పండ్ల వ్యాపారి.. పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎలా అయ్యాడు..?

పుట్టింది పావర్టీలో.. గుణం మాత్రం రిచ్. చదువులేక నారింజ పండ్లమ్ముకునే ఓ వ్యాపారి.. తనలా ఇంకెవ్వరూ ఉండొద్దని వచ్చిన కాసింత సంపాదనను పోగుచేసి, ఓ స్కూలే ఏర్పాటు చేశాడు. ఆయన్ను ప్రభుత్వం పద్మశ్రీతో సన్మానించింది.

దక్షిణ కర్నాటకలోని మంగళూర్ లో ఏళ్ల తరబడి నారింజ పళ్లమ్ముకునేవాడు హరేకల అనే పక్కనే ఉన్న గ్రామానికి చెందిన హజబ్బా. కానీ, తనలాగా మిగిలిన సమాజంలోని పేదపిల్లలు చదువుకోకుండా ఆగిపోకూడదని ఎన్నో కష్టాలకోర్చి ఓ బడినే స్థాపించాడు. హజబ్బాకు పాఠశాల లేకుంటే ఏమైతుందో తెలుసు. తన స్వీయానుభవం తనకు ఆ పాఠం నేర్పింది.

దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఆయన గ్రామం హరేకలలో పిల్లలకు విద్యా అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. ఆ అసౌకర్యానికి ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్నాడు. అయితే, అందుకు ఆయనకు జరిగిన ఓ ఇన్సిడెంట్ బలంగా కారణమైంది.

ఏ ఘటన హజబ్బా స్కూల్ కు ప్రేరణగా మారింది..?

రోజటిలానే పళ్లమ్ముతుండగా ఓ విదేశీ టూరిస్ట్ హజబ్బా దగ్గరికొచ్చి నారింజ పళ్ల ధర ఎంత అని ఇంగ్లీష్ లో ప్రశ్నించాడు. కానీ, చదువుకోని హజబ్బాకు ఆ ప్రశ్నేంటో అర్థం కాలేదు. అది హజబ్బాను కలిచివేసింది. తనలాగా చదువుకోకుంటే తన ఊళ్లో పేద పిల్లల పరిస్థితేంటని భవిష్యత్తును ఊహించుకున్నాడు. దాంతో తన ఊళ్లో ఎలాగైనా స్కూల్ కట్టాలని తీర్మానించుకున్నాడు.

కానీ, స్కూల్ కట్టాలన్నా, నిర్వహించాలన్నా బోలెడంత డబ్బులు కావాలి. పైగా తను స్థాపించగానే పిల్లలూ రావాలనీ ఏమీ లేదు. ఇవన్నీ సవాళ్లే. కానీ, అవన్నీ సాధించగలనన్న నమ్మకముందో.. అంతలా ఆలోచించాడో, లేదోగానీ.. ఎలాగైనా బడి అయితే స్థాపించాలని సంకల్పం తీసుకున్నాడు.

మరెలా..?

రోజూవారీ సంపాదనలో కొంత మొత్తం బడి కోసమే పక్కనబెడుతూ.. తన లక్ష్యాన్ని నల్గురికి చేరవేశాడు. మరికొందరు వితరణశీలురు తోడయ్యారు. స్వచ్ఛంద సంస్థలూ కలిసివచ్చాయి. హరేకలలో బడి వెలిసింది.. హజబ్బా కల నెరవేరింది.

చిన్న చిన్న పొదుపులతో బడినే ఏర్పాటు చేసిన ఓ పండ్ల వ్యాపారి కీర్తి దేశాలు దాటింది.. గ్రామీణ పిల్లల భవిష్యత్ భారతాన్ని తీర్చిదిద్దినందుకు ఆయన్ను భారత్ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో గౌరవించుకుంది.

పేదరికంలో గడిచిన బాల్యం!

69 ఏళ్ల హజబ్బాదంతా కాళ్లకు చెప్పులు కూడా లేని కడు పేదరికమే. పాఠశాల గడప తొక్కింది లేదు. చిన్నప్పట్నుంచీ పొట్టకూటి కోసం కూలీ పనులే. ఆ తర్వాత మంళూరులోని బస్టాండ్ వద్ద నారింజ పండ్లమ్మడం మొదలుపెట్టాడు. కాలక్రమేణా ఆ బస్టాండ్ లో అందరూ గుర్తు పట్టేంత సుపరిచితుడయ్యాడు.

కానీ, ఓ విదేశీ పర్యాటకుడు వేసిన ప్రశ్న హజబ్బాను పూర్తిగా మార్చేసింది. విద్య లేకపోతే మనిషి ఏం కోల్పోతాడో బలంగా గుర్తు చేసింది. ప్రాథమిక విద్య కోసం తన ఊరు పిల్లలు ఎంత దూరం వెళ్లాల్సి వస్తుందో కళ్లముందుంచింది. దాంతో డ్రాపవుట్స్ పెరుగుతూ కూలీ పనులు చేసుకునేవారూ తన కళ్ల ముందు మెదిలారు. విద్య అందరికీ దక్కాలంటే ఊళ్లోనే పాఠశాలను ఏర్పాటు చేయాలన్న సంకల్పం అప్పుడే ఏర్పడింది.

రూపాయి రూపాయి కూడబెట్టి పాఠశాల నిర్మాణం!

బడి కట్టాలనే కల కనడం వేరు.. దాన్ని నిజం చేయడం వేరు. ఆ నిజం చేసిన విధానం ఇంకా విశేషం. రూపాయి రూపాయి కూడబెట్టడంతో పాటే.. అదే సమయంలో ప్రభుత్వాధికారులను, స్థానిక నాయకులను కలుస్తూ పాఠశాల అవసరం గురించి ఏళ్లపాటు తిరిగాడు. చివరకు హజబ్బా పట్టుదల ఫలించింది. 2000 సంవత్సరంలో హరేకల గ్రామంలో ఓ పాఠశాల వెలిసింది. కానీ, పాఠశాల ఏర్పాటవ్వడమే హజబ్బా లక్ష్యం కాదు. కుటుంబాలన్నీ తమ పిల్లల్ని ఆ బడికి పంపేవరకూ కాళ్లరిగేలా తిరిగాడు. చదువు విలువను వివరించి ప్రోత్సహించాడు. కాలక్రమేణ పాఠశాల విస్తరించింది. ఒక పట్టు వదలని విక్రమార్కుడి ప్రయత్నం.. వందల మంది పిల్లలకు విద్యను అందుబాటులోకి తెచ్చింది.

పాఠశాల నిర్మాణం.. తన లక్ష్యం తర్వాత కూడా హజబ్బా ఏమీ తెలియనట్టే అంతే నిరాడంబరంగా గడుపుతున్నాడు. తన పండ్ల వ్యాపారాన్ని యథావిధిగా మంగళూరులో కొనసాగిస్తూనే ఉన్నాడు. నారింజ పండ్లు అమ్ముతూనే ఉన్నాడు.

బాధ్యత నిర్లక్ష్యంపై గెలిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి హజబ్బా స్కూల్ స్టోరీ ఓ గొప్ప ఉదాహరణ. మార్పులు తీసుకురావాలంటే ప్రాంతం, కులం, మతం, పేదవారా, ధనవంతులా అన్నవేవీ అవసరం లేదనే విషయమూ హజబ్బా కథ విన్నవాళ్లకు బోధపడాల్సిన మరో విశేషం.

భారతదేశంలో ఇప్పటికీ ఇంకా చదువు ఓ అందని ద్రాక్షగానే మిగిలిపోయిన గ్రామాలు, తాండాలెన్నో. అలాంటి చోట ఇలాంటి హజబ్బాలు పుట్టుకొస్తే.. వారి తలరాతలూ మారతాయి. ప్రపంచాన్ని మార్చేవారు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారో, స్థితిమంతులో అవ్వాల్సిన పనేం లేదని నిరూపించడంతో పాటే.. దయార్ద్ర హృదయం, అచంచల విశ్వాసం, సంకల్పం ఉంటే సాధించవచ్చని హజబ్బా నిరూపించాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles