వివాదాలు, విజయాలు.. రెండూ చూసిన ఉద్యమ నాయకుడు ఆ దిషోం గురు!

గిరిజన గూడాల నుంచి పార్లమెంట్ వరకూ.. శిబుసోరెన్ ప్రయాణం!

గిరిజన నాయకుల్లో సమకాలీన రాజకీయాల్లో అత్యంత ప్రభావం కనబర్చిన నాయకుడిగా శిబుసోరెన్ ది ప్రత్యేక స్థానం. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపడుకిగా.. అసలు జార్ఖండ్ వంటి రాష్ట్ర ఏర్పాటుకు ఓ రూపశిల్పిగా ప్రస్తుత రాజకీయాల్లో ఎప్పటికీ నిల్చిపోయే పేరు శిబుసోరెన్. 81 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన సోరెన్ ను సంతాల్ సమాజమంతా దిషోం గురు అని పిల్చుకుంటుంది. అట్టడుగువర్గాల పోరాటస్ఫూర్తిగా, గిరిజన నాయకత్వానికి ఓ దృఢసంకల్పంలా ఎదిగిన సోరెన్.. జార్ఖండ్ రాజకీయాల్లో ఒక శకానికి ముగింపు.

1944, జనవరి 11వ తేదీన బీహార్ లో జన్మించాడు. సొంతూరు రామ్ గఢ్ జిల్లా నెమ్రా. కొన్ని వ్యక్తిగతంగా తనకెదురైన విషాదాలు, సామాజిక పోరాటాలే ఆయన రాజకీయ ప్రయాణంలో కీలకపాత్ర పోషించాయి.

ఓ పక్షిని దూరంగా కొట్టే ప్రయత్నంలో తన తండ్రి వల్ల ఓ పక్షి చనిపోవడం.. 9 ఏళ్ల వయస్సులోనే శిబు సోరెన్ ని కలిచివేసింది. ఆ పక్షికి తానే లాంఛనంగా దహన సంస్కారాలు నిర్వహించి.. ఆ తర్వాత మాంసం తినడాన్నే మానేశాడు శిబూ సోరెన్. అంతేకాదు, ఆ ఘటన ఆయన్ను గాంధేయమార్గంలో అహింసావాదిగా మార్చేసింది.

బీహార్ లోని మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వడ్డీవ్యాపారులు, భూస్వాములు.. జార్ఖండ్ గిరిజన అటవీ ప్రాంతాల్లోని భూములను దురాక్రమణ చేసి అమాయకులను వేధిస్తుండటంతో చిన్ననాటే శిబు సోరెన్ తిరుగుబావుటా ఎగురేశాడు. 18 ఏళ్ల ప్రాయం సంతాల్ నవయువక్ సంఘ్ ను ఏర్పాటు చేశాడు. వడ్డీవ్యాపారులను ఎదిరించినందుకు.. ఉపాధ్యాయుడైన తన తండ్రి సోబరన్ సోరెన్ హత్య.. శిబు సోరెన్ లో రాజకీయ సంకల్పానికి మొదటి బీజం వేసింది. గోలా బ్లాక్ సమీపంలోని లుకైయా తాండా అటవీప్రాంతంలో వడ్డీ వ్యాపారుల చేతుల్లోనే.. 1957, నవంబర్ 27వ తేదీన సోబరన్ సోరెన్ హత్యకు గురైనట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ధంకట్ని ఉద్యమంతో దిషోం గురువుగా ఎదుగుదల!

1960ల కాలంలో గిరిజనులు తాము పండించే వరి పంటలో కొంత భాగాన్ని వడ్డీవ్యాపారులకు ఇవ్వాల్సిన దురాచారాన్ని ఎదుర్కోవడానికి శిబు సోరెన్ ధంకట్ని ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. గిరిజన జనాభాను సంఘటితం చేసి.. మోటార్ సైకిళ్లపై గ్రామాల్లో పర్యటించి అక్కడ ధైర్యానికి మారుపేరుగా మారాడు.

పలు దిశల్లో గిరిజనులకు నాయకత్వం వహించి వారికి ఒక మార్గదర్శిలా నిల్చాడు శిబు సోరెన్. అందుకే ఆయన గౌరవార్థం సంతాల్ సమాజం ఆయన్ను దిశోం గురువుగా పిల్చుకుంది. ఒక గురువుగా ఆయనపై వారికుంటే భక్తికి చిహ్నంగా శిబు సోరెన్ ఎదిగిన తీరు ఓ విశేషం.

రాజకీయ ప్రయాణంతో జార్ఖండ్ రాష్ట్ర సాధన!

1973లో శిబు సోరెన్ ఏ.కే. రాయ్, బినోద్ బీహారీ మహతాలతో కలిసి జార్ఖండ్ ముక్తి మోర్చాను స్థాపించారు. ఆ పార్టీ స్థాపించిన అనతికాలంలోనే ప్రత్యేక గిరిజిన రాష్ట్రాన్ని ప్రకటించాలనే డిమాండ్ చేసే ఒక రాజకీయ చైతన్య గొంతై నినదించింది. మొత్తంగా దశాబ్దాల ఆందోళన తర్వాత.. శిబు సోరెన్ ఉద్యమంతో… 2000 సంవత్సరం, నవంబర్ 15వ తేదీన బీహార్ నుంచి వేరుపడి ఓ నూతన రాష్ట్రంగా జార్ఖండ్ ఆవిర్భవించింది. ప్రాంతీయపార్టీలు ఏం సాధించవచ్చో తెలియజెప్పింది శిబు సోరెన్ ఉద్యమం. ఆ తర్వాత తెలంగాణా రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్ వంటి ఉద్యమనేతలకూ శిబు సోరెన్ ఓ ఆదర్శప్రాయుడు, మార్గదర్శిగా నిల్చారు.

జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత శిబు సోరెన్ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ, ఆయన పదవీకాలం మొత్తం అస్థిరంగా కొనసాగింది. అలయెన్స్ గవర్నమెంట్ కావడంతో ఆయన 2005లో అధికారం చేపట్టి.. మార్చ్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మాత్రమే పదిరోజుల సీఎంగా కొనసాగారు. ఆ తర్వాత 2008 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2010 వరకూ కూడా ఆయన ముఖ్యమంత్రిత్వంలో స్వపక్షంలోనే విపక్షంలా మారిన పార్టీల పొత్తుతో అస్థిరతకు మారుపేరుగా మారిపోయింది.

కేంద్రంలోనూ ప్రభావవంతమైన పాత్ర!

శిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా నేతగా జార్ఖండ్ రాష్ట్ర సాధనలో కీలక ఉద్యమకారుడిగానే కాదు.. అటు కేంద్రంలోనూ తన ప్రభావాన్ని కనబర్చాడు. ఆరుసార్లు దుమ్కా లోక్ సభ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సోరెన్.. 2004 నుంచి 2006 మధ్య మూడు యూపీఏకు సంబంధించి వేర్వేరు పర్యాయాల్లో మూడుసార్లు కేంద్రంలో బొగ్గుశాఖా మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, ఆయన 2004లో అరెస్టయ్యారు. 1975 చిరూధి ఊచకోత కేసుకు సంబంధించి ఆయన అభియోగాలనెదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ వచ్చి తిరిగి కేంద్రమంత్రి వర్గంలోకి వచ్చినప్పటికీ.. ఆ కేసులో ఆయన ప్రమేయంపై వచ్చిన ఆరోపణలు.. ఆయన రాజకీయ జీవితాన్ని నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.

2006 నవంబర్ లో ఢిల్లీ హైకోర్ట్ కూడా శిబు సోరెన్ ను దోషిగా నిర్ధారించింది. తన మాజీ సహాయకుడైన శశినాథ్ ఝా హత్య కేసులో ఆయన ప్రమేయంపై స్పష్టమైన తీర్పునిచ్చింది. అయితే, ఆ కేసు జాతీయస్థాయిలో శిబు సోరెన్ రెండో కోణాన్ని చర్చకు పెట్టింది. కానీ, ఆ తర్వాత ఆ కేసులో సుప్రీం కోర్ట్ తీర్పుతో సోరెన్ నిర్దోషిగా విడుదలయ్యారు.

ఒక గిరిజన నాయకుడిగా తన జీవితాన్ని అడవుల్లో, మట్టిలో ప్రారంభించి.. మంచి, చెడు ఇలా రెండు ఎత్తుపల్లాలను చూస్తూ.. ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా సోరెన్ అటు జార్ఖండ్ రాష్ట్రం వరకే పరిమితం కాకుండా.. జాతీయ స్థాయిలోనూ ప్రభావం చూపించగల్గాడు. 2007లో దేవఘర్ జిల్లాలోని దుమారియా సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ పైన బాంబులు విసిరినప్పుడు ఆ హత్యాయత్నం నుంచి బతికి బట్టకట్టాడు సోరెన్.

2020లోనూ రాజ్యసభకు ఎంపికైన సోరెన్ దశాబ్దాల కాలంపాటు జార్ఖండ్ రాజకీయాలను శాసించారు. ఆయన రాజకీయ వారసత్వం కూడా ఇప్పుడాయన బాటలో నడుస్తోంది. మొన్నటి 2025 ఏప్రిల్ వరకూ కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడిగా నాయకత్వం వహించారు. ఆయన కుమారుడు, ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేవరకూ కూడా పార్టీని బలంగా నడిపిస్తూ వచ్చారు శిబు సోరెన్.

సోరెన్ కు భార్య రూపీ సోరెన్.. ముగ్గురు కుమారులు, కుమార్తె అంజనీ సోరెన్ ఉన్నారు. అంజనీ సోరెన్ ప్రస్తుతం ఒడిశా విభాగ జేఎంఎంకు నాయకత్వం వహిస్తోంది. పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ 2009లో మరణించగా.. చిన్న కుమారుడు బసంత్ సోరెన్ ప్రస్తుతం దుమ్కా సిట్టింగ్ శాసనసభ్యుడిగానూ.. అన్న ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్ లో మంత్రిగానూ పనిచేస్తున్నాడు.

శిబు సోరన్ రాజకీయ జీవిత ముగింపుతో ఒక శకమే సమాప్తమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. ఐదు దశాబ్దాలకు పైగా ఆయన రాజకీయ జీవితంలో అత్యంత ప్రభావిత శక్తిగా ఎదిగారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించారు. ఇవాళ జార్ఖండ్ వంటి రాష్ట్ర సాధనతో.. స్వయంపాలనతో ఎందరికో ఆయన ఓ అస్తిత్వాన్ని, గుర్తింపును తీసుకొచ్చిన గురువు.

ఒక అటవీ ప్రాంతంలోని గ్రామీణ తాండా నుంచి మొదలై రాజకీయంగా ఒక వ్యక్తి ఎదిగిన తీరు… ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఆ పోరు కచ్చితంగా ఒక లెగసీగా ఎప్పటికీ చెప్పుకోబడుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles