ఏనుగే.. ఆ గ్రామానికి జీవనోపాధి!

ఆ గ్రామానికి ఏనుగుతో బంధం విడదీయరానిది!

కేరళ మానవ సమాజానికీ, ఏనుగులకూ ఏదో అవినాభావ సంబంధముందా అనిపిస్తుంది. అక్కడి గురువాయుర్ ఆలయంతో పాటు.. మరికొన్ని గుళ్లల్లోనూ ఏనుగుల పెంపకం.. వాటితో ఆ దైవానికి జరిగే కైంకార్యాలు కనిపిస్తూ, వినిపిస్తుంటాయి. మిగతా సమాజంలో ఏనుగుల బీభత్సాలున్న చోట్లతో పోలిస్తే.. ఏనుగులపై ప్రేమ, వాటి పెంపకం, వాటి పట్ల అక్కడివారు కనబర్చే ఆప్యాయత.. ఇలా ఏనుగుకు ఒక ప్రత్యేక స్థానమే కనిపిస్తుందక్కడ.

అలాంటి కేరళలో ఓ గ్రామాన్నే ఏనుగులు గ్రామంగా పిలుస్తుంటారు తెలుసా..?

అలా అని అక్కడేం నిజమైన జీవమున్న ఏనుగులేం ఉండవు. కానీ, జీవం ఉట్టిపడే ఏనుగుల తయారీ జరుగుతుంది. ఆ ఏనుగు బొమ్మలు ప్రపంచ ప్రసిద్ధిగాంచి.. ఇప్పుడా గ్రామం ఓ ఇండస్ట్రీగానే రూపుదిద్దుకుంది.

ఆ ఊరి పేరు చేరపల్లి. కేరళ రాజధాని తిరువనంతపురానికి సమీపంలో ఉండే చేరపల్లిలో ఏనుగు బొమ్మల తయారీనే వారి జీవన విధానంలో ప్రధానభాగం. తరతరాలుగా వందలాది కుటుంబాలు అక్కడ ఈట్టి అని పిల్చుకునే.. రోజ్ వుడ్ తో ఏనుగుల ప్రతిమలు తయారు చేస్తున్నారు. అదే వారి జీవనోపాధిగా మారింది. కాలక్రమేణా చాలామంది ఇప్పటికే ఇతర వృత్తుల్లోకి మారిపోతున్నప్పటికీ… ఏనుగు శిల్పాల తయారీ అనే తరతరాలుగా వస్తున్న ఆ సంప్రదాయం ఇంకా అక్కడ కనిపిస్తుంది.

స్వాతంత్రానికి ముందే నాటి బ్రిటీష్ ఇండియాలో వారి అవసరాల కోసం నరికివేసే రోజ్ వుడ్ చెట్ల మొద్దుల నుంచి ఏనుగు శిల్పాల తయారీ ప్రారంభమైంది. తర్వాత్తర్వాతే అదే చేరపల్లి గ్రామం మొత్తం జీవనోపాధైంది. ఆరు దశాబ్దాలుగా ఇక్కడి శిల్పకారులంతా ఈ ఏనుగు బొమ్మలనే వివిధ రూపాల్లో ఆకట్టుకునేలా తయారుచేస్తూ.. తమ గ్రామం పేరుకు ఓ ప్రత్యేకతను సాధించిపెట్టారు. ఎందుకంటే వారు తయారు చేసే ఏనుగుల శిల్పాలను తీసుకెళ్లి ఏదైనా చిట్టడవి ప్రాంతంలో ఉంచితే.. కొత్తగా అక్కడికెళ్లినవారెవరైనా నిజమైన ఏనుగే అక్కడ ఉందేమోనన్నంత అచ్చెరువొందేలా వాటిని తీర్చిదిద్దడం ఇక్కడి శిల్పకారుల ప్రత్యేకత.

ఏనుగుల శిల్పాలకు ప్రజాదరణ.. తద్వార మరింత మంది ఆ వృత్తిలోకి!

డిఫరెంట్ సైజుల్లో… చెక్క ఏనుగులు ఇళ్లల్లో షోకేజ్ లుగా.. మ్యూజియాల్లో ఆకట్టుకునేవిధంగా… వీఐపీలకు, సెలబ్రిటీలకు చిరు సత్కారాలందించేలా… అయినవారికి బహుమతులిచ్చేలా వాటిని వివిధ రూపాల్లో మలుస్తుంటారు చేరపల్లి శిల్పులు. అలా చెక్క ఏనుగులకు కేంద్రంగా మారిన చేరపల్లి శిల్పులకు ఈ వ్యాపారమెప్పుడూ కూడా ఆర్థిక నష్టాన్ని మిగల్చలేదు. పైగా ఇప్పటివరకూ తమ గ్రామానికి ఓ ప్రత్యేకతను కల్పించడంతో పాటు.. ఇక్కడి ఏనుగు శిల్పుల్ని సుసంపన్నుల్ని చేసింది. అందుకే, దేశ, విదేశాల నుంచీ ఇక్కడికి వారి ఏనుగుల చెక్కబొమ్మల కోసం వస్తుంటారు.

కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా.. చేరపల్లి అంతర్జాతీయ ఖ్యాతిని పొందడమే విశేషం. ఈమధ్యే అమెరికాకు చెందిన ఓ కొనుగోలుదారు ఏకంగా 250 ఏనుగు శిల్పాలను ఆర్డర్ ఇవ్వగా… వారు కోరిన సమయంలోపు ఆ ఏనుగుల చెక్క విగ్రహాలను వారికందించింది చేరపల్లి శిల్పుల బృందం. అలా కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూరిజం ఔట్ లెట్స్ లో కూడా చేరపల్లి ఏనుగులను అమ్మకాల కోసం ప్రదర్శనకుంచుతారు. ఈ శిల్పాల ధర మినిమం 300 నుంచి మొదలై.. ఏకంగా ఏడు లక్షల విలువైన శిల్పాల వరకూ ఇక్కడ విక్రయిస్తుంటారంటారు.. ఏనుగుల శిల్పకళనే నమ్ముకున్న 75 ఏళ్ల శశిధరన్ వంటి శిల్పులు.

ఈ శిల్పకళకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇక్కడి మహిళలను ఈ ఏనుగు శిల్పాల పాలిషింగ్, అలంకరణకు ప్రోత్సహిస్తోంది. రాను రాను నాణ్యమైన కలప లభించకపోవడం ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అంటారు ఇక్కడి కళాకారులు. అయితే, అదే సమయంలో ఇక్కడికొచ్చే వినియోగదారులు మాత్రం రోజ్ వుడ్ ఏనుగు శిల్పాలంటేనే మక్కువ చూపుతారట.

ఆసక్తి కనబర్చని నేటితరం!

ప్రస్తుతం వాయినాడ్, ఇడుక్కి వంటి అటవీ ప్రాంతాల నుంచి రోజ్ వుడ్, కలపను ఇక్కడి కళాకారులు సరఫరా చేసుకుంటున్నారు. అయితే, రానురాను మారుతున్న కాలమాన పరిస్థితుల దృష్య్యా ఇప్పటివరకూ కొనసాగిన ఈ ఏనుగు శిల్పాల తయారీకి మొగ్గు చూపేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఓవైపు ఆదరణ పెరుగుతున్నకొద్దీ.. ఈ ఇండస్ట్రీలో పనిచేయడానికి విముఖత చూపేవారి యువత సంఖ్య అదే స్థాయిలో పెరగిపోతుండటం ఇప్పుడు ఈ ఏనుగుల గ్రామంలో కనిపిస్తున్న ప్రధానమైన ఆందోళన. అయినప్పటికీ.. ఏనుగు శిల్పాల తయారీ కేంద్రంగా తమ చేరపల్లి నిల్చిపోతుందనే మెండైన ఆత్మవిశ్వాసమూ కూడా ఇక్కడి కళాకారులు, శిల్పుల్లో కనిపిస్తోంది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles