సీతాకోకల నందనవనం.. అరళం అభయారణ్యం!

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు అన్నాడు ఓ సినీకవి. ఎంత మంచిమాట! ఆ మాటను నిజం చేసింది ఇప్పుడు కేరళ. అవునూ, అలాంటి రంగుల సీతాకోకచిలుకల కథే ఇది.

అంతరించిపోతున్న మొక్కలు, జీవజాతిని కాపాడుకోవడం వైవిధ్యపరంగా ఎంత అవసరమో ఇవాల్టి ప్రకృతి మనకు ఎప్పటికప్పుడూ వివిధ రూపాల్లో పాఠంగా చెబుతూనే ఉంది. వాటిని సంరక్షించుకోకపోతే వాటిల్లే పరిణామాలు, దెబ్బతినే ఎకో సిస్టమ్ గురించి హెచ్చరిస్తూనే ఉంది. పులులు, సింహాలు, తోడేళ్లు, ఏనుగుల వంటివాటికి అభయారణ్యాలను ప్రత్యేకంగా తయారుచేస్తున్న రోజుల్లో… రాను రాను కనిపించకుండా పోతున్న సీతాకోకచిలుకలకూ ఓ అభయారణ్యముంటే ఎలా ఉంటుంది..? ఈ థాట్ పోలీసింగే కేరళలో మొట్టమొదటి సీతాకోకచిలుకల పార్క్ రూపకల్పనకు బీజం వేయించింది.

ప్రస్తుతం 266కు పైగా వివిధ జాతులతో భారతదేశంలోనే మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యానికి కేరాఫ్ అయింది కేరళ. ఇందుకోసం 25 ఏళ్లుగా చేస్తున్న కృషికి ఫలితంగా బటర్ ఫ్లైస్ సాంక్చురీ పార్క్ ఇప్పుడు అక్కడికొచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

కేరళ పశ్చిమ కనుమల్లో విహరించేవారికి ఇప్పుడు అరళం సీతాకోకచిలుకల పార్క్ ఓ అద్భుత దృశ్యం. ఎప్పుడో పూలపైన వాలి మకరందాన్ని జుర్రుకుంటున్న ఓ సీతాకోకచిలుకను జేబులో ఉన్న మోబైల్ తీసి కెమెరాలో బంధింద్దామంటే… దగ్గరికెళ్తేనేగానీ స్పష్టంగా ఫోటో రాదు. దగ్గరికెళ్లేలోపో, మోబైల్ తీసేలోపో అది వెళ్లిపోతుంది. ఇది ప్రకృతి ప్రేమికులకు సాధారణంగా ఎదురయ్యే ఓ సర్వసాధారణ ఘటన.

అలాంటిది అరలం పార్క్ కు వెళ్లితే కావల్సినన్ని సీతాకోకచిలుకలతో మనమిప్పుడు మాట్లాడొచ్చు. అవి చేసే సందడిని కళ్లారా చూడొచ్చు. ఆ పశ్చిమ కనుమల ప్రాకృతిక అందాలకు తోడు ఇంద్రధనస్సు భూమ్మీదకు దిగి వచ్చినట్టు కనిపించే రంగు రంగుల సీతాకోకల వయ్యారాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

మొన్నటివరకూ కన్నూర్ లోని అరళం వన్యప్రాణి అభయారణ్యంగా ఉన్న ఆ పార్క్ పేరును… కేరళ రాష్ట్ర వన్యప్రాణి బోర్డ్ 2025, జూన్ 18వ తేదీనే సీతాకోకచిలుకల అభయారాణ్యంగా మార్చింది. భారతదేశంలో పూర్తిగా సీతాకోకచిలుకలకు మాత్రమే ఉద్ధేశించిన 55 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన రక్షిత అటవీప్రాంతమిది. చాలాచోట్ల కనిపించే సీతాకోకచిలుకల్లోని 80 శాతం ఇక్కడ కనిపిస్తాయి. చాలాచోట్ల అంతరించినపోయిన జాతులు కూడా ఇక్కడ కనిపించడం ఇక్కడి మరో విశేషం.

ఎంత చిన్న జీవైనా వాటికీ ఓ గూడవసరమనే విధంగా ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేసి సీతాకోకచిలుకల అభయారణ్యాన్ని తీర్చిదిద్దింది కేరళ ప్రభుత్వం. ఏటా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఇక్కడికి వివిధ రకాల జాతుల సీతాకోకచిలుకలు వలస వస్తాయి. ఆ సమయంలో వెళ్లిన పర్యాటకులకు గుంపులు గుంపులుగా చెట్లపై వాలిన సీతాకోకచిలుకలను చూస్తుంటే… ఏ విన్సెంట్ వాన్ గోగో లేక సాల్వెడార్ డాలీనో కాన్వాస్ పై విదిలించిన రంగుల్లా కనిపిస్తాయి. ఇక ఫోటోగ్రాఫర్స్ కెమెరా క్లిక్స్ కు అయితే ఓ నందనవనం. వాటితో పాటే మన మనసూ విహరిస్తూ వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి రావడానికి కూడా ఆ మనసు ఒప్పుకోనంత పాకృతిక సౌందర్యానికి ప్రతీకలా కన్నూర్ అరళం అభయారణ్యం ఇప్పుడు పర్యావరణ ప్రేమికులను రారమ్మని పిలుస్తోంది.

1984 లో ఇక్కడి అరళంలో అభయారణ్యం ఏర్పాటయ్యాక.. ఈ మధ్య సుమారు 20 ఏళ్ల కాలం నుంచి ఈ అభయారణ్యం పరిశోధకులు, వన్యప్రాణి ప్రేమికులకు వారి అధ్యయనం కోసం ఒక ఫేవరేట్ స్పాట్ గా మారిపోయింది. మలబార్ నేచురల్ హిస్టరీ సొసైటీతో కలిసి రాష్ట్ర అటవీశాఖ సీతాకోకచిలుకల జాతులు, రకాలపై ప్రత్యేక సర్వేలూ నిర్వహిస్తోంది. ప్రతీ జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఇక్కడికొచ్చే సీతాకోకచిలుకల వలసపై శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహిస్తున్నారు.

ఇంకా ఇంకా కొత్త జాతులను కనుక్కోగల్గుతున్నామంటున్నారు ఇక్కడి వన్యప్రాణి అభయారణ్యం వార్డెన్ ప్రదీప్. 25 ఏళ్ల కష్టం తర్వాత ఒక రూపుకొచ్చిన అరళంలోని సీతాకోకచిలుకల అభయారణ్యం జీవవైవిధ్యంపై ఒక కొత్త ఆశను చిగురింపజేసేది. ఇలాంటి జీవివైవిధ్య ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రభుత్వాలు అందించాల్సిన నిధుల అవసరాన్ని, వాటి పరిరక్షణకూ తీసుకోవాల్సిన శ్రద్ధనూ తెలియజెప్పే ప్రతీక ఈ అభయారణ్యం.

భారతదేశంలోనే మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యంగా ఇప్పుడు అరళం అభయారణ్యం రికార్డుల్లోకెక్కింది. జీవవైవిధ్యానికి ఎందుకు విలువనివ్వాలో వివిధ ప్రభుత్వాలకు, సమాజానికి ఆ ప్రాధాన్యతను కళ్లకు కడుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles