నాడు స్టాలిన్ ను నడిపించిన పీకే వైపు.. నేడు విజయ్ చూపు!

వనరులెక్కడుంటే అక్కడికెళ్లడం.. ఆ వనురులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వివేకవంతుడి లక్షణం. అలాంటి వివేకవంతుడే ప్రశాంత్ కిషోర్. ఇప్పటికే వ్యూహకర్తగా అటు జాతీయ రాజకీయాల్లోనూ, ఇంకోవైపు ప్రాంతీయ రాజకీయ పార్టీలతోనూ జట్టు కట్టి, దేశమంతా చుట్టుచుట్టిన పీకే.. ఇప్పుడు తమిళనటుడు.. తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ పంచెన చేరాడు. రాబోయే ఎన్నికల్లో విజయ్ కి బాసటగా ఉంటానని భేటీ అయ్యాడు.

వ్యూహకర్తగా పరిచయమై.. జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడిగా కూడా వార్తల్లోకెక్కిన ప్రశాంత్ కిషోర్ రాబోయే తమిళనాడు 2026 ఎన్నికలకు సంబంధించి విజయ్ కి మార్గదర్శిగా ఉండేందుకు కలవడం తమిళ రాజకీయాల్లో ఇప్పుడో చర్చ.

విశేషమేంటంటే ఎటు బలంగా ఉందో చూసుకుని అటువైపుండటం వివేకవంతుడి లక్షణమంటారు. కానీ, కొన్నిసార్లు బలమనుకున్నది జస్ట్ వాపనీ తేలిపోవచ్చు. తమిళ సినిమాస్టార్ గా రజనీకాంత్ స్థాయిలో విజయ్ కూడా మాస్ ఆదరణ ఉన్న నటుడు కావడం.. కొత్తగా టీవీకే పార్టీని ఏర్పాటు చేసినప్పుడు తన నినాదాలు, తన ఎజెండా కాస్త ఆకట్టుకునేరీతిలో ఉండటం, జనం కూడా అదేస్థాయిలో తన మొట్టమొదిటి పార్టీ సభకు రావడంతో విజయ్ పై ఇప్పుడు తమిళనాట ఒకింత అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలో పీకే.. ఈసారి విజయ్ వర్గానికి మద్దతుగా వ్యూహకర్తగా మారడం విభిన్నరకాల చర్చలతో పాటు, వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎందుకంటే గత 2021 ఎన్నికల్లో ఇదే ప్రశాంత్ కిషోర్ ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వైపుండి వ్యూహకర్తగా తన అనుభవాలను పంచుకున్నాడు. ఆ పార్టీ విజయం సాధించడం.. స్ట్రాటజిస్ట్ గా పీకే సాధించిన విజయాల ఖాతాల్లోను వచ్చి చేరేదే. పదేళ్లపాటు అన్నాడీఎంకే పాలన తర్వాత వచ్చిన అవకాశాన్ని డీఎంకే అనుకూలంగా మార్చుకుని తమిళనాట గద్దెనెక్కే విషయంలో పీకే వ్యూహాలు పనిచేసి ఉండొచ్చు. లేకపోతే అన్నాడీఎంకేకు నాయకత్వ లేమి.. భిన్నంగా సాగే ద్రవిడ రాజకీయాల్లో బీజేపీ పొడ నచ్చక ఆ పార్టీ చెప్పుచేతల్లోకి అన్నాడీఎంకే వెళ్లిపోయిందనే భావనా వంటివన్నీ కలిసి డీఎంకేను తమిళ ప్రజలు గద్దనెక్కించవచ్చు. కానీ, వ్యూహకర్తగా ఉన్నందుకు ఆ విజయం పీకే ఖాతాకూ ఓ మరో బోనస్.

చెన్నైలో విజయ్ తో పీకే మూడు గంటల భేటీలో జాతీయ రాజకీయాలతో పాటు.. తమిళ రాష్ట్ర రాజకీయాలపైనా చర్చించడం ఖాయం. పైగా గత ఎన్నికల్లో డీఎంకే విజయంలో పీకే పాత్ర ఉందని బలంగా నమ్మడం, పీకే వ్యూహాలతో పలు పార్టీలు జాతీయ, ప్రాంతీయ విజయాలు సాధించిన ట్రాక్ రికార్డ్స్, తాను కూడా రాజకీయాలకు కొత్త కావడం వంటి కారణాలతోనే విజయ్ కూడా ఇప్పుడు పీకే మార్గదర్శకత్వంలో నడవాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. అయితే, ఎలాంటి పరస్పర ఒప్పందాల్లేకుండా… కేవలం ఫార్మల్ అడ్వైజర్ గా మాత్రమే పీకే ఉండబోతున్నారని.. అదే ఇరుపక్షాల అభిప్రాయమన్నది జరుగుతున్న మరో ప్రచారం.

ఇప్పుడు విజయ్ ఫోకస్ అంతా డీఎంకే, బీజేపీనే. అన్నాడీఎంకే ఇప్పుడ జస్ట్ బీజేపీకి ఓ ట్రంపెంట్ లాగా మారిపోయింది కాబట్టి.. ఇప్పుడా పార్టీ ప్రత్యర్థనే ఊసేలేకుండా పోయింది. పైగా బలమైన నాయత్వం లేకపోవడం మరో పెద్ద మైనస్. కాబట్టి డీఎంకే, బీజేపీ ఈ రెండింటినీ ఎదుర్కొనే క్రమంలోనే వ్యూహకర్తగా అనుభవజ్ఞుడిని కూడా దగ్గర పెట్టుకుంటే.. తన సినిమాల్లో తనకున్న మాస్ ఇమేజ్ ను రాజకీయంగా తన పార్టీకనుకూలంగా మల్చుకుని తమిళ రాజకీయాలను శాసించొచ్చనే ఒక తపనతో విజయ్ వేస్తున్న అడుగులుగా కూడా ఈ భేటీని చూడొచ్చు.

ప్రశాంత్ కిషోర్ ఓవైపు జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడిగా బీహార్ రాజకీయాలపై దృష్టి సారిస్తూనే… మరోవైపు వ్యూహకర్తగా కూడా విజయ్ వంటివారెవరైనా సంప్రదిస్తే సై అంటున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి సలహాదారుగా ఉన్న పీకే.. ఇప్పుడు విజయ్ పార్టీని గెలిపించేందుకు పనిని ప్రారంభించారు. ఐప్యాక్ సృష్టికర్తగా భారత రాజకీయాల్లో వ్యూహకర్తలకూ ఓ స్థానాన్ని కల్పించిన పీకే.. ఇప్పుడు విజయ్ పార్టీ గెలుపు కోసం తాను పర్యవేక్షించడంతో పాటు.. జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జునను ఎన్నికల ప్రచార నిర్వహణ కోసం.. అలాగే, అరోకియసమిని విజయ్ ప్రణాళికల్లో వ్యక్తిగత వ్యూహకర్తగా నియమించారు.

ఆధర్ అర్జున వాయిస్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు. 2021 తమిళనాడు ఎన్నికల సమయంలోనూ డీఎంకేకు పీకే పనిచేసినప్పుడు కూడా ఈ ఆధర్ అర్జునే పీకే వెంట నడిచాడు. అయితే, విజయ్ పార్టీని ప్రకటించేకంటే ముందే పీకేతో చర్చలు జరిపాడు. కానీ, కొంతకాలంపాటు తనపార్టీ స్థాపనను వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు సరైన సమయం వచ్చింది. కాబట్టి ఎలాంటి కూటమిని ఏర్పాటు చేస్తే రాబోయే ఎన్నికల్లో డీఎంకే, బీజేపీలను ఎదుర్కోవచ్చు.. ఎలా టీవీకేను గద్దెనెక్కించవచ్చన్న వ్యూహాల్లో ఇప్పుడు విజయ్ అండ్ పీకే అండ్ కో తలమునకలైంది.

ముఖ్యంగా విజయ్ తన తమిళ వెట్రి కళగం పార్టీ స్థాపన సభాస్థలిలో సాంఘిక, సామాజిక ఉద్యమకారుడు పెరియార్ ఈ.వి. రామస్వామి, భారత రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్. అంబేద్కర్, దివంగత తమిళ ముఖ్యమంత్రి కే. కామరాజ్ తో పాటు.. మహిళా స్వాతంత్ర సమరయోధులు రాణివేలు నాచియార్, అంజలై అమ్మార్ కు సంబంధించిన భారీ కటౌట్స్ ను ఏర్పాటు చేసి తన పార్టీ ఎజెండా ఏంటన్నది సింబాలిక్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ సభలోనూ వారందరి గురించీ ప్రస్తావించాడు. మొత్తంగా తన 3 దశాబ్దాల సీనీరంగ జీవితం తర్వాత.. ఇప్పుడు పొల్టికల్ థ్రిల్లర్ తో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య తెరపైన తన విశ్వరూపాన్ని చూపించేందుకు విజయ్ వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అయితే, అంతకుముందే జన నాయగన్ పేరుతో ఓ పొల్టికల్ రిలేటెడ్ మూవీతో ప్రజల్లోకి వెళ్లి.. ఆ ఇంపాక్ట్ తో తమిళనాట రాజకీయాల్లో మరింత ప్రభావం చూపేలా ఒక వ్యూహంతో విజయ్ రాజకీయ అడుగుల సడి వినిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles