మొచ్చీర్ బజార్ లో మంచి చేప ఎవరు కాబోతున్నారు..?

Vamsy Krishna.. ✍🏻

—————————————

మొచ్చీర్ బజార్ లో మంచి చేప

మొచ్చీర్ బజార్ లో మంచి చేప ఏదో మే నాలుగవ తేదీన తేలిపోతుంది. మచ్చర్ బజార్ లో మంచి చేప తేగలిగిన వాడే నిజమైన బెంగాలీ అనే నానుడి వుంది. కనుక బెంగాలీలు మంచి చేపను ఎన్నుకుంటారనే ఆశిద్దాం. అయితే ఆ మంచి చేప ఏది? భారతీయ జనతా పార్టీనా? లేక తృణమూల్ కాంగ్రెస్సా? ఈ ప్రశ్న మే నాలుగవతేదీ దాకా ఉత్కంఠ కలిగిస్తూనే ఉంటుంది.ఫలితాలు వచ్చేంత వరకూ ఎవరి ఊహాగానాలు వాళ్ళు చేస్తూనే వుంటారు.అది సహజం

బెంగాలీలు అంత తొందరగా తమ విధేయతలు మార్చుకోరు. కాంగ్రెస్ స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి 1947 నుండి 1977 వరకు (మధ్యలో 1967-71 మధ్య స్వల్పకాలం సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వం ఉంది).దాదాపు 28 సంవత్సరాలు తన పతాకాన్ని ఎగురవేసింది. సిపిఐ(ఎం) నేతృత్వంలోని వామ పక్షాల కూటమి వరుసగా 34 సంవత్సరాలు 1977 నుండి 2011 వరకు అధికారంలో ఉంది. ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక రికార్డు.మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గత 13 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోంది.పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 1977లో వచ్చిన మార్పు అత్యంత కీలకమైనది. అప్పటివరకు ఉన్న కాంగ్రెస్ ప్రభావాన్ని తుడిచిపెట్టి కమ్యూనిస్టులు మూడు దశాబ్దాలకు పైగా పాతుకుపోయారు. ఆ తర్వాత 2011లో “పరిబోర్తన్” (మార్పు) నినాదంతో తృణమూల్ కాంగ్రెస్ ఆ సుదీర్ఘ పాలనకు ముగింపు పలికింది.

ఇప్పుడు బెంగాలీలు “పరిబోర్తన్” కావాలి అనుకుని భారతీయ జనతా పార్టీ కి పట్టం కడతారా? తమ సహజమైన స్వభావం తో మళ్ళీ తృణమూల్ కే జై అంటారా? అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న.

దశాబ్ద కాలంగా పాతుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టాలని భారతీయ జనతా పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది.. మరోవైపు, తన ‘మా-మాటి-మానుష్’ నినాదంతో బెంగాలీ అస్తిత్వాన్ని కాపాడుకుంటానని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మే నాలుగవ తేదీన వెలువడే ఫలితాలు కేవలం ఒక పార్టీ గెలుపునో, ఓటమినో నిర్ధారించవు; అవి బెంగాల్ సామాజిక, రాజకీయ పరిణామ క్రమంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి

పోరు ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. ఒకప్పుడు బెంగాల్‌ను ఏలిన వామపక్షాలు, కాంగ్రెస్ ఈ హోరాహోరీ పోరులో తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రధాన స్రవంతిలో మాత్రం కాషాయ దళం, జోడు పూల పార్టీల మధ్యే అసలైన సమరం కనిపిస్తోంది.

బీజేపీ తన ప్రచారంలో ప్రధానంగా అవినీతి ఆరోపణలు, నియామకాల్లో అక్రమాలు సందేశ్‌ఖాలీ వంటి మహిళా భద్రతకు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్‌లోని సామాన్యులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని, ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ వస్తేనే అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ నుంచి అమిత్ షా వరకు ప్రతి ఒక్కరూ గొంతు చించుకున్నారు. హిందూ ఓట్ల ధ్రువీకరణ లక్ష్యంగా రామమందిర నిర్మాణం, సిఏఏ (CAA) అమలు వంటి అంశాలను వారు ప్రధాన అస్త్రాలుగా చేసుకున్నారు.

ప్రతిగా మమతా బెనర్జీ తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. బెంగాల్ సంస్కృతిని, భాషను గౌరవించని ‘బయటి వ్యక్తులు’ రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని, తనను తాను బెంగాల్ ఆడబిడ్డగా (బెంగాల్ కి మేయే) అభివర్ణించుకుంటూ ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలించారు. ‘లక్ష్మీర్ భండార్’ వంటి సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లలో ఆమెకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఉచిత రేషన్, ఆరోగ్య సాథీ వంటి పథకాలు క్షేత్రస్థాయిలో తృణమూల్ పట్ల సానుకూలతను పెంచాయని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. మత ప్రాతిపదికన బీజేపీ ఓట్లను చీల్చాలని చూస్తోందని, తృణమూల్ మాత్రమే లౌకికవాదాన్ని కాపాడగలదని మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ప్రచారం లో బెంగాల్ భూమి ఒక విలక్షణమైన వాగ్యుద్ధానికి వేదికైంది. ప్రధాని మోదీ తనదైన శైలిలో ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ “ప్యాజ్ ఖాతా హు.. దిమాగ్ నహీ”:(నేను ఉల్లిపాయలు తింటాను కానీ, ప్రజల మెదడును (దిమాగ్) తినను) అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ప్రత్యర్థులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వారి ఆలోచనలతో ఆడుకుంటున్నారని, తాను మాత్రం క్షేత్రస్థాయిలో పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం ప్రధానివ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. అయితే దీనికి దీటుగా స్పందించిన మమతా బెనర్జీ, ప్రధాని కోల్‌కతా పర్యటనలో హుగ్లీ నదిలో బోటు షికారు చేయడాన్ని ఎద్దేవా చేస్తూ, గంగమ్మ తల్లి పుణ్యమా అని ఇక్కడి నీళ్లు శుభ్రంగా ఉన్నాయి కాబట్టి ఆయన షికారు చేయగలిగారని, అదే ధైర్యం ఉంటే ఢిల్లీలోని కలుషితమైన యమునా నదిలో బోటు ప్రయాణం చేయగలరా అని సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని పర్యావరణాన్ని కూడా కాపాడలేకపోతోందని, బెంగాల్ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు వారికి లేదని చెప్పడమే దీదీ వ్యూహం.

మాటల యుద్ధ హింస నేపథ్యం లో , బెంగాల్‌లో ఎన్నికల హింస మరోసారి కోరలు చాచింది. పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు చెదురుముదురు గా జరిగాయి. వెంటనే హోంమంత్రి అమిత్ షా అవకాశాన్ని అందుకుని అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా మరో రెండు నెలల పాటు కేంద్ర భద్రతా దళాలు బెంగాల్‌లోనే ఉంటాయని

సాధారణంగా ఫలితాలు వెలువడిన తర్వాత బెంగాల్‌లో రాజకీయ కక్ష సాధింపులు, హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే, ఓటర్లకు మరియు ప్రతిపక్ష కార్యకర్తలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

మొచ్చీర్ బజార్‌లో మంచి చేపను ఎంచుకోవడం ఎంత కష్టమో, ఈ హింసాత్మక రాజకీయ వాతావరణంలో బెంగాలీ ఓటరు తన మనసులోని మాటను బయటపెట్టడం కూడా అంతే కష్టం.

చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిజ్ వంటి ప్రముఖ సంస్థలు ఈసారి భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని అంచనా వేస్తున్నాయి. ఈ సంస్థల ప్రకారం బీజేపీ 146 నుండి 161 స్థానాల వరకు గెలుచుకుని, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 148 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను సులభంగా అందుకునే అవకాశం ఉంది. మరోవైపు పి-మార్క్ వంటి సంస్థలు బీజేపీకి 150 నుండి 175 స్థానాల వరకు భారీ మెజారిటీని కట్టబెట్టాయి. ఒకవేళ ఇవే అంచనాలు నిజమైతే, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ సుదీర్ఘ పాలనకు తెరపడి కాషాయ జెండా ఎగరడం ఖాయం

పీపుల్స్ పల్స్ జన్మత్ పోల్స్ వంటి సంస్థలు తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ తన పట్టును నిరూపించుకుంటుందని, సుమారు 177 నుండి 187 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. ముఖ్యంగా దక్షిణ బెంగాల్ కోల్‌కతా పరిసరాల్లో తృణమూల్ బలంగా ఉందని, మహిళా ఓటర్ల మద్దతు ఆ పార్టీని గట్టెక్కిస్తుందని ఆ సర్వేలు అంటున్నాయి

జెవిసి వంటి సంస్థలు మాత్రం ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు (నెక్ అండ్ నెక్) ఉంటుందని, ఒక హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని తెలిపాయి. 90 శాతానికి పైగా నమోదైన భారీ ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. 2021లో కూడా ఎగ్జిట్ పోల్స్ హోరాహోరీ పోరు అన్నాక దీదీ క్లీన్ స్వీప్ చేసిన చరిత్ర ఉండటంతో, ఈసారి కూడా మే నాలుగో తేదీన అసలు ఫలితం అలాగే ఉంటుందా అంటే ఏమో చెప్పలేము

మొచ్చీర్ బజార్‌లో బెంగాలీలు ఏ చేపను ఎంచుకుంటారనేది వారి జీవనశైలిలోనే దాగి ఉంటుంది. బీజేపీ చెప్పే ‘వికాస్’ (అభివృద్ధి) వైపు మొగ్గు చూపుతారా లేదా దీదీ అందించే ‘సురక్ష’ (రక్షణ) వైపు నిలుస్తారా? ఓటరు నాడి అంతుచిక్కనిది. ప్రచారంలో కనిపించే సందడి ఓట్లుగా మారుతుందా లేదా నిశ్శబ్దంగా ఉండే మెజారిటీ ఓటర్లు తమ తీర్పుతో అందరినీ ఆశ్చర్యపరుస్తారా? ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఆ నిర్ణీత గడువు వరకు ఆగాల్సిందే. పశ్చిమ బెంగాల్ చరిత్రలో మే నాలుగు ఒక మలుపు తిప్పే రోజుగా నిలిచిపోనుంది. అక్కడ గెలిచేది ఎవరైనా, అది బెంగాలీ ప్రజల విజ్ఞతకు, వారి రాజకీయ పరిణితికి నిదర్శనంగా నిలుస్తుంది.అంతవరకూ ఈ రాజకీయ చదరంగం ఉత్కంఠను రేకెత్తిస్తూనే ఉంటుంది.నా చిన్నపుడు What Bengal Thinks today India will think tomarrow అనే వారు. బెంగాలీలు ఆ ప్రత్యేకతను నిలబెట్టుకుంటారా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles