లంవెల్లుల్లి పేస్టులోనో ఎక్కడో ఓచోట సువాసనై గుబాళిస్తూనే ఉంటాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles