రక్షణలో ప్రాణాలర్పిస్తున్నవారికి గుర్తింపు సరే! మరి శుభ్రతలో ప్రాణాలర్పిస్తున్నవారికి.. ఆ గుర్తింపేది..?

దేశభక్తీ- త్యాగాలూ, మరణాలూ- వాటి విలువలు

—————————————————————-

– సూఫీ ✍🏻 ✍🏻

స్వతంత్ర దినం, దేశభక్తి అనగానే సరాసరి బోర్డర్ దగ్గరికి పోతుంది మనసు. డ్యూటీ చేస్తున్న వీర జవాన్ మీద కవితో, పోస్టో రాయలనీ అనిపిస్తుంది. అయితే కేవలం సైన్యం కారణంగానే మనం బతుకుతున్నామా? (ఇది సైనికులని కించపరిచే మాట కాదు, ఒక దేశానికి రక్షణ ఇవ్వటానికి వాళ్లు ఉద్యోగం చేస్తున్నట్టే ప్రతీ ఉద్యోగీ దేశం కోసమే ఉన్నాడు అనే ఆలోచన ఎందుకు రాదు అన్నదే కాస్త ఆలోచించాల్సిన మాట)

భారత దేశమే కాదు, ప్రపంచంలో 80% దేశాలు సైన్యమే తమ బలం అన్నట్టు చూపిస్తాయి, సైనికుల మరణాలని తమ విజయ సూచికలుగా ప్రకటించుకుంటాయి ప్రభుత్వాలు. అదే ప్రభుత్వాలు, అవే అధికార పార్టీలు మిగతా ఉద్యోగుల, పనివాళ్ల మరణాలను మాత్రం దాచాలని ప్రయత్నిస్తాయి.

భారత్‌లో మాన్యువల్ స్కావెంజింగ్ (లాట్రిన్‌లు, సీవర్స్, సెప్టిక్ ట్యాంక్‌లను మనుషులే చేతితో శుభ్రం చేయడం కొనసాగుతూనే ఉంది. కానీ ఇది చట్టం ప్రకారం మాత్రం నిషేధించబడటమే మ్యాజిక్కు.

2013లో Prohibition of Employment as Manual Scavengers and their Rehabilitation Act (PEMSR Act, 2013) వచ్చింది. ఈ చట్టం ప్రకారం మాన్యువల్ స్కావెంజింగ్‌ను పూర్తిగా నిషేధించడానికి, బాధితుల పునర్వాసం కోసం చర్యలు తీసుకోవటానికీ చేయబడ్డ చట్టం.

ఇప్పుడొకసారి “మరణాల లెక్కలు చూద్దాం 2019–2023 మధ్య 377 మంది సెప్టిక్ టాంక్స్, డ్రైనేజ్ శుభ్రం చేసే పనులలో మరణించారని కేంద్రమే ప్రకటించింది. NDTV సమాచారం ప్రకారం, 2018–2023లో 339 మంది అంటే సంవత్సరానికి ఉండే లెక్కల ప్రకారం 2018లో 67, 2019లో 117 మంది, 2020లో 22 మంది, 2021లో 58 మంది, 2022లో 66 మంది, 2023లో 9 మంది చనిపోయారు.

(ఈ మరణాలని గురించి వింటున్నప్పుడు మనలో దేశభక్తి ఉప్పొంగదు, అడ్రినలిన్ రష్ కట్టలు తెంచుకోదు. ఈ రోజు జరిగే ఏ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లోనూ ఏ తల్లీ, తండ్రీ ఈ ఉద్యోగుల, పని చేసేవాళ్ల బట్టలు వేసి పోటీకి పంపరు. ఎందుకంటే వాళ్లు శుభ్రం చేసిన మురికి పాకిస్థాన్, చైనా వాళ్లది కాదు. మనదే…

ఎక్కడి దాకనో ఎందుకు… ఒరిస్సాలో (జూన్ 2025), నాబరంగ్‌పూర్ జిల్లా పొడాలగూడా గ్రామంలో నలుగురు శానిటేషన్ కార్మికులు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ విషవాయువుల కారణంగా మరణించారు.

రాజస్థాన్‌లో 2025లోనే 3 మరణాలు సంభవించడంతో హైకోర్టు ప్రభుత్వానికి స్పందించమని ఆదేశించింది. కానీ చర్యలు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెబుతోంది.

మహారాష్ట్రలో, మొత్తం సుమారు 7,500–8,000 మంది ఇప్పటికీ ఈ పనిలో చేరారని 2021–24 మధ్య 18 మంది మరణించినట్లు అసెంబ్లీ సమావేశంలోనే ప్రకటించారు.

₹405 కోట్లు రోబోటిక్ పరికరాల కొనుగోలుకు కేటాయించారు కానీ అవేమయ్యాయో తెలియదు.

EnPress Journals అధ్యయనం ప్రకారం, మాన్యువల్ స్కావెంజర్లలో: 80% మంది పురుషులు 60 ఏళ్లకు ముందే మరణిస్తున్నారు, వారి సాధారణ ఆయువు 40-45 సంవత్సరాలు మాత్రమే, ఇక మహిళా కార్మికుల సంగతి మరీ దారుణం.

ఇప్పుడు కొత్తగా చెప్పే అవసరం లేదు… వీళ్లంతా ఏ ఏ కులాలకు చెందినవాళ్లై ఉంటారో. ఎందుకని ఈ మరణాలు లెక్కలోకి, చర్చల్లోకిరావో. దేశాన్ని కాపాడటం అంటే… కేవలం బార్డర్లో మాత్రమే కాదు దేశాన్ని శుభ్రంగా ఉంచటం కూడా. సైనికుల గురించి, దేశ భద్రత గురించీ కేటాయించే బడ్జెట్ గురించి ప్రతీ ఏటా చర్చించే మనం వీళ్లని మాత్రం మర్చిపోతుంటాం.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓట్లు గల్లంతయ్యాయీ అంటే…. ఇంతకు ముందు కూడా అయ్యాయి కదా, ఎందుకు గోల చేస్తున్నారు అనే స్థితిలో ఉన్న మనం.

ఇప్పుడు గట్టిగా ఇంకోసారి చెబుదాం….. ఇంతకీ ఏమని అరవాలి???

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles