దివంగత బీజేపీ నేత ప్రమోద్ వెంకటేశ్ మహాజన్ పేరు గుర్తుందిగా..? వాజ్ పాయ్ సర్కార్ లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి… ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మొహం.. కానీ, సొంత సోదరుడి చేతుల్లోనే కాల్పులకు గురై ముంబైలో అర్ధాంతరంగా తనువు చాలించాడు.

ఇప్పుడెందుకు ఆయన ముచ్చట అంటే.. ఆయన మర్డర్ పై మరోసారి విచారణ చేపట్టాలని ఆయన కూతురు పూనమ్ మహాజన్ కోరుతోంది. అందుకోసం ఏకంగా మహారాష్ట్ర హోంమంత్రితో పాటు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకూ ఆమె లేఖలు రాసింది.
2006, ఏప్రిల్ 22 వ తేదీన ప్రమోద్ మహాజన్ ముంబై వర్లీలోని తన నివాసంలోనే కాల్చి చంపబడ్డాడు. ఆ పని చేసింది అతడి సొంత సోదరుడు ప్రవీణ్ మహాజనే కావడం మరింత విషాదం. కుటుంబ కలహాలు అంత తారాస్థాయికి చేరడం వల్లే ఆ మర్డర్ జరిగిందనేదే ఇప్పటివరకూ మనకు తెలిసిన విషయం. కానీ, ప్రమోద్ మహాజన్ హత్య వెనుక కుట్రదారులు ఇంకెవరైనా ఉండొచ్చునన్న అనుమానం బలంగా ఆయన కుటుంబ సభ్యుల్లో ఉంది.
అదే విషయాన్ని ప్రమోద్ మహాజన్ కూతురు, మాజీ ఎంపీ పూనమ్ మహాజన్ ఇప్పుడు మరోసారి బయటకు వెల్లడించింది. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులకు లేఖలూ రాసింది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ రెండుచోట్లా బీజేపీ అధికారంలో ఉన్నందున… దర్యాప్తును మరోసారి చేపట్టాలని కోరింది.
ప్రమోద్ మహాజన్ ను మర్డర్ చేసిన కేసులో ఆయన సోదరుడు ప్రవీణ్ మహాజన్ నాల్గు రౌండ్ల కాల్పులు జరిపాడు. అందుకు ప్రవీణ్ కు 2007, అక్టోబర్ 30న జీవితఖైదు విధించింది కోర్ట్.
అయితే, ఆ మర్డర్ జరిగినప్పట్నుంచే ప్రమోద్ మహాజన్ కుటుంబం ఆ హత్య వెనుక కారణాలపై అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దాన్ని కేవలం కుటుంబ కలహాల నేపథ్యంగా చిత్రీకరించి… లొంగిపోయి జైల్లో పడ్డ దోశి శిక్షతో మాత్రమే పరిమితం చేయవద్దని.. హత్య వెనుక ఇంకేమైనా రాజకీయ కారణాలున్నాయా.. లేక, ఇంకెవరైనా ప్రవీణ్ ను హత్యకు పురిగొల్పారా అనే వివిధ కోణాల్లో దర్యాప్తు చేయమని కోరుతోంది. ఈ క్రమంలో మరోసారి దివంగత కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ కూతురు, మాజీ ఎంపీ పూనమ్ మహాజన్ కేంద్ర, రాష్ట్రాల హోంమంత్రులకు లేఖలు రాయడంతో ఇప్పుడు మళ్లీ ప్రమోద్ మహాజన్ మర్డర్ కేస్ చర్చల్లోకొచ్చింది.



