రాజకీయ సంస్కృతి
…………………………………………………………………………………………………

డా. పుల్లూరి సంపత్ రావు..✍️
సమకాలీన రాజకీయాలలో ఉండవలిసిన ఉదాత్త రాజకీయ సంస్కృతి కనిపించడం లేదు. ప్రజలు ఎన్నోసార్లు తమ ఓటుహక్కు ద్వారా నాయకులను మారుస్తునప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోగా ప్రతిసారీ మరింత దిగజారిన రాజకీయ వాతావరణం కనిపిస్తున్నది. భారత రాజకీయాలలో రాజకీయ సంస్కృతి పెరగవలిసిన అవసరం ఉంది.
సోక్రటీస్ కు ఆనాటి ప్రభుత్వం మరణశిక్ష విధించాక ఆ శిక్షను అమలుచేసే సమయంలో “మీరు శిక్షను తప్పించుకోవచ్చు” అని అక్కడి అధికారులైన తన శిష్యులు సూచిస్తే, “మనం చట్టాలను గౌరవించాలని జీవితాంతం ప్రచారం చేసి మనమే వాటిని ధిక్కరిస్తే మంచిది కాదని” సోక్రటీస్ అని శిక్షను అమలు చేయించుకుని చనిపోయారు. ఈ ఘటనతో ఖిన్నుడైన సోక్రటీస్ శిష్యులలో ఒకడైన ప్లేటో, మూర్ఖులయిన రాజకీయ నాయకుల చర్యలు మేధావులకు నష్టం అని భావించి “తత్వవేత్తలు పాలకులు కానంతవరకు లేదా పాలకులే తత్వవేత్తలు కానంతవరకు చెడు పాలనకు అంతం లేదు” అన్నారు. ఇరవై ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా గుర్తు చేసుకునేలా చేసిన ఒక గొప్ప రాజకీయ విలువను సోక్రటీస్ మానవాళికి అందించారు.
రాజరికాల కాలంలో కూడా కొందరు రాజులు, మంత్రులు గొప్ప తెలివితేటలను ప్రదర్శించిన ఘటలను చరిత్రలో చూస్తాము. వైభవోపేతమైన పాలనను అందించినవారు, అద్భుత చారిత్రక కట్టడాలను నిర్మించినవారు, నిలిచిపోయే సాహిత్యాన్ని సృష్టించినవారు, నాగరికతకు దోహదం చేసిన మానవతను, త్యాగనిరతిని ప్రదర్శించిన వారు మనకు తెలుసు. ఇలాంటి వారి జీవితాలను నడిపించింది వారి ఉదాత్త లక్షణాలే!
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు మౌలిక లక్షణం వారి రాజకీయ సంస్కృతి. వారు పాలించిన చోట్ల ఎన్ని చట్టాలు , రాజ్యాంగాలు రూపొందించినా వారు మాత్రం ఇంగ్లాండ్ లో రాజ్యాంగానికి బదులు రాజకీయ సంస్కృతినే నమ్ముకున్నారు. సామాజిక జీవితంలో ఆచార సాంప్రదాయాలు పోషించే పాత్రను రాజకీయాలలో రాజకీయ సంస్కృతి అలాంటి పాత్ర పోషించాలి. అన్ని సమయాలలో చట్టాలు, రాజ్యాంగ ప్రకరణలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అందుకని రాజకీయాలలో కూడా ఆచార సాంప్రదాయాలు అవసరం. ఇలాంటి రాజకీయ సంస్కృతి లేకపోతే రాజ్యాంగం ఒక స్కెలిటం మాత్రమే అని వారు భావించారు.
“మంచి ప్రజలు మంచి ప్రభుత్వాన్ని, చెడు ప్రజలు చెడ్డ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని” గ్రీకుల నానుడి. “చెడ్డ ప్రభుత్వమంటే మంచి ప్రజలు ఎన్నుకొనని ప్రభుత్వమని” కూడా అంటుంటారు. ఈ కోణం నుంచి అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఎన్నికల రాజకీయాలను పరిశీలించాలి. కానీ మనకేమో “యధారాజా తధా ప్రజ” అని లోకోక్తి. రాజు అయిన వాడు లేదా నాయకుడు అయిన వాడు ప్రజలకంటే ఉన్నత ఆదర్శాలను కలిగి ఉండాలి. దార్శనికత ప్రదర్శించేవాడే నాయకుడు.
భారత రాజకీయాలలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చాలామంది నాయకులకు ప్రజాస్వామ్య స్పూర్తి కొరవడింది. అవతలి నాయకుడిని గౌరవించడం అటుంచి వాళ్ళను గుర్తించడానికే నిరాకరిస్తున్నారు. ప్రభుత్వమంటే గెలిచిన రాజకీయ పార్టీ నాయకుడనే భ్రమలో ఉన్నారు. ప్రభుత్వమంటే శాసన, కార్యనిర్వహణ, న్యాయ శాఖల పనితీరు. గతకొద్ది దశబ్ధాలుగా కొందరు రాజకీయ నాయకుల అత్యుత్సాహం వలన రాజ్యాంగ సంస్థల గౌరవం క్షీణించింది.
ఎన్నికల అనంతరం అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి అంత బాధ్యత ఉంటుంది. ఇంగ్లాండ్ లో ప్రతిపక్షాన్ని “షాడో గవర్నమెంట్” అంటారు. ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రతిపక్షాలను సంప్రదించడం, వాళ్ళను భాగస్వాములను చేయడం వంటివి మంచి రాజకీయ సంస్కృతికి నిదర్శనాలు. ఒకప్పుడు వైరుధ్యాలు భావాల మద్యనే గానీ నాయకుల మద్య ఉండేది కాదు. ప్రజాక్షేత్రంలోనూ, శాసన సభలోనూ హోరాహోరీగా పోరాడి, ప్రత్యక్షంగా కలుసుకున్నప్పుడు ఆప్యాయంగా పలకరించుకోవడం ఒకప్పుడు జరిగేది. నాయకులపై, వాళ్ళ పార్టీలపై ఎంత కోపం ఉన్నా భాష గౌరవంగా ఉండేది. కలసి భోజనాలు చేసేవారు, ఫోటోలు తీసుకునేవారు.
నాయకులు ఎన్ని మంచి పనులు చేసినా వాళ్ళ ప్రవర్తన బాగా లేకపోతే వాళ్ళను ప్రజలు పక్కన పెడతారని రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలు స్పష్టం చేశాయి. పెద్దగా అభివృద్ది, సంక్షేమ పథకాలు లేకుండానే కొందరు మంచి ప్రవర్తనతో ఇరవై ఏండ్లకు పైబడి ముఖ్యమంత్రులుగా అధికారంలో ఉన్నారు. ప్రభుత్వాలు అద్భుతాలు చేస్తాయని ఎవరూ నమ్మడంలేదు. వారికి ఆత్మగౌరవం కావాలి. పైగా ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నది ప్రజల డబ్బే అని అందరికి అర్థం అయింది. అవమాన పరిచిన వారు అధికారం కోల్పోయి అవమానానికి గురైన వారు అధికారంలోకి రావడం తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రత్యేకత. అష్ట కష్టాలు పడి అధికారంలోకి వస్తున్నారు గానీ దాన్ని నిలుపుకోలేకపోతున్నారు. ఈ స్థితినే మార్క్ ట్వైన్ వ్యంగ్యంగా “ప్రభుత్వాలను, డైపర్లను తరచుగా మార్చాలి, లేకపోతే కంపు కొడుతాయి” అన్నారు.
అయితే పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. చాలామంది కొత్తవాళ్లు రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీళ్లలో డబ్బులేనివాళ్ళు, రాజకీయ చరిత్ర లేనివాళ్ళూ ఉన్నారు. కేంద్రంలో అహంకారానికి తావులేని పరిస్థితి ప్రజలు కల్పించారు. లోక్ సభకు కూడా చాలామంది కొత్తవాళ్ళు ఎన్నికయ్యారు. రిజర్వేషన్లు లేకుండానే తగిన సంఖ్యలో మహిళలు లోకసభకు ఎన్నికయ్యారు. అమెరికా, యూరప్ దేశాల ప్రజాస్వామ్యాల వయసుతో పోలిస్తే భారత్ ప్రజాస్వామ్యానిది చాలా చిన్న వయసు. చట్టాలను, రాజ్యాంగ సంస్థలను, అవతలి నాయకులను, ప్రజలను గౌరవంగా చూసే రాజకీయ సంస్కృతి మనవాళ్లు నేర్చుకుంటారని ఆశ!



