స్టీల్ ఫ్రేమ్ కు తుప్పు పట్టిందా..?

తుకారాం ముండే పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కానీ, మరి ఇంతమంది ఐఏఎస్ లు, ఇతర అధికారులుంటే వారంతా ఒక తుకారాం ముండేలానో… లేక, అశోక్ ఖేమ్కాలానో, ఓ అన్నా రాజం మల్హోత్రాలానో ఎందుకు పని చేయలేకపోతున్నారనే చర్చకు తెరలేచింది.

బ్యూరోక్రసీలో అక్కడో ఇక్కడో తుకారంలాంటివారో, అశోక్ ఖేమ్కాలాంటివారో తారసపడితే వారి నిజాయితీ పెద్ద చర్చగా మారుతోంది. సమాజం నుంచి అనూహ్య ప్రశంసలందుకుంటోంది.

మరి మారాల్సిందేంటి.. ? అధికారులు వ్యవస్థను మార్చడమా… వ్యవస్థ అధికారుల పనితీరును మార్చడమా..?

భారతదేశ తొలి హోంశాఖా మంత్రైన సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్యూరోక్రసీని దేశానికి ఓ స్టీల్ ఫ్రేమ్ లా అభివర్ణించారు. కానీ, ఆ ఉక్కు కవచం అవినీతితో ఇప్పుడు తుప్పు పట్టిపోయింది.

పన్నుల నుంచి ప్రభుత్వ పథకాల వరకూ… అక్రమాల నియంత్రణ నుంచి పాలన వరకూ వారి నిర్ణయాలే వ్యవస్థలో కీలకం. కానీ, రాజకీయ ఒత్తిళ్లు, పై అధికారుల జోక్యంతో పాటు… దీపమున్నంతలో ఇల్లు చక్కబెట్టుకోవాలనే సంస్కృతి… పక్క అధికారి కోట్లు కూడబెడితే తాము ఏమీ సంపాదించుకోలేకపోతున్నామన్న ఆవేదన.. మొత్తంగా అధికారగణాన్ని.. వ్యవస్థనూ భ్రష్ఠు పట్టిస్తున్నాయి.

మరి అవినీతి ఎప్పుడూ లంచాలతోనే మొదలవుతుందా..?

మెరిట్ లిస్టులో పేరు వచ్చినప్పట్నుంచే కీలకమైన అధికారులకు చిన్న చిన్న బహుమతులు, అభినందనలు మొదలైతాయి. ఆ పరిచయాలు భవిష్యత్తులో రాజీకి బాటలు వేసేందుకే తప్ప… ముక్కూముఖం తెలియని వాళ్లు కూడా వచ్చి ఎందుకు అభినందిస్తున్నట్టు అన్న ప్రశ్న వేసుకుంటే భవిష్యత్తెలా ఉండబోతుందో విధుల్లోకెక్కకముందే అంచనా వేయొచ్చు.

ఒక్కసారి రాజీ పడితే.. ఇక జీవితమంతా రాజీనే. చిన్న చిన్న ఉల్లంఘనలతో మొదలై.. క్రమంగా వ్యవస్థలో అవినీతి సర్వసాధారణమైపోయే స్థాయికి చేరుతుంది.

మరి నిజాయితీగా ఉంటే అధికారులు మూల్యం చెల్లించాల్సిందేనా..?

మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా తన 33 ఏళ్ల కెరీర్ లో 57 సార్లు బదిలీ అయ్యాడు. ఇప్పుడు వార్తల్లో ప్రధానంగా నిలుస్తున్న తుకారాం ముండేదీ ఇదే పరిస్థితి. అయినా వెనక్కి తగ్గకుండా ముండే పని చేస్తూనే ఉన్నారు. మహారాష్ట్రలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా వచ్చిన కొద్దికాలంలోనే వెయ్యికిపైగా తనిఖీలు నిర్వహించి ఎక్కడికక్కడ కొరడా ఝళిపిస్తున్నాడు.

పూణేలో ఓ కార్యక్రమానికి వెళ్లిన ముండేను చూసిన జనం లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ తో చప్పట్లు చరిచి అభినందిస్తే ఓ నిజాయితీ కల్గిన ఆఫీసర్ కు లభించే కిక్కే వేరు. గమ్మత్తేందంటే బ్యూరోక్రసీలో తక్కిన అధికారగణమంతా అవినీతికి కేరాఫ్ గా మారిన సమయంలో.. ఓ ఆఫీసర్ తన పని తాను చేస్తేనే ఓ హీరో అయిపోయే పరిస్థితులు రావడం కూడా ఓ విషాదమే.

మరి పరిష్కారమేంటి..?

నిజాయితీ ఒక్కటే ఉంటే సరిపోదు. చట్టంపై అవగాహన, ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యం, సరైన వ్యూహం, అవసరమైన లౌక్యం ఇవన్నీ అవసరం. వీటన్నింటికంటే ముందు తాను ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారిననే మినిమం మ్యానర్స్ ఉండి తీరాలి. ఒక అధికారి వెళ్లిపోయినా కూడా తాను తీసుకొచ్చిన సంస్కరణలు ఇంకా కొనసాగడమే అధికారిగా వారు సాధించే పెద్ద విజయం.

కావల్సింది హీరోలా.. ? వ్యవస్థలో మార్పా..??

నేటి కాలంలో ఓ తుకారాం ముండే, ఓ అశోక్ ఖేమ్కా, ఓ డీ.ఆర్. మెహతా లాంటి అధికారులతో పాటు.. గతంలో ఓ ఎస్. ఆర్. శంకరన్ వంటి కొందరి పేర్లు ఇలాంటి జాబితాలో అక్కడక్కడా కనిపిస్తాయి. వీరిని చూసి చప్పట్లు కొట్టడం మంచిదే. కానీ, తమ పని తాము చేసిన అధికారులను చూసే చప్పట్లు కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న..?

అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న అధికారులంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ అధికారులుగా అవార్డులందుకుంటున్న తరుణంలో.. అలాంటివాళ్లే అర్హులుగా మారుతున్న రోజుల్లో… ఇలా ముండేలానో, ఖేమ్కాలానో అధికారులు కొరడా ఝుళిపిస్తే కచ్చితంగా వారే హీరోలవుతారు.

ప్రతీ శాఖలో మనకు హీరోలవసరం లేదు. ముండేలు, ఖేమ్కాల అవసరం అంతకన్నా లేదు. కానీ, ప్రతీ అధికారి తన విధిని నిజాయితీగా నిర్వర్తించే వ్యవస్థ తయారుకావాల్సి ఉంది. అప్పుడే వల్లభాయ్ పటేల్ చెప్పినట్టుగా స్టీల్ ఫ్రేమ్ తుప్పు పట్టకుండా ఉండగల్గుతుంది.

దేశంలోని బ్యూరోక్రసీ గుండెల మీద చేయి వేసుకుని.. మరి ఈ ప్రశ్న వేసుకోగల్గుతుందా…?

నెవ్వర్! అందుకే మనకు ముండే, ఖేమ్కాలు, వినోద్ రాయ్, అరుణా సుందర్ రాజన్ వంటి వీరే హీరోలు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles