ఏది సత్యం.. ఏది అసత్యం.. ఓ మహాత్మా, ఓ మహర్షి..? కిష్కింధకాండమేం చెబుతోంది..??

కొంచెం అబద్దం కూడా కావాలి ….!

………………………………………………………………………………………………………………..

Vamsy Krishna… ✍🏻

సత్యం, శివమ్, సుందరం. నిజమే సత్యమే సుందరం. కానీ జీవితం నడవాలి అంటే కేవలం సత్యం మాత్రమే సరిపోదు. అసత్యం కూడా కావాలి. కొంచెం అబద్దం కూడా కావాలి. ప్రియంచ నానృతం బ్రూయాత్ . అప్రియమైన సత్యమే చెప్పాలి. కానీ ఒక్కొక్క సారి సత్యాన్ని తట్టుకునే శక్తి మనిషికి ఉండదు. అందుకే కొంచెం అబద్దం కూడా కావాలి అనేది. ఎవరికీ ఏ ప్రయోజనమూ కలిగించని సత్యం ఏం చెప్తాం ? అని ప్రశ్నిస్తుంది అపర్ణా బాలమురళి కిష్కింధాకాండం అన్న సినిమాలో. సినిమా ముగింపు వాక్యం కూడా అదే. “జీవితం నడవాలి అంటే కొంత అబద్దం కూడా కావాలి “

అజయ్ చంద్రన్( ఆసిఫ్ ఆలీ )ఒక ఫారెస్ట్ ఆఫీసర్. నలభయి పైనే ఉంటాయి. మొదటి భార్య చనిపోతుంది కాన్సర్ తో. కొడుకు (చాచు)కనిపించకుండా పోతాడు. అపర్ణ ను (అపర్ణా బాల మురళి ) రెండవ పెళ్లి చేసుకుని ఇంటికి రావడం తో సినిమా మొదలు అవుతుంది. అజయ్ చంద్రన్ తండ్రి అప్పూ పిళ్ళై (విజయ రాఘవన్ ) ఒక ఆర్మీ మాజీ అధికారి. అది ఎన్నికల సమయం అవడం తో తుపాకీ లైసెన్స్ వున్న వాళ్లకు అందరినీ తమ దగ్గర ఉన్న తుపాకులను పోలీస్ స్టేషన్ లో అప్పగించమని పోలీస్ అధికారులు కోరుతారు. అప్పూ పిళ్ళై కి కూడా తుపాకీ లైసెన్స్ వుంది కానీ తుపాకీ ఎక్కడి మిస్ అవుతుంది. అందులో రెండు బుల్లెట్స్ కూడా కనిపించవు. ఈ నేపధ్యం లో కథ మొదలు అవుతుంది.

దర్శకుడు ఒక్కొక్క పొరా విప్పుకుంటూ ప్రేక్షకుడిని ఉత్కంఠ కి గురిచేస్తూ కథను మెల్లగా నడిపిస్తాడు. మిస్ అయిన తుపాకీ , రెండు బుల్లెట్స్ కి సంబంధించిన ప్రశ్నలు వేధిస్తూ ఉండగానే అప్పూ పిళ్ళై స్నేహితుడు అమృత్ లాల్( నిజల్గళ్ రవి )అజయ్ చంద్రన్ కి ఒక రహస్యం చెప్తాడు. అప్పూ పిళ్ళై ని తనకు వున్న మతిమరపు కారణంగా ఆర్మీ నుండి వెనక్కు పంపారని. అప్పటిదాకా తండ్రికి మతి మరుపు ఉన్నదని అజయ్ కి తెలియదు .

సరిగ్గా అప్పుడే దర్శకుడు మరొక పొర విప్పుతాడు. అప్పూ పిళ్ళై రెండేళ్ల క్రితం మరొకరికి అమ్మిన స్థలంలో మూడేళ్ళ క్రితం చనిపోయిన ఒక కోతి అస్థిపంజరాన్ని పోలీసులు కనుగొంటారు. పోలీసుల అనుమతి తీసుకుని ఫోటోలు తీసుకోవడానికి వచ్చిన ఒక ఫోటోగ్రఫీ జంట తీసిన ఒక ఫొటోలో ఒక కోతి చేతిలో తుపాకీ కనపడుతుంది. ఆ తుపాకీ తనదే అని అప్పూ పిళ్ళై ఒప్పుకుంటాడు. ఆ తుపాకీ కోతి చేతిలోకి ఎలా వెళ్ళింది? మిస్ అయిన రెండు బుల్లెట్లు ఎక్కడకు పోయాయి?

అప్పూ పిళ్ళై అనుమానాస్పద ప్రవర్తన అపర్ణని జరుగుతున్న సంఘటనలని తనదైన కోణంలో చూడటానికి అవకాశాన్ని కల్పిస్తాయి. మనుషులను గుర్తుపెట్టుకోవడానికి.. తనకు మతి మరపు లేదని సమాజాన్ని నమ్మించడానికి అప్పూ పిళ్ళై రాసుకుంటున్న చిన్న చిన్న నోట్సులు, వాటిని పట్టుకుని అపర్ణ చేసిన అన్వేషణ వలన తుపాకీ మిస్ అవలేదు అది అప్పూ పిళ్ళై గదిలో టేబుల్ డ్రాయర్ లో భద్రంగా ఉండటాన్ని దర్శకుడు రివీల్ చేస్తాడు.

ఒకరోజు అజయ్ బయటి నుండి ఇంట్లోకి వచ్చేసరికి గదిలో చాచు చనిపోయి రక్తం మడుగు లో పడి ఉంటాడు. భార్య ప్రవీణ దిగ్భ్రాంతి తో అలా పిచ్చి చూపులు చూస్తూ కూర్చుని కనిపిస్తుంది. అజయ్ భార్యని కుదుపుతూ పలకరిస్తున్నప్పుడు ఆమె వేసుకున్న టాబ్లెట్స్ రాపెర్ చూసి గబగబా హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. తిరిగి వచ్చేసరికి గదిలో చాచు శవమూ ఉండదు

” ఈ రహస్యం నాతోనే ఉండిపోనీ! నా చివరి శ్వాస వరకు ” అని అంటాడు జార్జి కుట్టి (మోహన్ లాల్ ) దృశ్యం లో. ఆ రహస్యం రాణి (మీనా ) కి తెలిసిపోవడంతో దృశ్యం రెండు వచ్చింది. జార్జి కుట్టికి రహస్యాన్ని దాచి పెట్టడం తప్ప మరొక ఛాయిస్ లేదు. అది అతడికి వున్న ఏకైక అప్షన్ . ఇందులో చాచు ఏమైనాడు అన్న రహస్యాన్ని దాచి పెట్టడం కూడా ఛాయిస్ కాదు.

కిష్కింధా కాండ ప్రారంభం కావడంతో అప్పటివరకు ఒక సమరేఖ మీద నడచిన రామాయణం ఒక మలుపు తిరుగుతుంది. ఇక్కడ ఈ కిష్కింధాకాండం లో కూడా ఒక కోతి మరణం కథను మలుపు తిప్పుతుంది

సత్యం తెలిస్తే ఏమవుతుంది ? సత్యం తెలియక పోతే ఏమవుతుంది ? నిజానికి సత్యం మాత్రమే కాదు అబద్దం కూడా ఒక రియాలిటీనే! ఒక మనిషి తనకు తాను కావాలని ఎన్నుకున్న మరొక రియాలిటీలో బతకడానికి ఈ సమాజంలో అవకాశం ఉందా ? ఏది సత్యం? ఏది అసత్యం ఓ మహాత్మా ఓ మహర్షీ

అప్పూ పిళ్ళైగా విజయ రాఘవన్ చాలాసేపు వెంటాడుతాడు. ఆసిఫ్ ఆలీ బాగా చేసాడు. అపర్ణా బాలమురళికి వంక పెట్టడానికి వీలే లేదు. కేవలం 7 కోట్లతో తీసిన ఈ సినిమా 75 కోట్లు వసూల్ చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles