మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. తగ్గుముఖం పడుతున్న తెలుగు నాయకత్వం: దశాబ్దకాలంగా సంక్షోభంలో సీపీఐ (మావోయిస్ట్) పార్టీ!
గత ఏడాది కాలంగా సీపీఐ మావోయిస్ట్ పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఛత్తీస్‌గఢ్ దట్టమైన అడవులు.. తెలంగాణా, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లో… భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో అనేక మంది అగ్రనేతలతో పాటు, క్యాడర్ కూడా పిట్టల్లా రాలిపోతోంది. అయితే, ఈ విషాదం మావోయిస్ట్ పార్టీకి ఏ కొందరి ప్రాణాలతోనో మాత్రమే ముడిపడింది కాదు.. మొత్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తన మేధో స్థావరాల్నీ, సైద్ధాంతిక పునాదుల్నీ వేగంగా కోల్పోతుందా అనేదే ఇప్పుడు జరుగుతున్న విస్తృత చర్చ.

మావోయిస్ట్ పార్టీలో కొన్ని దశాబ్దాలుగా ఆధిపత్య స్థాయిలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతస్థాయి మేధో నాయకత్వం వేగంగా క్షీణించడమే తన సైద్ధాంతిక పునాదుల్ని కోల్పోతోందనేందుకు ప్రధాన కారణం. ఎన్ కౌంటర్స్ లో అసువులుబాసినవారు కొందరైతే.. అనారోగ్య కారణాలతో మరణించినవారు కొందరు. ఇప్పటికీ భారత మావోయిస్ట్ పార్టీలో కొందరు ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ.. వారంతా వృద్ధాప్యానికి చేరుకోవడంతో ప్రస్తుత తరుణంలో యువతరమే తమ సైద్ధాంతిక భావజాలాన్ని వ్యాప్తి చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్ వంటి పేర్లతో జరుగుతున్న ఎన్ కౌంటర్స్ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీవైపు వెళ్లేవారెవరూ.. ? ఇదో పెద్ద ప్రశ్న..??
సో ఇప్పుడు ఉద్యమాన్ని నడిపించే సామర్థ్యం ఎవరి దగ్గర ఉందన్న ప్రశ్నకు అంతర్లీనంగా ఆ పార్టీనే పున: సమీక్షించుకోవాల్సిన తరుణమిది. ప్రస్తుత కాలమంతా మావోయిస్ట్ సంస్థ తన మనుగడ కోసం చేస్తున్న పోరాట సమయంగానే చూడాల్సి ఉంటుంది. చత్తీస్ గడ్, అబూజ్ మడ్ వంటి ప్రాంతాలపై ప్రభుత్వాలు ఫోకస్ చేయడంతో.. ఇప్పుడు అగ్రనాయకత్వమంతా సురక్షిత ప్రాంతాలనెంచుకునే పనిలో పడింది. దాంతో, గతంలో మావోయిస్ట్ భావజాల వ్యాప్తిలో భాగంగా కేడర్ కు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న దాఖలాలు కూడా ఇప్పుడు కనిపించకుండా పోయాయని కొందరు పేరు చెప్పడానికి ఇష్టపడని ఇంటలిజెన్స్ అధికారులే చెబుతున్న మాట.
నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైన మావోయిస్ట్ గ్రూపుగా ఎదిగిన సీపీఐ (మార్క్సిస్ట్- లెనినిస్ట్) పీపుల్స్ వార్.. బీహార్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో విస్తరించిన మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనం ద్వారా 2004, సెప్టెంబర్ 21వ తేదీన సీపీఐ (మావోయిస్ట్) పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ విలీనం కోసం 2003లోనే చర్చలు ప్రారంభమైనాయి. అయితే, అప్పటి పీపుల్స్ వార్ అగ్రనాయకత్వం ఆ తర్వాత అధికారంలోకొచ్చిన నాటి వైఎస్సార్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓవైపు చర్చలు జరుపుతుండగానే.. మరోవైపు, హైదరాబాద్ లో సీపీఐ (మావోయిస్ట్) ఏర్పాటును మరికొందరు నాయకులు ప్రకటించారు.
అలా ప్రకటించిన సీపీఐ (మావోయిస్ట్) పార్టీ.. 16 మంది సభ్యులతో బలమైన పోలిట్ బ్యూరో కల్గి ఉంది. అదే.. ఆ సంస్థ కార్యకలాపాలేవైనా నిర్ణయం తీసుకునే అత్యున్నత పీఠం. అలాగే, మరో 18 మంది సభ్యులను కూడా కలుపుకుని మొత్తం 34 మంది సభ్యులతో కేంద్ర కమిటీని కూడా నియమించింది. ఈ కేంద్రకమిటీ రెండో అత్యున్నత నిర్ణయాధికార వ్యవస్థగా పనిచేసేది.
సీపీఐ (మావోయిస్ట్) లో చాలావరకూ తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులే అగ్రస్థానాల్లో ఉండేవారు. గతంలో పీపుల్స్ వార్ కు నాయకత్వం వహించిన కరీంనగర్ జిల్లా బీర్పూర్ కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అప్పటి సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి- జగిత్యాల జిల్లా బీర్పూర్
ఇక ఇతర తెలుగు అగ్ర నాయకుల్లో చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్, మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ, నంబాల కేశవరావు అలియాస్ గంగన్న అలియాస్ బస్వరాజ్, సందె రాజమౌళి, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ సోను, తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్జీ, పటేల్ సుధాకర్ రెడ్డి, అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, చంద్రమౌళి, వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ శ్రీకాంత్, రాంచంద్రారెడ్డి అలియాస్ చలపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, కోబాడ్ గాంధీ అలియాస్ సలీమ్ వీరంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులే.
ఆ తర్వాత కాలంలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచే చాలామంది నాయకులు సీపీఐ (మావోయిస్ట్) పార్టీలో ఉన్నత స్థాయికెదిగారు. వారిలో జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న, మోడెం బాలకృష్ణ, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ విజయ్ అలియాస్ రాజు, పుల్లూరి ప్రసాద్ రావు, పాకా హనుమంతు అలియాస్ గణేష్ ఉయ్కే, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, సంజయ్ దీపక్ రావు, తక్కళ్లపల్లి వాసుదేవరావు, అనురాధ ఘండి, లంక పాపిరెడ్డి వంటివారెందరి పేర్లో చెప్పుకోవచ్చు.
2021లోని నిఘా సంస్థల నివేదిక ప్రకారం చూస్తే.. సీపీఐ (మావోయిస్ట్) పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న కేంద్ర కమిటీలో 21 మందికిగాను 10 మంది తెలంగాణాకు చెందినవారే. మరో ఇద్దరిది ఆంధ్రప్రదేశ్. అయితే, కేంద్ర కమిటీని మరింత బలోపేతం చేసే దిశలో కింద పనిచేస్తున్నవారిని కొందరిని కేంద్రకమిటీలోనూ నియామకాలు చేశారప్పుడు.
మావోయిస్ట్ భావజాలంవైపు మొగ్గుచూపి అడవుల బాట పట్టిన తెలుగువాళ్లల్లో చాలామంది ఉన్నత విద్యావంతులు. పలువురు నాయకులు పోస్ట్ గ్రాడ్యుయేట్స్. న్యాయవాద వృత్తిలోనూ రాణించినవారు, పీహెచ్డీలూ చేసినవారూ ఉన్నారు. అలాంటి తెలుగు బిడ్డలైన ఉన్నత విద్యావంతులే క్రమం తప్పకుండా శిక్షణా తరగతులు నిర్వహించేవారు. కార్యకర్తల్లో మార్క్సిజం, లెనినిజం, మావోయిస్ట్ భావజాల వ్యాప్తిని పెంపొందించేవారు. తద్వారా సంస్థకు మేథోబలంగా నిల్చారు. 90ల కాలంలో ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)లో పీహెచ్డీ చేస్తున్న రవిశర్మ అనే వ్యవసాయ శాస్త్రవేత్త కూడా అప్పటి పరిస్థితుల్లో మావోయిజం వైపు ఆకర్షితుడై బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని విభాగాలకు నాయకత్వం వహించారు.
కానీ, పరిస్థితులెప్పుడూ ఒకేలా ఉండవు. 2005-2009 మధ్య తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్ట్ ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా గ్రేహౌండ్స్ వంటి మావోయిస్ట్ వ్యతిరేక దళాలు ఆంధ్రప్రదేశ్ లో అణిచివేతను ప్రారంభించాయి. ఆ క్రమంలో బలమైన నిఘా నెట్ వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. అలా నాటి ఎన్ కౌంటర్స్ దెబ్బకు అగ్ర నాయకులందరూ తలో దిక్కుకు మూటాముళ్లె సర్దుకోవాల్సి వచ్చింది. కొందరు చత్తీస్ గఢ్ అడవుల్లోకి దారిపడితే.. మరికొందరు ఒడిశాకు తిరోగమనబాట పట్టారు.
ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి అప్పటికే జరుగుతున్న అణిచివేత కారణంగా తెలుగువారు అటువైపుగా చూడటమే మానేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల్లో కూడా నాటి రెవల్యూషనరీ మెంటాల్టీ తగ్గిపోయింది. మేథోపరమైన చర్చలూ తగ్గిపోయాయి. దాంతో రిక్రూట్ మెంట్ ప్రాసెస్ లో కొత్త నియామకాలు.. అందులోనూ తెలుగువారు పూర్తిగా తగ్గిపోతూ వచ్చారు.
గత దశాబ్ద కాలంలో చాలామంది మావోయిస్ట్ అగ్ర నాయకులు ఎన్ కౌంటర్స్ లో అసువులు బాసారు. మరికొందరు అనారోగ్య. వయసు సంబంధిత కారణాలు, దీర్క్షకాలిక వ్యాధులతో మరణించారు. అయినప్పటికీ, ఇప్పటికీ సీపీఐ (మావోయిస్ట్) పార్టీ కేంద్ర కమిటీలోనైనా, కేంద్ర సైనిక కమిషన్ లోనైనా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీల్లోనైనా తెలుగు రాష్ట్రాల నుంచి ఎదిగిన నాయకులదే పై చేయి.
సందె రాజమౌళి, చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్, మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ, పటేల్ సుధాకర్ రెడ్డి, రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, పాకా హనుమంతు అలియాస్ గణేష్ ఉయ్కే వంటి నాయకులెందరో ఎన్ కౌంటర్లలోనే మృతి చెందినట్టు వార్తలు చూశాం. కానీ, వాటిల్లో చాలావరకూ ధృవీకరించబడలేదు.
జిలుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న, నార్ల రవి, వారణాసి సుబ్రహ్మణ్యం, తక్కళ్లపల్లి వాసుదేవరావు, లంక పాపిరెడ్డి, కోబాడ్ గాంధీ వంటివారెందరో పోలీసులకు లొంగిపోయారు.
అయితే, ప్రస్తుతం సీపీఐ (మావోయిస్ట్) పార్టీ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో పోలీసులు, రాజ్యం ముప్పేట దాడితో ఎన్ కౌంటర్స్, లొంగుబాట్లు, అరెస్టులతో తెలుగువారి ఉనికి తగ్గిపోయి ఉండొచ్చు. అయినా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో మాత్రం పార్టీలోని కీలక బాధ్యతలను ఇప్పటికీ నిర్వర్తిస్తున్నవారిలో తెలుగువారి ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు.
చత్తీస్ గఢ్ పోలీసు తాజా అంచనా ప్రకారం సీపీఐ (మావోయిస్ట్) అగ్రనాయకత్వంలో ఇంకా 14 మంది తెలుగు నాయకులున్నారు. వారిలో నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్, ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ అలియాస్ సోను, మురళి, తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్జీ, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా, మోడెం బాలకృష్ణ, పుల్లూరి ప్రసాద్ రావు, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, పాకా హనుమంతు అలియాస్ గణేష్ ఉయ్కే, కొత్త రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్, టీఎల్ఎన్ చల్లం అలియాస్ ఆనంద్, పీ. కల్పన అలియాస్ సుజాత వీరంతా హిట్ లిస్టులో ఉన్నారు. అయితే, ఈ అగ్ర నాయకుల్లో చాలామంది వృద్ధులైపోయారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఉన్న బస్వరాజ్ ఇప్పుడు 70 ఏళ్ల మనిషి. గణపతికి 76 ఏళ్లు. ప్రస్తుతం గణపతి తన రహస్య స్థావరం నుంచి బయటకు కూడా కదల్లేని స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, సోనూ, బాలకృష్ణ, పుల్లూరి ప్రసాదరావు, రాంచంద్రారెడ్డి వంటివారైతే అరవై ఏళ్లకు పైబడ్డారు. మిగిలిన కీలక నాయకులు కూడా 50 ఏళ్ల పైబడ్డవారే ఉండటంతో ఇప్పుడు సీపీఐ (మావోయిస్ట్) పార్టీ ఉనికే తెలుగు అగ్రనాయకత్వ బలీహనతతో ప్రశ్నార్థకంగా మారింది.
అయితే, ఇప్పుడు సీపీఐ (మావోయిస్ట్) పార్టీ అస్తిత్వాన్నే కోల్పోతున్న దశలో.. మరోవైపు 2026 మార్చ్ నాటికి పూర్తిగా మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి సవాల్ చేస్తున్నాడు. ఈ క్రమంలో… తెలుగు రాష్ట్రాల నుంచి అటువైపుగా చూసేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. దీంతో, యువ నాయకత్వాన్ని తిరిగి తయారు చేసుకునేందుకు సీపీఐ (మావోయిస్ట్) పార్టీ దృష్టి ఇప్పుడు చత్తీస్ గఢ్, ఒడిశావైపు పడిందన్నది మరో చర్చ.



