అల్విదా ఛాంపియన్!
…………………………………….
Aranya Krishna… ✍️
ఆస్ట్రేలియా సిరీస్ తరువాత టెస్ట్ క్రికెట్ కి అశ్విన్ వీడ్కోలు పలుకుతాడని ఏదో మూల సందేహం వున్నప్పటికీ సిరీస్ మధ్యలోనే ఆ పని చేస్తాడని అసలు ఊహించలేదు.
రవిచంద్రన్ అశ్విన్! ఇతని గురించి ఎంతమంది ఎన్ని వర్ణనలైనా చేయొచ్చు. స్పిన్ మాంత్రికుడని, క్రికెట్ లెజండ్ అని, క్రికెట్ సైంటిస్ట్ అని, ఎన్నో ప్రపంచ రికార్డుల్ని తన గుప్పిట పట్తిన ఛాంపియన్ అని ఎన్నో చెప్పొచ్చు. కానీ నా దృష్టిలో అతను భారతదేశపు గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్! ఓ క్రికెట్ క్రీడాకారుడి ఖాతాలో ఓ పది “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డులు వుండటమే కష్టం. అలాంటిది అశ్విన్ కి పదకొండు “ప్లేయర్ ఆఫ్ ద సిరీస్” అవార్డులున్నాయి. ఈ ఒక్క గణాంకం చాలు అశ్విన్ ఎంత గొప్ప మ్యాచ్ విన్నరో అర్ధమవుతుంది.

క్రికెట్ లో 2011 నుండి భారత్ ని అగ్రపథాన నిలపడంలో అశ్విన్ పాత్ర కంటే గొప్ప పాత్రని పోషించిన క్రికెటర్ మరెవ్వరూ లేరు. అశ్విన్, జడేజా కాంబినేషన్ వచ్చినప్పటి నుండి భారత్ మీద ఏ విదేశీ జట్టుకైనా 500 పైన పరుగులు చేయాలంటే దాదాపు అసాధ్యం. ఇంత గొప్ప బౌలింగ్ జోడీ ఆడటం భారత్ క్రికెట్ లో అరుదైన, అసాధారణ సుదీర్ఘ ఘట్టం. అశ్విన్ దగ్గరకు వస్తే 106 టెస్ట్ మ్యాచెస్ లో 537 వికెట్లంటే అదో అసమాన్య విషయం. వర్తమాన ప్రపంచ క్రికెట్లో ఇంతటి ఘనత ఆధించిన బౌలర్ మరెవ్వరూ లేరు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే గొప్ప బౌలర్లు, ఆల్ రౌండర్ల సరసన ఓ లెజండ్ గా నిలిచిపోగలిగిన వాడు మన అశ్విన్! అశ్విన్ ముందు తరంలో అనిల్ కుంబ్లే, షేన్ వార్న్ వున్నప్పటికీ వారి బౌలింగ్ యావరేజ్ అశ్విన్ కంటే తక్కువ. ఒక్క ముత్తయ్య మురళీధరన్ మాత్రమే అశ్విన్ కంటే ముందుంటాడు. ఐతే మురళీధరన్, వార్న్, కుంబ్లే అశ్విన్ లా ఆల్ రౌండర్లు కాదు. అశ్విన్ టెస్ట్ క్రికెట్లో 6 సెంచురీలు, 14 ఫిఫ్టీలతో 3500 పరుగులు చేశాడు. ఈ విషయంలో ఆ ముగ్గురూ అశ్విన్ చుట్టుపక్కల లేరు. బాటింగ్లో కూడా అశ్విన్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచెస్ ని సేవ్ చేసి, గెలిపించిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో హనుమ విహారితో కలిసి అసాధారణ డిఫెన్స్ తో టెస్టుని రక్షించాడు ఓ సారి. మరోసారి బంగ్లాదేశ్ లో అటాకింగ్ బ్యాటింగ్ తో శ్రేయాస్ అయ్యర్ ను అవతలి ఎండ్ లో అలా చూస్తుండగా మ్యాచ్ ని గెలిపించాడు. ఇంక పాకిస్తాన్ మీద 2022 టీ20 ప్రపంచ కప్ లో గొప్ప సమయస్ఫూర్తితో కోహ్లి అవతలి ఎండ్ లో వుండగా చివరి రెండు బంతుల్ని ఆడిన తీరు…ఇవన్నీ క్రికెట్ అభిమానులు మర్చిపోరు. అశ్విన్ బాటింగ్ పక్కన పెట్టినా బౌలింగ్ కి సంబంధించినంత వరకు టెస్ట్ క్రికెట్లో 37 సార్లు 5 వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు తీసిన అశ్విన్ ప్రదర్శనని భారత్ లో ఎవరైనా అధిగమించాలంటే ఇంకా కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు. ఒకే టెస్టులో ఐదు వికెట్లు, సెంచురీ నాలుగు సార్లు సాధించిన ఘనత అశ్విన్ ది. కేవలం బోథం మాత్రమే ఐదు సార్లు ఈ ఫీట్ సాధించాడు. అందుకే అశ్విన్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోగల ప్రపంచస్థాయి ఆల్ రౌండర్ అని చెప్పగలిగేది. 2016లో అనుకుంటా అశ్విన్ ఐసిసి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచాడు. అందుకే భారతదేశానికి సంబంధించినంత వరకు అశ్విన్ ని గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్ అనేది!
ఇంత సుదీర్ఘ అనుభవం వున్నప్పటికీ, ఒక గొప్ప వ్యూహకర్త, క్రికెటింగ్ బ్రెయిన్ అనే పేరు వున్నప్పటికీ అశ్విన్ కెప్టెన్ కాలేకపోయాడు. కారణాలు రాజకీయాలు తప్ప వేరేవి వుంటాయా? కనీసం వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. అందుకే కనీసం ఆపద్ధర్మంగా ఐనా అజింక్య రహానె, బుమ్రాలు కెప్టెన్లు కాగలిగారు కానీ అశ్విన్ కాలేకపోయాడు. ఇది బిసిసీఐలో నార్త్ లాబీయింగ్ ప్రభావమే అనుకోవాల్సి వుంటుంది. అశ్విన్ కి ఒక కమర్షియల్ ఫేస్ లేదు. అతను ఓ సృజనాత్మక వ్యక్తి. మంచి సెన్సాఫ్ హ్యూమర్ తో, విశ్లేషణాత్మక సామర్ధ్యంతో తన యూట్యూబ్ చానెల్స్ నడుపుతుంటాడే కానీ కోహ్లిలా కమర్షియల్ ఫేస్ లేదు. అతన్ని బ్యాక్ చేయడానికి ఎలాంటి లాబీయింగ్ లేదు. ఒక్క సిరీస్ లో తన స్థాయిలో ఆడలేకపోయే సరికి అతన్ని పక్కన పెట్టడంతో గాయపడి వుంటాడు. అవమానంగా భావించి వుంటాడు. తన అవసరం లేనప్పుడు జట్టులో వుండటం అనవసరమని తనతో అన్నాడని కెప్టెన్ రోహిత్ చెప్పాడు. నాలుగైదేళ్ల నుండి దారుణమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నా కోహ్లి, రోహిత్ స్థానాలకి ఢోకా లేదు ఇన్నాళ్లపాటూ. ఈ వాస్తవం క్రికెట్ రాజకీయాలకు అద్దం పడుతుంది. ఎప్పుడో ఓ సారి అశ్విన్ ఇదంతా బైటపెట్టొచ్చేమో ఓ పుస్తక రూపంలో.
అల్విదా ఛాంపియన్!
నోట్: ఇంత వివరంగా రాస్తున్నానంటే నాకేదో క్రికెట్ పిచ్చి అనుకునేరు! రాజకీయాలు, సంస్కృతి, సామాజిక పరిణామాలు, సినిమాలు, సాహిత్యం ఎలా ఫాలో అవుతానో క్రీడలూ అంతే నాకు. అన్ని క్రీడలూ ఫాలో అవుతుంటాను. సాధారణంగా లైవ్ చూడను. ఫైనల్స్ చూస్తుంటాను. అప్డేట్ మాత్రం అవుతుంటాను.


