ఒడిశాలో బీజేపీ హరేకృష్ణ నినాదం!

బీజేపీ మూడోసారి కూడా కేంద్రంలో గద్దెనెక్కాక.. తనకనుకూలంగా మారుతున్న రాష్ట్రాలపై మరింత పట్టు బిగించాలని చూస్తోంది. ముఖ్యంగా జాతీయస్థాయిలో తనకు పోటీగా నిలుస్తుందనుకునే కాంగ్రెస్ ను, ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొని అధికారంలోకి రావడమే కాదు.. పాతుకుపోవాలనే సంకల్పాన్ని తీసుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఒడిశా ఎపిసోడ్ అలాంటి చర్చకు తెరలేపింది.

ఒడిశాలో గత ఎన్నికల్లో బీజేపీ గద్దెనెక్కింది సరేసరి. కానీ, ఈ ఒక్కసారి ఓటమి పాలైనంత మాత్రం బిజూ జనతాదళ్ ను తక్కువ అంచనా వేసే పరిస్థితేం ఉండదు. నవీన్ పట్నాయక్ కు ముదిమితనం వచ్చినంత మాత్రాన ఇంకెవరో రాకపోరు. ఎవరు కాస్త గట్టి సంకల్పంతో వచ్చినా బలంగా నిల్చుకోగల్గే పునాదులున్న ప్రాంతీయపార్టీ బీజేడి. సో, ఈ క్రమంలో దానికి ఆ ఛాన్స్ ఇవ్వొందంటే.. అలాగే, జాతీయ స్థాయిలోనూ, పలు రాష్ట్రాల్లోనూ తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ కూ ఛాన్స్ ఇవ్వొద్దంటే ఏం చేయాలనే దానిపై బీజేపీ దృష్టి సారించినట్టు కనిపిస్తోంది.

అందులో భాగంగా ఒడిశా వాస్తుశిల్పిగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి హరేకృష్ణ మహతాబ్ 125 జయంతి వేడుకలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఒడిశా ఐకాన్ గా ఉన్న హరేకృష్ణ మహతాబ్ వంటివారిని ఎత్తుకుని తమ పార్టీ తరపున క్లెయిమ్ చేసుకుంటే.. అక్కడ ఇప్పటికే అధికారం కట్టబెట్టిన ప్రజాదరణను ఇంకా పెంచుకోవడంతో పాటు.. మరింత శాశ్వతం చేసుకోవచ్చన్న ఉద్ధేశమూ ఇందులో లేకపోలేదన్నది ఇప్పుుడు జరుగుతున్న చర్చ.

ఒడిశా అస్తిత్వానికి, హరేకృష్ణ మహతాబ్ జయంతి వేడుకలతో ముడిపెట్టి.. సెంటిమెంటల్ గా బీజేపీని ఒడిశాలో మరింత స్ట్రాంగ్ గా మార్చడమే ఈ వ్యూహంలో భాగమనేవారూ లేకపోలేదు. అదే సమయంలో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరను వ్యతిరేకించి జైలుపాలైన హరేకృష్ణ మహతాబ్ కథను మరోసారి ముందరికి తెస్తున్నారు. మహతాబ్ ను ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో పాటు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా గొప్ప జాతీయవాదిగా కొనియాడుతూ.. ఆయన వారసత్వాన్ని బీజేపీ కొనసాగిస్తుందనే సంకేతాలిస్తున్నారు.

అసలెవరు హరేకృష్ణ మహతాబ్..?

మహతాబ్ స్వాతంత్ర సమరయోధుడు, మంచి రచయిత, ఆధునిక ఒడిశా వాస్తుశిల్పుల్లో ఒకడిగా ఐకానిక్ పేరు గలవాడు. 1899, నవంబర్ 21న భద్రక్ (అప్పటి బాలాసోర్) జిల్లా అగడపరలో కృష్ణచరణ్ దాస్, తోఫా బీబీ దంపతులకు జన్మించాడు. కానీ, అగర్పద మహారాజైన తన తాత జగన్నాథ్ మహతాబ్, ఆయన భార్య రాణి ధనిబీబీ అతణ్ని పెంపకం తీసుకుని పెంచారు.

1918లో హరేకృష్ణ మహతాబ్ ఉత్కల్ సమ్మిళనీ అనే సాంఘిక, సాంస్కృతిక సంస్థలో చేరాడు. 1903లో సామాజిక సంస్కర్త మధుసూదన్ దాస్ ఈ ఆర్గనైజేషన్ ను స్థాపించారు. ఈ సంస్థ ఒడిశా ప్రత్యేక ప్రావిన్స్ గా ఏర్పాటు కావాలని.. సామాజిక, పారిశ్రామికాభివృద్ధి జరగాలని బలంగా ప్రచారం చేస్తున్న రోజులవి.

1920లో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఉత్కల్ సమ్మిళనీ సంస్థ కూడా ఆయనతో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో, కటక్ లో రావెన్ షా కళాశాల విద్యార్థిగా ఉన్న మహతాబ్.. మహాత్మాగాంధీ భావాలతో అమితంగా ప్రభావితమయ్యాడు. అలా స్వాతంత్ర పోరాటంలోకీ దిగిన మహతాబ్.. ఆ తర్వాత బ్రిటీషర్స్ ను ఎదిరించి పలుమార్లు జైలుపాలయ్యాడు.

మహతాబ్ ఉత్కల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీతో పాటు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనూ పలు పదవులు చేపట్టాడు. 1920లో ఒడిశాలో ప్రజామండల్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. స్థానికంగా బ్రిటీష్ వారి సామంతులుగా ఉన్న ప్రభువులకు, పరోక్షంగా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా చెపట్టిన ఈ ఉద్యమాన్ని గడ్జత్ ప్రజా ఉద్యమని కూడా పిల్చేవారు.

అలా రాజకీయాల్లో చురుకుగా వ్యవరించిన హరేకృష్ణ మహతాబ్.. మరికొద్ది రోజుల్లో స్వాతంత్రం సిద్ధిస్తుందనే సమయంలో రాజ్యాంగసభకు ఎన్నికయ్యారు. 1946-50 మధ్య ఒడిశా చివరి ప్రధానమంత్రిగా ఉన్న హరేకృష్ణ మహతాబ్… ఆ తర్వాత 1956 నుంచి 1961 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒడియా మాట్లాడే 26 రాచరిక పాలనలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ ఒడిశాతో విలీనం చేసిన ఘనత ముఖ్యమంత్రిగా హరేకృష్ణ మహతాబ్ ది. ఒడిశాలోని మహానదిపై హీరాకుడ్ ప్రాజెక్టుతో సహా.. ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆ రాష్ట్రానికే ఓ మార్గదర్శకుడిగా నిల్చాడు.

జవహర్ లాల్ నెహ్రూ మొట్టమొదటి కేంద్ర కేబినెట్ లో సభ్యుడైన మహతాబ్… 1955లో బొంబాయి ప్రావిన్స్ గవర్నర్ గా కూడా పనిచేశారు. 1966లో మహతాబ్ భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా కూడా పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగారు. కానీ, లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో విధానపరమైన విబేధాలేర్పడ్డాయి. దాంతో మహతాబ్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టి.. తన సొంత పార్టీ ఒరిస్సా జన కాంగ్రెస్‌ను స్థాపించాడు. ఆ తర్వాత తను మూడుసార్లు ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఇందిర ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు 1976లో జైలు పాలయ్యాడు.

1977లో క్రియాశీల రాజకీయాల నుండి విరమణ తీసుకున్న మహతాబ్.. 1987, జనవరి 2న కన్నుమూశారు. 1923లో ఆయన స్థాపించిన ప్రజాతంత్ర అనే వార్తాపత్రిక ఇప్పటికీ ఒడిశాలో ఉనికిలో చురుకుగా ఉంది. కటక్ నుంచి బీజేపీ ఎంపీగా గెల్చిన ఆయన కుమారుడు భర్తృహరి ఆ ప్రజాతంత్రకు సంపాదకుడిగా ఉన్నారు.

ఒడిశాలో బలమైన తన రాజకీయ ముద్ర కోసం బీజేపీ యత్నం!

బహుశా ఇందిరాగాంధీపై తిరుగుబాటు చేసినందుకో, ఏమోగానీ నాల్గు దశాబ్దాలకు పైగా ఒడిశాను పాలించిన కాంగ్రెస్ నుంచి హరేకృష్ణ మహతాబ్ కు దక్కాల్సినంత గౌరవం దక్కలేదు. కానీ, 13 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జానకీ వల్లభ్ పట్నాయక్ ను మాత్రం కాంగ్రెస్ భుజానికెత్తుకుంది. దాంతో ఒడిశాలో కాంగ్రెస్ అత్యున్నత నేతగా జానకీ వలభ్ పట్నాయక్ కు పేరు వచ్చింది.

1997లో నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్ ను స్థాపించి.. 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి పీఠమెక్కాక ఒడిశా రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. 24 ఏళ్ల పాటు బీజేడీ ప్రభుత్వం అధికారంలో ఉండి.. ఒడిశాలో తిరుగులేని పార్టీగా ఎదిగింది. తన తండ్రి బిజూ పట్నాయక్ ఇమేజ్ ను మరింత పెంచుతూ నవీన్ పట్నాయక్ పాలన సాగించారు. ఈ కాలంలో బిజూపట్నాయక్ ను ఒడిశా ఆధునిక శిల్పిగా అభివర్ణిస్తూ.. ఆయన విగ్రహాలు వెలవడంతో… ఇక హరేకృష్ణ మహతాబ్ పేరే మర్చిపోయేలా.. కొత్త తరానికైతే ఎవరో తెలియని నాయకుడిగా మారిపోయింది పరిస్థితి. కేవలం ఒడిశా అసెంబ్లీతో పాటు, భువనేశ్వర్ లోని స్టేట్ లైబ్రరీలో మాత్రమే మహతాబ్ విగ్రహాలు దర్శనమిస్తాయి.

అయితే, ఇప్పుడు హరేకృష్ణ మహతాబ్ 125 జయంతి వేడుకలు వస్తున్న సందర్భంగా.. బహుశా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీపై విభేదించడం..మహతాబ్ లాగే ఇందిరపై తిరుగుబాటు చేసిన నాటి జనతాదళ్ లో ఉండి ఆ తర్వాత బీజేపీ బాట పట్టిన సీనియర్ నేతలను జైలుపాలు చేయడం… ఒడిశా నవ నిర్మాణ శిల్పిగా పేరున్న ఆయన్ను సముచితంగా గౌరవించడంలేదన్న అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి… మహతాబ్ వారసులుగా బీజేపి క్లెయిమ్ చేసుకునే అవకాశాలు బీజేపీ నేతల అడుగులను బట్టి చర్చకొస్తున్నాయి

బీజేడీ నుంచి ప్రాతినిథ్యం వహించి ఆరుసార్లు ఎంపీ అయిన హరేకృష్ణ మహతాబ్ కుమారుడు భర్తృహరిని.. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు గాలం వేసి బీజేపీ తనవైపు లాక్కోవడంలో సక్సెసైంది. భర్తృహరి 1998 నుంచి వరుసగా కటక్ లోక్ సభ సభ్యుడిగా గెలుస్తూ వస్తున్నారు.

ఇప్పుడు మహతాబ్ 125వ జన్మదినాన్ని పురస్కరించుకుని మాఝీ ప్రభుత్వం ఆయన పేరిట ఒక స్మారక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి.. ఆయన జన్మస్థలమైన అగరపడాలో ఆయన విగ్రహాన్నీ ఏర్పాటు చేసి.. దాన్నో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని తీసుకుంది. అలాగే, మహతాబ్ రాజకీయ జీవితంపై సెమినార్స్ నిర్వహించాలని, ఆయనకు సంబంధించిన పరిశోధనలను ప్రోత్సహించాలనే ప్రణాళికలతో పాటు.. ఆయన రచించిన పుస్తకాలను హిందీ, ఇంగ్లీష్, ఇతర భాషల్లోకి అనువదించి.. వాటిని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఉంచే అన్ని ప్రయత్నాలూ ఇప్పుడు బీజేపీ భుజానికెత్తుకునేందుకోవడంతో… ఒడిశాలో బలపడేందుకు బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు చర్చకొస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles