ఆర్జేడీకి ఓట్లు, సీట్ల మధ్య ఎందుకా అంతరం..?

బీహార్ ఎన్నికలైపోయాయి… మళ్లీ ఎన్డీఏ కూటమిదే అధికారం. కానీ, ఫలితాల విశ్లేషణలు, పోస్ట్ మార్టం మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ, జేడీయూ కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చిన ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితమవ్వడమేంటన్నది ఇప్పుడు ప్రతిపక్ష కూటమి లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న..?

2025 బీహార్ ఎన్నికల ఫలితాల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ శాతం సంపాదించుకున్న పార్టీగా నిల్చినా… సీట్ల పరంగా మాత్రం బీహార్ లో ఆర్డేడీ తన రాజకీయ చరిత్రలోనే తక్కువస్థాయికి పడిపోయింది.

ఓవైపు ఎన్డీఏ 200కు పైగా సీట్లతో ఘన విజయం సాధించడం.. ఇంకోవైపు మహాఘట్ బంధన్ పూర్తిగా ఢీలా పడటం.. ఈ రెండూ ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మెదళ్లకు పదును పెట్టేలా పని చెప్పాయి.

ఎక్కువ ఓట్లు – తక్కువ సీట్లే పెద్ద చర్చ!

ఆర్జేడీ దాదాపు 23% ఓట్ల శాతం సాధించింది. 2020లో వచ్చిన 23.11%తో దాదాపు సమానంగా 2025 తాజా ఎన్నికల్లోనూ ఓట్లు పోలయ్యాయి. కానీ 2020లో ఆ పార్టీ 75 సీట్లు గెలిస్తే… ఈసారి మాత్రం 25 సీట్లకు ఆర్జేడీ గ్రాఫ్ పడిపోయింది.

ఎలా..? ఓట్లెక్కువైతే.. సీట్లు కూడా రావాలి కదా..?

ఇక్కడే అసలు కథ. ఆర్జేడీకి రెండో స్థానం కట్టబెట్టి.. భారీగా ఓట్లు వేసిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. సెకండ్ ప్లేస్ వరకూ సదరు అభ్యర్థులు పోటీ ఇవ్వగల్గారే తప్ప.. గెలిచేంత మొత్తం ఓట్లు వారు సంపాదించుకోలేకపోయారు. సాదాసీదాగా చెప్పాలంటే.. ఆర్జేడీకి ఓట్లు వచ్చాయి కానీ… సీట్లు రాలేదు.

ఎవరికి అత్యధికంగా సీట్లు వస్తే వారే విజేతలు.. ఇదే ఇండియన్ ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ ఓటింగ్ విధానం.

బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ సీట్లల్లో ఆర్జేడీ పోటీ!

మహాఘట్ బంధన్ లో భాగంగా ఈసారి ఆర్జేడీ 143 సీట్లల్లో పోటీ చేసింది. గత ఎన్నికల్లో 144 సీట్లల్లో పోటీ చేసింది. పోటీ ఎక్కువ సీట్లల్లో పెట్టేసరికి మొత్తం ఓట్ల సంఖ్య కూడా సహజంగానే పెరిగింది. దాంతో ఓటింగ్ శాతం కూడా అదే రేషియోలో ఎక్కువ కనిపిస్తోంది. అదే సమయంలో బీజేపీ.. అలాగే, జేడీయూ ఈ రెండూ కూడా చెరో 101 సీట్లల్లో మాత్రమే పోటీ చేశాయి. అందుకోసం వారి బలాబలాలను సరిగ్గా అంచనా వేసుకుని రంగంలోకి దిగాయి. తక్కువ స్థానాల్లో పోటీ చేయడం వల్ల ఫోకస్డ్ గా సీట్లు సాధించడంలో ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. అందుకే వారు నిల్చున్న స్థానాల్లో ఓట్లను సమర్థవంతంగా సీట్లుగా మార్చుకోగల్గారు.

మేథమెటిక్స్ లో ఎన్డీఏ పాస్.. ఎంజీబీ ఫెయిల్!

ఈసారి జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) ఎన్డీఏలో చేరడం.. ఆ కూటమికి మరింత కలిసివచ్చింది. 2020లో ఎల్జేపీ 134 స్థానాల్లో పోటీ చేసి.. నాడు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఓట్లకు, సీట్లకు గండి కొట్టింది. అలాగే, ఉపేంద్ర కుశ్వాహా పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చా కూడా గతంలో ఒంటరిగా 104 సీట్లల్లో బరిలోకి దిగి నాడు ఎన్డీఏ ఫలితాలపై ప్రభావం చూపింది.

కానీ, ఈసారి మాత్రం ఎల్జేపీతో పాటు, ఉపేంద్ర కుశ్వాహా పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చా, అలాగే, జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా కూడా ఎన్డీఏతో కలవడంతో… మహాఘట్ బంధన్ పై ఎన్డీఏ దూకుడు ప్రదర్శించింది.

జేడీయూ రీఎంట్రీతో తారుమారైన కథ!

2020లో ఆర్జేడీ – జేడీయూ నేరుగా ఢీ అంటే ఢీ అన్న రీతిలో పోటీకి దిగడంతో ఆర్జేడీ ఆధిక్యం కనిపించింది. కానీ, 2025 ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలను జేడీయూ సాధించింది. జేడీయూ వర్సెస్ ఆర్జేడీ మధ్య గట్టి పోటీ నెలకొన్న 59 సీట్లల్లో 50 చోట్ల ఆర్జేడీని మట్టి కరిపించింది జేడీయూ. అలాగే, జేడీయూ ఓటింగ్ శాతం 2020లో 15.39 కాగా.. ఈసారి 19.25 శాతానికి పెరిగింది. సీట్లు 43 నుంచి 85కు పెరిగాయి. ఈ లెక్కలను ఆర్జేడీ సరిగ్గా అంచనా వేయలేకపోయినట్టుంది.

బీజేపీకి బీహార్‌లో అతి పెద్ద విజయం!

బీహార్ రాజకీయాల్లో ఎక్కువ కాలం కాంగ్రెస్ చక్రం తిప్పినా.. 1990ల నుంచి ఎప్పుడైతే ఆర్జేడీ హవా మొదలైందో అప్పట్నుంచీ కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని పొందలేకపోయింది. అధికారం కోసం తాపత్రయపడుతూనే ఉంది. ప్రాంతీయ పార్టీల హవా మొదలయ్యాక బీహార్ పాలిటిక్స్ మరింత రంజుగా మారిపోయాయి. కానీ, ఎన్డీఏ కూటమిగా మెల్లిగా ఎంట్రీ ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు బీహార్ లోనూ 89 సీట్లు సంపాదించుకున్న పార్టీగా జెండా పాతింది. గతంలో బీహార్ లో అసలు బేసే లేని బీజేపీ.. ఇప్పుడు బలమైన రాజకీయశక్తిగా ఎదుగింది. సుశాన్ బాబు నితీష్ తో స్నేహబంధం కొనసాగిస్తూనే.. ఇప్పుడు అతి పెద్ద పార్టీగా అవతరించి బీహార్ రాజకీయాల్లో ప్రధాన ప్రభావశక్తిగా మారింది.

మిత్రపక్షాల ఐక్యత కరువైన మహాఘట్ బంధన్!

బీహార్ ఎన్నికల సరళిని పరిశీలిస్తే మహాఘట్ బంధన్ కు మిత్రపక్షాలు అంతగా సహకరించినట్టుగా కనిపించడం లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పోలిస్తే.. ఎంజీబీ అలయెన్స్ వీక్ గా కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి తగిలిన ఎదురుదెబ్బ కోలుకోలేనిది. 61 స్థానాల్లో పోటీ చేస్తే.. 6 సీట్లతో సింగిల్ డిజిట్ పార్టీగా ఆ జాతీయపార్టీ మిగిలిపోయింది. గతంలో వామపక్షాలు ప్రదర్శించిన అంతో ఇంతో బలం కూడా ఈసారి పనిచేయలేదు. సీట్ షేరింగ్ లో గందరగోళ పరిస్థితులు ఎంజీబీకి తలబొప్పి కట్టించాయి. ఫ్రెండ్లీ ఫైట్ అంటూ కొన్నిచోట్ల బరిలోకి దిగినా ఓట్ల బదిలీ సరిగ్గా జరగలేదు. ఇవన్నీఎన్డీఏ పక్షానికి కలిసొచ్చాయి.

బీహార్ ఎన్నికల్లో జన్ సురాజ్, ఏఐఎంఐఎం ప్రభావం!

ఎన్నికల వ్యూహకర్తగా తెరపైకొచ్చిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ తరపున ఒక్క సీటు గెలువలేకపోవడం కూడా ఇప్పుడు బీహార్ రాజకీయాల్లోనే కాకుండా, దేశవ్యాప్త చర్చ. అయితే, ఆ చర్చ కాస్సేపు పక్కనబెడితే.. కనీసం 35 సీట్లల్లో రెండో స్థానంలో ఉన్న పార్టీ గెలవాల్సిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు సాధించి ఫలితాలను ప్రభావితం చేసింది జన్ సురాజ్.

ఇక సీమాంచల్ లో మళ్లీ మెరుగైన ప్రదర్శనతో ఎంఐఎం ఈసారి ఆకట్టుకుంది. ఐదు సీట్లు గెల్చుకుంది. ఇది అక్కడి ముస్లిం ఓటర్స్ తో పాటు.. లీడర్స్ లోనూ ఆసక్తిని.. కొత్త రాజకీయ ఆలోచనలకు బీజం వేసే విజయం. సీమాంచల్ లో ముస్లిం – యాదవ్ సమీకరణ కూడా పనిచేయలేదు. ఆర్జేడీ పూర్తిగా మాయమైపోతే.. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క సీటుకు పరిమితమైపోయింది. ఇక బీఎస్పీ కూడా ఒకే ఒక్క సీటుతో.. 1. 62 శాతం ఓట్లతో తన ఉనికిని చాటుకోవడానికే పరిమితమైంది.

ఓవరాల్ గా బీహార్ లో రాజకీయ సమీకరణాలెలా కనిపించాయి..?

ఆర్జేడీ ప్రజాదరణ కోల్పోలేదని దానికి వచ్చిన ఓటింగ్ శాతం చెబుతోంది. కానీ, గెలిచే ప్రాంతాల్లో ఆధిక్యాన్ని కనబర్చలేకపోయింది. ఓట్ల శాతం ఎక్కువైనా సీట్లు మాత్రం పడిపోయాయి. మరోవైపు ఎంజీబీలో ఎక్కడైతే వైఫల్యాలు కనిపించాయో అక్కడే ఎన్డీఏ లెక్కలు, వ్యూహాలు, కూటమి ఐక్యత వంటివాటిల్లో బలంగా నిల్చి గెల్చింది. ఓవరాల్ గా ఓటు శాతం పార్టీ శక్తిని, దానికున్న ఆదణను మాత్రమే సూచిస్తుంది. కానీ, సీట్లు మాత్రమే విజయాన్ని అందిస్తాయి. అదే ఎన్డీఏ కూటమి దక్కించుకుంది.

INPUTS FROM NATIONAL CHANNELS WEBSITES

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles