దేవుడంటే ప్రకాశవంతంగా, తేజోమయంగా, ప్లెజెంటుగా… దెయ్యమంటే భీకరంగా, భయపెట్టేలా… హీరో అంటే ధైర్యంగా… విలన్ అంటే కన్నింగ్ గా ఇలా కొన్ని రూపాలు చిన్నప్పట్నుంచే మన మెదట్లో పాతుకున్నాయి. అయితే, ఆ ఫీల్ తెరపై రావాలి.. అదే సమయంలో అప్పటికే కొనసాగుతున్న మొనాటనీని బ్రేక్ చేయాలి. కొత్త లుక్ తీసుకురావాలి. అదిగో ఆ టెక్నిక్ నే పట్టుకున్నాడు. ఒక మొగాంబో, మరో గబ్బర్ సింగ్ తో విలనిజానికి కొత్త రూపునద్దాడు. మాధవ్ అగస్తి… ఏంటీ ఆ గ్వాలియర్ వాసి ప్రత్యేకత..?
బాలీవుడ్ కు చిరస్మరణీయమైన లుక్స్ అందించిన మాస్టర్ టైలర్ మాధవ్ అగస్తి.

స్టిచింగ్ స్టార్ డమ్ అనే తన బయోగ్రఫీలో తన క్యాస్టూమ్ డిజైనర్ ప్రయాణం గురించి పంచుకున్నాడు.
మొగాంబో ఖుష్ హువా అంటూ మిస్టర్ ఇండియాలో బ్లాక్ కోట్ పై గోల్డ్ కలర్ మోనోగ్రామ్ తో డిజైన్ చేసిన డ్రెస్ ధరించి.. వాటిపై చిన్న చిన్న బొక్కలతో కనిపించే అమ్రీష్ పురిని ఓసారి గుర్తుకు తెచ్చుకుంటే.. ఆ డ్రెస్ డిజైన్ వెనుకున్నది అగస్తి అని చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, ఆ ఐకానిక్ విలనీ పాత్ర హిట్టవ్వడం వెనుక మాధవ్ అగస్తి క్యాస్ట్యూమ్స్ పాత్ర కూడా కీలకమే. ఆ క్యాస్టూమ్స్ డిజైన్ కోసం వారాల తరబడి విదేశీ మ్యాగజీన్స్ వెతికాడు. పాత న్యూస్ పేపర్స్ కటింగ్స్ జల్లెడ పట్టాడు. చారిత్రక గ్రంథాలూ తిరిగేశాడు. అంత కసరత్తు జరిగాకగానీ.. అమ్రీష్ పురి మెయి మీదకు ఆ డ్రెస్ డిజైన్ కాలేదు. అయితే అగస్తీకి క్యాస్ట్యూమ్ డిజైనర్ వగైరా పెద్ద పెద్ద పేర్లంటే నచ్చవు.. జస్ట్ టైలర్ అంటేనే ఆయనకు మక్కువ.
స్టైలిస్ట్ అని, క్యాస్టూమ్ డిజైనర్ అనీ, ఫ్యాషన్ కన్సల్టెంట్ అనీ ఇలా పలురకాల పేర్లు బాలీవుడ్ సినీ ఫ్యాషన్ ప్రపంచంలో వినిపిస్తుంటాయి. మారుతున్న కాలానికి, ట్రెండుకు తగ్గట్టుగా టైలర్ కాస్తా ఇలాంటి పేర్లతో మనుగడలోకొస్తోంది. కానీ, టైలర్ అన్న పదమేం చిన్నది తాదు.. దానికీ గౌరవముందని నమ్మే వ్యక్తి అగస్తి. ఓ టైలర్ ఒక సాధారణ బట్టను తీసుకుని దానికి ప్రాణం పోస్తాడు. ఒక అర్థాన్నిస్తాడు. ఇది భారతీయ పరంపర. అదే నాకు గర్వకారణమంటాడు మాధవ్.
మాధవ్ అగస్తి బయోగ్రఫీ మొత్తం టైలర్ ఆత్మగౌరవాన్నే నిర్వచిస్తుంది. అలంకారాలేమీ లేకుండా, ఆత్మవంచన లేకుండా రాసిన ఓ సింప్లిసిటీ.. అట్టుడుగు నుంచి పైకెదిగే క్రమంలో చేసిన కృషి, కళ మీద ఉన్న అంకితభావం ఇవే తన బయోగ్రఫీలో రాసుకున్నాడతను.

తన బయోగ్రఫీలో ఆయన రాసుకున్న జ్ఞాపకాలు కూడా చాలా సూటిగా ఉండటం.. ముంబైలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకకు వచ్చినవారిలో ఆసక్తిని రేకెత్తించింది.
తను కోరితే అంత పెద్ద నటుడైన సునీల్ దత్ ఎలాంటి రెండో ఆలోచన, సంకోచం చేయకుండా నాగపూర్ లో అగస్తి చదువుకున్న కళాశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఒక చిన్న కార్యక్రమం ప్రమోషన్ కోసం రైల్లో వెళ్లాల్సి వస్తే రాజేశ్ ఖన్నా సరేనన్నాడు. సుశీల్ కుమార్ షిండే వంటి రాజకీయన నాయకుడు అగస్తి దుకాణం బయట తన డ్రెస్ కుట్టించుకునేందుకు వెయిట్ చేశాడు. ఫారుఖ్ అబ్దుల్లా ఢిల్లీలో విమానశ్రయ వీఐపీ లాంజులో ఎదురై తనకో డ్రెస్ కుట్టి పెట్టాలని కోరితే అక్కడే టేప్ పెట్టి కొలతలు తీసుకున్నాడు. పీవీ నర్సింహారావు అంతటివాడు ఫోన్ చేశాడని చెబితే ముందు తను అబద్ధమనుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం కోసం తన కొడుకు తెచ్చిన డ్రెస్ కాదని.. అగస్తీ కుట్టిన షేర్వాణీ ధరించాడు. బాల్ థాక్రే వంటి నాయకుడు తన టేబుల్ పై అగస్తీ విజిటింగ్ కార్డ్స్ ముందర పెట్టుకుని ఇతడి దగ్గరకు వెళ్లండంటూ సజెస్ట్ చేశాడు.
ఇవన్నీ నేటి సోషల్ మీడియా స్టార్ డమ్ తో పోలిస్తే పూర్తిగా భిన్నమైనవే. కానీ, సోషల్ మీడియా అంటే తెలియని రోజుల్లోనే ఈ బాంబే టైలర్ తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు.
నేటి స్టార్స్ గాల్లో విహరిస్తున్నారన్నది అగస్తీ మాట. మునుపటి వాళ్లల్లో ఉన్న వినయం నేడు కొరవడిందనేది ఆయన బాధ. రాజ్ కపూర్ అగస్తీని మాస్టర్ జీ అని పిలిచేవాడు. ఎంత స్టార్ డమ్ వచ్చినా.. నేల విడిచి సాము చేయనివారెలా ఉండేవారో తను చెబుతుంటాడు.
మునుపటి నటుల వ్యక్తిత్వానికి నాడు వారు ధరించే దుస్తులు అద్దం పట్టేవి. ప్రేం చోప్రా, ప్రాణ్ ఇలా వారి స్టైల్ చూస్తే వారేంటో తెలిసిపోయేది. కానీ, నేటి నటులను వారి దుస్తులను బట్టి గుర్తు పట్టలేమని.. ఫ్యాషన్ మాయలో అస్తిత్వమే మాయమవ్వడం విచారకరమంటాడు.
మొగాంబోకు క్యాస్టూమ్ తయారీ కూడా అంత సులువుగా ఏమీ జరగలేదు. అగ్రశ్రేణి విలన్ గా ఉన్న అమ్రీష్ పురి ఒంటిపై తన విలనిజాన్ని దుస్తులతోనే ప్రతిబింబించేందుకు భారతీయ జమీందారీ సోయగంతో పాటు.. ప్రాశ్చాత్య శైలి కూడా గోచరించేలా డిజైన్ చేయాలన్నాడు డైరెక్టర్ శేఖర్ కపూర్. దానికి అగస్తీ ఒక మాడల్ తయారుచేసి చూపితే అది శేఖర్ కపూర్ కు నచ్చలేదు. దాన్ని స్క్రాప్ లో పడేయమన్నాడు. దాన్నే ఛాలెంజింగ్ గా తీసుకుని మరింత రెచ్చిపోయి.. ఆ ఒత్తిడిలోంచే మొగాంబో క్యారెక్టర్ ను తన దుస్తులతో మరింత ఎలివేట్ చేశాడు అగస్తి.
జమీందారీ టచ్ కోసం డిజైన్ చేసిన నల్లకోటుకు గోల్డెన్ మోనోగ్రామ్ డిజైన్ తో అదరగొట్టాడు. అమ్రీష్ పురి విలనిజాన్ని వెండితెరపై అబ్బురపర్చేందుకు రాక్షసత్వానికి పరాకాష్ఠలా కనిపించే షూస్ ను తయారుచేయించాడు. మొగాంబే ఖుష్ హువా అనే మాస్ డైలాగ్ తో నాడు సెల్యూలాయిడ్ ను అమ్రీష్ పురి ఉర్రూతలూగిస్తే.. ఆ రూపం వెనుకున్నది అగస్తి.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాధవ్ అగస్తి కస్టమరే. సింప్లిసిటీ విత్ డీటైల్డ్ ఇదీ మోడీ దుస్తుల ప్రత్యేకత అంటాడతను. అందుకోసం చేతితో నేసిన ఖాదీ బట్టనెంచుకునేవాడినంటాడు. ఇక వినయం, ప్రతిభ ఇవి రెండూ తన దుస్తుల్లో ప్రదర్శితమవ్వాలనుకునే మరో ప్రముఖ వ్యక్తి అబ్దుల్ కలాంకు కూడా అగస్తీ డిజైనర్ గా పనిచేశాడు.
అగస్తీ బయోగ్రఫీ వేడుకలో నేటి స్టార్ హీరో అక్షయ్ కుమార్, స్టార్ కమెడియన్ జానీ లీవర్, గుల్షన్ గ్రోవర్ వంటి పలువురు వారి అనుభవాలను పంచుకున్నారు. నిద్ర లేని బాల్యాన్ని ముంబై రోడ్లపై అనుభవించాడు. కల్ కత్తాలో బతకడానికి, బెంగాలీ నేర్చుుకునేందుకు, దేవానంద్ కు తాను బట్టలు కుడతానని అబద్ధాలు చెప్పి ఉపాధి సంపాదించుకున్నాడు. ఎన్నో కష్టాలకోర్చి తన వృత్తి కళైన టైలరింగ్ లోనే ఛేదించి సాధించిన ఆత్మాభిమానం కల్గిన స్టార్ టైలర్ మాధవ్ అగస్తి.
ఒక గబ్బర్ సింగ్ ను తీర్చిదిద్దినా.. మొగాంబే దుస్తులతో భయపెట్టినా… తెల్లని శుభ్రమైన షర్ట్స్ పైన కాషాయ అంగవస్త్రం, ప్రత్యేకమైన శాలువాలతో థాక్రే వంటి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని డిజైన్ చేసినా.. ఈ అలంకరణలన్నీ అగస్తీ మస్తిష్కం నుంచి పుట్టినవే. అలాంటి అగస్తీ బయోగ్రఫీని ఆవిష్కరించేందుకు.. ఆయన 50 ఏళ్ల ప్రయాణం సందర్భంగా ముంబైలో జరిగిన స్వర్ణోత్సవ వేడుక మార్మోగిపోయింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్, సామాజిక కార్యకర్త ప్రియ దత్, బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, జాకీ ష్రాఫ్, బోనీ కపూర్, అనుపమ్ ఖేర్, గుల్షన్ గ్రోవర్ వంటి సినీ ప్రముఖులు అగస్తి సేవలను కొనియాడారు. ఒక సూది దారం పట్టుకుని బయల్దేరిన వ్యక్తి.. ఓ కుట్టు మిషన్ తో సృష్టించిన సంచలమెలా ఉంటుందంటే.. అగస్తి గుర్తుకొస్తాడు. అందుకే అగస్తీ బాంబే స్టార్ టేలర్.



